మే 3వ తేదీ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే సంస్థ నిర్వహించిన ఒక సర్వేలో మన దేశం పత్రికా స్వేచ్ఛలో 150వ స్థానంలో వుంది. ఆరేళ్ల క్రితం మన స్థానం 133. మోదీ వచ్చిన తర్వాత 17 స్థానాలు పడిపోయాం. మనకంటే చిన్న దేశాల్లో కూడా ఈ పరిస్థితి లేదు. అసలు పత్రికా స్వేచ్ఛ అంటే ఏంటి? నిజంగా జర్నలిస్టులకి స్వేచ్ఛ ఉందా? ప్రపంచం సంగతి పక్కన పెడితే మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పత్రికా స్వేచ్ఛ అంటే పత్రికా యజమానుల స్వేచ్ఛ మాత్రమే! జర్నలిస్టుల స్థితిగతుల గురించి మాట్లాడే ముందు ఒక చిన్న ఉదాహరణ చెబుతా.
నాకు తెలిసిన స్విగ్గీ కుర్రాడున్నాడు. ఇంటర్ వరకూ చదివాడు. రోజుకి ఆరు నుంచి ఎనిమిది గంటలు పని చేస్తాడు. నెలకు 20 వేల నుంచి 30 వేలు సంపాదిస్తాడు (టిప్స్‌తో కలిపి). నచ్చని రోజు పని మానేసి సెలవు తీసుకుంటాడు.
ఒక కుర్ర జర్నలిస్టు వున్నాడు. ఏడాది నుంచి ఒక ప్రముఖ పత్రికలో పని చేస్తున్నాడు. పీజీ చదివాడు. తెలుగు భాష బాగా తెలిసిన వాడు. సమాజం , రాజకీయాలపై అవగాహన ఉంది. రోజుకి 8 నుంచి 10 గంటలు పనిచేస్తాడు. ఇంటి దగ్గర ఎండలో సాయంత్రం 4 గంటలకు బయల్దేరి అర్ధరాత్రి ఇంటికొస్తాడు. ఆఫీస్ ఫోర్‌లేన్ హైవేలో ఉంది. ఒకసారి ప్రమాదానికి గురై ఆస్పత్రిలో కూడా ఉన్నాడు. ఒక్కోసారి వీక్లీ ఆఫ్ కూడా వుండదు. అతని జీతం రూ.15 వేలు. పదేళ్ల సర్వీస్ వుండి పాతిక వేలు దాటని వాళ్లు కూడా ఉన్నారు. స్విగ్గీ బాయ్‌తో ఎందుకు పోల్చానంటే జర్నలిస్టులంటే తోపులు, తురుం ఖాన్లు అనే భావన సొసైటీలోనూ వుంది, జర్నలిస్టుల్లో కూడా వుంది, అందుకు పోలిక.
శ్రీకృష్ణపాండవీయం సినిమాలో శకునిని బందీగా పట్టుకున్న దుర్యోధనుడు వాళ్ల కోసం మనిషికో మెతుకు చొప్పున అన్నం మెతుకులు విసురుతాడు. పత్రికా యాజమాన్యాలు కూడా ఇంతే. దీంట్లో ఏ ఒక్కరూ మినహాయింపు కాదు. రామోజీ ఫిల్మ్ సిటీపై అవసరమైతే సాక్షిలో ఒక వార్త వస్తుంది కానీ, ఈనాడులో జీతాలు ఎందుకు తగ్గించారో రాదు. భారతి సిమెంట్పైన ఈనాడులో కథనం రావచ్చు కానీ, సాక్షిలో జీతాల గురించి ఎప్పటికీ రాదు. ఎందుకంటే జర్నలిస్టుల విషయంలో ముగ్గురూ ఒకటే. జర్నలిస్టులు మాత్రం సత్యం కోసం నిలబడాలి. సత్యంలో కూడా అనుకూల, ప్రతికూల సత్యాలు వుంటాయి.
