‘‘ఎప్పుడు వచ్చాం అనేది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా?’’ అంటూ టైమింగ్ కంటె, పని జరగడం ముఖ్యం అనే ఉపదేశాన్ని ఒక ‘పోకిరి’ మన సమాజానికి అందించాడు. కానీ.. ఇది అన్నివేళలా వర్తించే సిద్ధాంతం కాదు. ప్రత్యేకించి రాజకీయాలకు అసలే పనికిరాదు. పని జరిగిందా లేదా అని గమనించడం మాత్రమే కాదు ‘ఎప్పుడు?’ అనేది కూడా ఇక్కడ చాలా ముఖ్యం. దాన్నే టైమింగ్ అంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పురమాయింపు మేరకు వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు, మంత్రులు అందరూ కలసికట్టుగా.. తమ తమ నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న ‘గడపగడపకు వైఎస్సార్ కాంగ్రెస్’ కార్యక్రమం అనేది వెరీ బ్యాడ్ టైమింగ్ లో జరుగుతున్నది.
పార్టీని ఎన్నికల దిశగా ముందుకు నడిపించడానికి, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు మరింతగా తెలియజెప్పడానికి, జగన్మోహన్ రెడ్డి గడపగడపకు కార్యక్రమానికి పిలుపు ఇచ్చారు. ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీని సందర్శించాల్సిందే. ఇంటింటికీ తిరగాలనేది ఈ కార్యక్రమం ఉద్దేశం. ప్రజలతో నాయకులకు అనుబంధం పెరగాలనేది లక్ష్యం. అందువలన పార్టీ బలపడుతుందనేది నమ్మకం. ఇదంతా బాగానే ఉంది. బుధవారం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పలుచోట్ల వైసీపీ నాయకులకు ప్రజాగ్రహం ఎదురైంది. నిరసనలు వినిపించాయి.
ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ప్రతిపక్షాలు పనిగట్టుకుని నిరసనలను తెలియజెప్పడానికి ప్రయత్నిస్తుంటాయి. ప్రేరేపిస్తుంటాయి. కుట్ర పన్నుతుంటాయి. ఇదంతా కూడా కరక్టే. అలాగని నిరసనలు అన్నింటినీ విపక్షాల ఖాతాలో వేసేసి ప్రభుత్వం దూసుకెళ్లిపోతే కుదరదు. కనీసం ఇలాంటి నిరసనల్లో కొంత మేరకు అయినా నిజమైనవి ఉన్నాయని గుర్తించాలి. వాటికి కారణాల్ని అన్వేషించి వీలైతే చక్కదిద్దగలగాలి.
ఏమైనప్పటికీ.. చాలా బ్యాడ్ టైమింగ్ తో ఈ కార్యక్రమం జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ధరల పరంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రధానంగా పెట్రోలు ధర విపరీతంగా పెరిగింది. మామూలు పరిస్థితుల్లో అయితే పెట్రోలు ధరల పెంపును కేంద్రం మీద నెట్టేయొచ్చు. కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. రాష్ట్ర వాటా పన్నులు తగ్గించుకోవాలని మోడీ చెప్పిన తర్వాత.. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిందే.
అలాగే విద్యుత్తు చార్జీలు కూడా భారీగా పెరిగాయి. ప్రజలు వ్యతిరేకిస్తున్న చెత్త పన్ను లాంటివి ఎటూ ఉండనే ఉన్నాయి. ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఇంకా అనేక అంశాలు ఉన్నప్పటికీ.. ఇప్పుడు చెప్పుకున్నవి.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరినీ కూడా ఇబ్బంది పెట్టే విషయాలు. ఇవన్నీ తారస్థాయిలో ఉన్న సమయంలో గడపగడపకు కార్యక్రమం మొదలు పెట్టకుండా.. కొన్ని రోజులు ఈ కొత్త ధరలు అలవాటైన తర్వాత కార్యక్రమాన్ని చేపట్టి ఉంటే బాగుండేది.
ఇటీవలే విద్యుత్తు చార్జీలు పెంచారు. మరికొన్నాళ్లు గడిస్తే ప్రజలు వాటికి అలవాటు పడేవారు. అలాకాకుండా చార్జీల వడ్డన వేడిగా ఉన్నప్పుడే.. ప్రజల వద్దకు వెళ్లడం బ్యాడ్ టైమింగ్ కాక మరేమిటి?
పైగా పచ్చమీడియా పొంచి ఉంటుంది. చిన్న నిరసనలు కనిపించినా.. తాటికాయంత అక్షరాలతో అడ్డగోలుగా ప్రచారం చేయడానికి ఉవ్విళ్లూరుతుంటుంది. ఇలాంటి నేపథ్యంలో ప్రజలు చల్లారే దాకా ఆగకుండా కార్యక్రమం మొదలెట్టారు. ఆ ఫలితమే ఇప్పుడు నిరసనలు కనిపిస్తున్నాయి.