ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోషల్ ఇంజనీరింగ్లో దిట్ట. ఇందులో ఆయనకు ఆయనే సాటి. తాజాగా రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో జగన్ రాజకీయ సమీకరణ ఆకట్టుకుంటోంది. ఇద్దరు బీసీ అభ్యర్థులకు రాజ్యసభ సీట్లు కేటాయించడం ద్వారా, జగన్ దూరదృష్టిని మెచ్చుకోకుండా ఎవరూ ఉండలేరు. సాక్ష్యాత్తు బీసీ ఉద్యమ నాయకుడు, ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను రాజ్యసభకు పంపాలని నిర్ణయించుకోవడం ద్వారా టీడీపీని కోలుకోలేదని దెబ్బ తీశారు.
బీసీ సామాజిక వర్గానికి ఆర్.కృష్ణయ్య పెద్ద దిక్కు. కృష్ణయ్య అంటేనే బీసీ సంఘమనే రీతిలో ఆయన పోరాటాలు చేశారు. బీసీల కోసం సుదీర్ఘ కాలంగా అలుపెరగని పోరాటాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాకు చెందిన ఆర్.కృష్ణయ్య తల్లిదండ్రులు రాములమ్మ, అడివప్ప గౌడ్. ఎంఏ, ఎల్ఎల్ఎం, ఎంఫిల్ పూర్తి చేసిన విద్యావంతుడు.
1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీ సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి బీసీల సంక్షేమం కోసం పని చేస్తున్నారు. 2014లో ఎల్బీ నగర్ నియోజక వర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి చట్టసభలో అడుగు పెట్టారు. నాడు టీడీపీ సీఎం అభ్యర్థిగా టీడీపీ ఆర్.కృష్ణయ్యను తెరపైకి తేవడం తెలిసిందే. 2018లో తెలంగాణలో ముందస్తు ఎన్నికలొచ్చాయి. టీడీపీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరారు. మిర్యాలగూడ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన వైసీపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నాడు వైసీపీ ఎన్నికల సభల్లో పాల్గొని బీసీలంతా జగన్కు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఏపీలో సగ జనాభా బీసీలే. జగన్కు మెజార్టీ బీసీలు మద్దతు ఇవ్వడం వల్లే వైసీపీకి 151 అసెంబ్లీ, 23 లోక్సభ సీట్లు వచ్చాయనేది వాస్తవం. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీలకు అత్యధిక ప్రాదాన్యం ఇస్తున్నారు.
ఏపీలో మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో టీడీపీ, జనసేన పొత్తు కుదుర్చుకుంటాయనే ప్రచారం జరుగుతోంది. పవన్ ప్రభావంతో మెజార్టీ కాపులు టీడీపీ వైపు పోయినా, బీసీలను పూర్తిస్థాయిలో తన వైపు నిలుపుకోవచ్చనే ఎత్తుగడలో భాగంగానే ఆర్.కృష్ణయ్య. బీద మస్తాన్రావులకు రాజ్యసభ సీట్లు ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆర్.కృష్ణ య్యకు రాజ్యసభ సీటు ఇస్తారని ప్రత్యర్థులెవరూ ఊహించలేదు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలనే చందంగా …జనసేనతో పొత్తు వల్ల టీడీపీకి అంతోఇంతో మద్దతుగా ఉన్న బీసీలు దూరమడం, ఇదే సందర్భంలో వైసీపీకి మరింత చేరువ అవుతారని జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేశారని చెప్పొచ్చు.
ఇక బీద మస్తాన్రావు విషయానికి వస్తే బీసీల్లో మంచి పలుకుబడి ఉంది. యాదవ సామాజిక వర్గం. ఇటీవల మంత్రివర్గంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన కారమూరి నాగేశ్వరరావుకు కేబినెట్లో చోటు కల్పించారు. ఇప్పుడు రాజ్యసభ సీటు కూడా ఆ సామాజిక వర్గానికి ఇవ్వడంతో యాదవులకు పెట్టపీట వేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు.
రాష్ట్రంలో అధికారాన్ని డిసైడ్ చేసే బీసీల ఆదరణ పొందేందుకు జగన్ వ్యూహం అద్భుతహః అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.