ఆన్ లైన్ మోసం.. ఈసారి 27 లక్షలు మాయం

ఆన్ లైన్ మోసాలకు మూలకారణం మనిషి అత్యాశ. మనం ఎంత ఆశపడితే ఆన్ లైన్ లో అంత త్వరగా మోసపోతాం. దీన్నే పెట్టుబడిగా చేసుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతుంటారు. ఇలా అత్యాశకు పోయిన ఓ…

ఆన్ లైన్ మోసాలకు మూలకారణం మనిషి అత్యాశ. మనం ఎంత ఆశపడితే ఆన్ లైన్ లో అంత త్వరగా మోసపోతాం. దీన్నే పెట్టుబడిగా చేసుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతుంటారు. ఇలా అత్యాశకు పోయిన ఓ వ్యక్తి, ఏకంగా 27 లక్షలు పోగొట్టుకున్నాడు. హైదరాబాద్ లో జరిగిన మరో బడా ఆన్ లైన్ మోసం ఇది.

సికింద్రాబాద్ కు చెందిన కరుణాకర్ రెడ్డి ట్రేడింగ్ చేస్తుంటాడు. దీనికి సంబంధించి సమాచారం కోసం ఆన్ లైన్ లో ఎక్కువగా వెదుకుతుంటాడు. అలా ఓ అపరిచితుడు కరుణాకర్ రెడ్డికి పరిచయం అయ్యాడు. తనకు ఒక ట్రేడింగ్ కంపెనీ ఉందని, పాతికేళ్లుగా లాభాల్లో నడిపిస్తున్నానని నమ్మించాడు. ఆ తర్వాత వాట్సాప్ కాల్ కూడా చేసి మాట్లాడాడు.

ఆ తర్వాత 'బీటీసీ వెల్త్ ఫేర్ 009' అనే వాట్సాప్ గ్రూప్ లో అతడ్ని చేర్చాడు. ట్రేడింగ్ లో భారీ లాభాలు పొందినట్టు కొన్ని స్క్రీన్ షాట్స్ అతడికి షేర్ చేశాడు. అపరిచితుడి మాటలు నమ్మిన కరుణాకర్ రెడ్డి, ముందుగా లక్ష రూపాయలు పెట్టాడు. ఈ లక్షకు కళ్లుచెదిరే లాభాలు అందించాడు అపరిచితుడు.

దీంతో కరుణాకర్ రెడ్డికి మరింత మరింత ఆశపుట్టింది. ఈసారి ఏకంగా 8 లక్షలు పెట్టాడు. ఆ 8 లక్షలకు 90 లక్షలు లాభం చూపించాడు అగంతకుడు. అయితే ఆ 90 లక్షలు కావాలంటే 20శాతం కమీషన్ ను ముందుగా చెల్లించాలని, 30శాతం టాక్స్ అడ్వాన్స్ గా కట్టాలని నమ్మబలికాడు. ఇదంతా నమ్మిన కరుణాకర్ రెడ్డి క్రిప్టో రూపంలో 18 లక్షలు, వివిధ రూపంలో మరో 9 లక్షలు సమర్పించుకున్నాడు.

అంతే, ఆ వెంటనే సైబర్ మోసగాడు కనెక్షన్ కట్ చేశాడు. వాట్సాప్ గ్రూప్ మాయమైంది. ఫోన్ నంబర్ కట్ అయింది. మోసపోయానని గ్రహించిన కరుణాకర్ రెడ్డి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.