ఉద్యోగం ఇవ్వలేదని హ్యాకర్ గా మారాడు

జ్ఞానం అనేది రెండు వైపుల పదునున్న కత్తిలాంటిది. మంచికి ఉపయోగిస్తే అందరికీ మంచిది. చెడు మార్గం పడితే మాత్రం ఊచలు లెక్కించాల్సిందే. కృష్ణా జిల్లాకు చెందిన దినేష్ విషయంలో ఇదే జరిగింది. సాఫ్ట్ వేర్…

జ్ఞానం అనేది రెండు వైపుల పదునున్న కత్తిలాంటిది. మంచికి ఉపయోగిస్తే అందరికీ మంచిది. చెడు మార్గం పడితే మాత్రం ఊచలు లెక్కించాల్సిందే. కృష్ణా జిల్లాకు చెందిన దినేష్ విషయంలో ఇదే జరిగింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగం రాలేదనే కోపంతో హ్యాకర్ గా మారిన ఈ తెలివైన కుర్రాడు, ప్రస్తుతం జైలు గోడల మధ్య మగ్గుతున్నాడు. తన కెరీర్ ను తానే చేజేతులా పాడుచేసుకున్నాడు.

కృష్ణా జిల్లా పెడనకు చెందిన దినేష్ బీటెక్ మధ్యలోనే ఆపేశాడు. ఎథికల్ హ్యాకర్ గా మారాడు. సాఫ్ట్ వేర్ లో బగ్స్ కనిబెడుతూ, పెద్ద కంపెనీల నుంచి బహుమతులు పొందేవాడు. ఈ క్రమంలో అమెరికన్ కంపెనీ ఇనస్టామోజోలో కూడా బగ్స్ కనిబెట్టాడు. ఆ తర్వాత తనకు ఉద్యోగం ఇవ్వాలంటూ కోరాడు. కానీ సదరు కంపెనీ తిరస్కరించింది. దీంతో కోపం తెచ్చుకున్న దినేష్, ఎథికల్ హ్యాకర్ నుంచి క్రిమినల్ హ్యాకర్ గా మారాడు.

పేమెంట్ గేట్ వేలను లక్ష్యంగా చేసుకొని హ్యాకింగ్ చేయడం మొదలుపెట్టాడు. దీని కోసం నకిలీ ఐడీలు, కంపెనీలు క్రియేట్ చేశాడు. ఢిల్లీకి చెందిన ఓ యాప్ తో ఒప్పందం కుదుర్చుకొని, దాని పేమెంట్ గేట్ వేలోకి ప్రవేశించి 60 లక్షలు కొట్టేశాడు. ఇక అక్కడ్నుంచి అతడి ఆన్ లైన్ మోసాలు మొదలయ్యాయి. తాజాగా ఎక్స్-సిలికా సాఫ్ట్ వేర్ కంపెనీ నుంచి 52.9 లక్షలు కొట్టేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు… అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో దినేష్ ను, అతడి స్నేహితుల్ని పట్టుకున్నారు.

దినేష్ ను విచారించిన పోలీసులకు దిమ్మతిరిగే వాస్తవాలు కళ్లముందు ప్రత్యక్షమయ్యాయి. ఆన్ లైన్ హ్యాకర్ గా మారిన దినేష్, ఈ నాలుగేళ్లలో ఏకంగా 3 కోట్ల రూపాయలు కొట్టేశాడట. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు విజయవాడలో పలు స్టార్టప్ యాప్స్ కూడా పెట్టాడట దినేష్.

ఇప్పటివరకు లక్షల్లో మోసం చేసిన హ్యాకర్లను మాత్రమే పట్టుకున్నారు. కానీ కోట్ల రూపాయల్లో ఆన్ లైన్ మోసం చేసిన ఓ హ్యాకర్ ను పట్టుకోవడం తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలిసారి.