Advertisement

Advertisement


Home > Politics - Opinion

1970 ఫోన్ ఒక ల‌గ్జ‌రీ

1970 ఫోన్ ఒక ల‌గ్జ‌రీ

మే 17 ప్ర‌పంచ క‌మ్యూనికేష‌న్స్ దినం. ఒక‌ప్పుడు క‌మ్యూనికేష‌న్ లేని ప్ర‌పంచం. ఇపుడు ప్ర‌పంచ‌మంటే క‌మ్యూనికేష‌న్స్‌. సింపుల్‌గా చెప్పాలంటే ఒక వారం రోజులు ఇంట‌ర్‌నెట్ ప‌ని చేయ‌క‌పోతే వ్యాపారాల‌న్నీ స్తంభించిపోతాయి. నెల‌రోజులు లేకపోతే అనేక దేశాలు దివాళా తీస్తాయి. సెల్‌ఫోన్ లైన్స్ క‌ట్ అయిపోతే వారం రోజుల్లో మాన‌సిక వ్యాధిగ్ర‌స్తుల సంఖ్య పెరుగుతుంది.

1970 నాటికి మ‌నుషులు నేరుగా మాట్లాడే కాలం. అతి ముఖ్య విష‌యాలు (చావులు, పుట్టుక‌లు) చెప్పాలంటే టెలిగ్రాంలుండేవి. ఎవ‌రింటికైనా టెలిగ్రాం వ‌స్తే ఆ వీధి అంతా సంచ‌ల‌నం. ఇళ్ల‌లో ఫోన్ వుంటే షావుకార్ల కింద లెక్క‌. లోక‌ల్ డ‌య‌లింగ్  లేదు. ఆప‌రేట‌ర్ లైన్‌లోకి వ‌చ్చి క‌నెక్ట్ చేసేవాడు. టెలిఫోన్ కార్యాల‌యంలో లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి ట్రంక్ కాల్ బుక్ చేయాలి. గంట‌ల త‌ర‌బ‌డి Wait చేస్తే లైన్ క‌లుస్తుంది. గురగుర సౌండ్స్ మ‌ధ్య గ‌ట్టిగా కేకలు వేసుకుంటూ మాట్లాడేవాళ్లు.

1984 త‌ర్వాత ప‌రిస్థితి మారింది. రాజీవ్‌గాంధీ హ‌యాంలో టెలీ విప్ల‌వం మొద‌లైంది. ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శించినా లెక్క చేయ‌లేదు. ఊళ్ల‌లో STD బూత్‌లు వ‌చ్చాయి. కానీ చాలా ఖ‌రీదు. అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప మాట్లాడే వాళ్లు కాదు. బిల్ త‌గ్గుతుంద‌ని రాత్రి 10 గంట‌ల త‌ర్వాత మాట్లాడేవాళ్లు. అయితే లోక‌ల్ క‌మ్యూనికేష‌న్ పెరిగింది.

STD బూత్‌లు రెక‌మెండేష‌న్ మీద కేటాయించే వాళ్లు. దాని మీద వచ్చే ఆదాయంతో ఒక కుటుంబం బ‌తికేది. 1996లో కొత్త‌గా బూత్‌లు కేటాయించే అప్లికేష‌న్ల కోసం తిరుప‌తిలో తొక్కిస‌లాట జ‌రిగింది.

ఇక ఇంటికి ఫోన్ క‌నెక్ష‌న్ తెచ్చుకోవాలంటే బ్ర‌హ్మ ప్ర‌ళ‌యం. అప్లై చేసిన ఏడాదికి కూడా ఇచ్చేవాళ్లు కాదు. రాజ‌కీయ నాయకుల‌కి కోటా వుండేది. ప్ర‌త్యేక కోటా అంటే అదో త‌తంగం. నోట‌రీతో అఫిడ‌విట్ ఇచ్చి ఎక్కువ డ‌బ్బులు క‌ట్టి వీఐపీల‌తో సిఫార్సు చేయిస్తే మూడు నాలుగు నెల‌ల త‌ర్వాత తాపీగా క‌నెక్ష‌న్ ఇచ్చేవాళ్లు. టెక్నీషియ‌న్‌ని బ‌తిమ‌లాడితే 300 మామూలు తీసుకుని మ‌న‌కేదో Favour చేసిన‌ట్టు బిల్డ‌ప్ ఇచ్చి క‌నెక్ష‌న్ ఇచ్చేవాడు. రిపేర్ వ‌స్తే బాగు చేయించ‌డానికి తాత‌లు దిగొచ్చే వాళ్లు.

సెల్‌ఫోన్స్ వ‌చ్రాయి. ప్రైవేట్ కంపెనీల రంగ ప్ర‌వేశం జ‌రిగింది. బీఎస్ఎన్ఎల్ అహంకారంతో మూత ప‌డే స్థితికి చేరుకుంది. ఈ రోజు ఫ్రీగా ఇచ్చినా ల్యాండ్ ఫోన్లు తీసుకునే వాళ్లు లేరు.

సెల్‌ఫోన్ల‌తో జీవితం స‌ర‌ళ‌మైంది, సంక్లిష్ట‌మైంది. పొడుగాటి క్యూల్లో నిల‌బ‌డి క‌రెంట్ బిల్లులు క‌ట్ట‌క్క‌ర్లేదు. సినిమా టికెట్లు కొన‌క్క‌ర్లేదు. ప‌ది నిమిషాల్లో ఏం కావాల్సినా ఇంటికి తెప్పించుకోవ‌చ్చు.

మ‌నుషుల మ‌ధ్య మాట‌లు పెరిగాయి. శ‌త్రుత్వాలు పెరిగాయి. బంధాలు పెరిగినా, విడిపోయినా సెల్‌ఫోన్ ద్వారానే.

క‌మ్యూనికేష‌న్స్‌తో పాటు స‌మ‌స్య‌లూ పెరిగాయి.

జీఆర్ మ‌హ‌ర్షి 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?