3 పత్రికలకూ ఎడిటర్లు వుంటారు. సహజంగా వాళ్లు మేధావులై వుంటారు. ఉక్రెయిన్ యుద్ధం గురించి, మోదీ పాలసీల గురించి వ్యాసాలు రాస్తూ వుంటారు. తమ పత్రిక సమర్థించే పార్టీ గురించి అనుకూల సత్యాలు వ్యాపింపచేయడం వీళ్ల పని. జాతీయ అంతర్జాతీయ విషయాల్లో వీళ్లకి చాలా స్వేచ్ఛ వుంటుంది. అంతే తప్ప తమ టీంలో పనిచేసే సబ్ ఎడిటర్ 15 -20 వేలకు ఈ అధిక రేట్లలో ఎలా బతుకుతున్నాడో మాట్లాడే స్వేచ్ఛ వుండదు. వీళ్ల పరిధి, పరిమితి అంతే. వీళ్లు జీతగాళ్లే, కాకపోతే పెద్ద జీతగాళ్లు.
జర్నలిస్టుల జీతభత్యాలు ఈ రకంగా ఉండడానికి పత్రికా నిర్వహణలో నష్టాలు రావడమే అనే వాదన వుంది. తయారైన ధర కంటే తక్కువ ధరకి అమ్మే ఏకైక ప్రొడక్ట్ పత్రిక మాత్రమే అని కూడా అంటారు. నిజమే. కానీ పత్రికలతో వచ్చే ఇతర ప్రయోజనాల మాట?
ఈనాడు లేకపోతే రామోజీ ఎంఫైర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆంధ్రజ్యోతి లేకపోతే రాధాకృష్ణ ఒక రిటైర్డ్ జర్నలిస్టు మాత్రమే. సాక్షి లేకపోతే వైఎస్ రాజశేఖరరెడ్డి మృతి తర్వాత జగన్‌ని మీడియా అంతా కలిసి ఒక మూలకు తోసేసేవాళ్లు. జగన్, షర్మిల సభలకి లక్షల మంది హాజరైతేనే పట్టించుకోని పత్రికలు తెల్లారి జగన్ భారీగా గెలుపు సాధిస్తాడని గుర్తించక తెలుగుదేశానికి ఎడ్జ్ ఉందని రాసే పత్రికలు ఉన్న రాష్ట్రంలో సాక్షి లేకపోతే జగన్ గతేంటి?
జర్నలిజం మీద వ్యామోహంతో వచ్చేవాళ్లు కూడా ఈ దుర్మార్గపు జీతాలు, వర్కింగ్ కండీషన్స్ భరించలేక పారిపోతున్నారు. 1987లో తిరుపతిలో సబ్ ఎడిటర్ల టెస్ట్ పెడితే 1000 మంది హాజరయ్యారు. 2022లో అదే తిరుపతిలో టెస్ట్ పెడితే హాజరైంది ఎందరో తెలుసా? ముగ్గురు మాత్రమే.
పొరపాటున ఒక వాలంటీర్ 100 తీసుకుంటే బాక్స్‌లు కట్టి రాసే పత్రికలు ఆయా మండల కేంద్రాల్లో తమ విలేకరులు 1000, 2000 డబ్బులకి ఎలా బతుకుతున్నారో ఆలోచించవు. సింపుల్‌గా చెప్పాలంటే విలేకరులకి దందా లైసెన్స్ ఇచ్చి సంవత్సరానికి ఇంత అని యాడ్స్ టార్గెట్స్ ద్వారా తమ వాటాని తీసుకుంటున్నాయి.
కార్మికుల కోసం పోరాడే కమ్యూనిస్టు పత్రికల్లో జర్నలిస్టుల వెట్టి చాకిరి గురించి మాట్లాడకపోతేనే మంచిది. ఉద్యోగుల సీపీఎస్ కోసం కదంతొక్కిన వామపక్షాలు తాము నిర్వహించే పత్రికలు, టీవీల్లోని ఉద్యోగులకు ఎంత న్యాయం చేశాయో కూడా ఆలోచించుకోవాలి.
ఇంకా దారుణం ఏమంటే జర్నలిస్టులకి ఇస్తున్న అత్యంత బరువైన అధిక జీతాలు భరించలేక కరోనా టైంలో ఆంధ్రజ్యోతి, ఈనాడులో చాలా మందిని తీసివేశారు కూడా (సాక్షిలో జరగలేదు). నేను రాసింది కేవలం ప్రింట్ మీడియా గురించి. టీవీ గురించి రాస్తే అది ఇంకా దుర్మార్గ వ్యవస్థ.
జీఆర్ మహర్షి