Advertisement

Advertisement


Home > Politics - Analysis

ఎల్లో రాతలు: అప్పుడు సుజన.. ఇప్పుడు నారాయణ

ఎల్లో రాతలు: అప్పుడు సుజన.. ఇప్పుడు నారాయణ

మామూలుగా అయితే అతడో రాజకీయ నాయకుడు కమ్ వ్యాపారవేత్త.. చేసిన తప్పు బయటపడితే మాత్రం అతడో పెద్ద విద్యావేత్తగా మారిపోతాడు. మామూలుగా అయితే అతడు కేవలం ఓ ఎంపీ లేదా బిజినెస్ మేన్ మాత్రమే. తప్పుడు పనులు బయటపడితే మాత్రం అతడో పెద్ద సంఘసంస్కర్త, సామాజికవేత్తగా మారిపోతాడు. ఇదీ ఎల్లో మీడియా తీరు. 

తమ రాతలతో జనాల్ని ఏ విధంగా ఏమార్చాలో వారికి బాగా తెలుసు. అందుకే తప్పులు చేసి దొరికిపోయిన టీడీపీ నాయకులందర్ని మహాత్ములుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది. వాళ్లపై సింపతీ క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఎల్లో మీడియా.

మొన్నటివరకు నారాయణ టీడీపీ నాయకుడంతే. ఎప్పుడైతే ఆయన అరెస్ట్ అయ్యారో అప్పుడు సడన్ గా విద్యావేత్త అయిపోయారు. ఎంతోమందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది విదేశాల్లో ఉద్యోగాలు వచ్చేందుకు తోడ్పడిన మహాపురుషుడు అయిపోయారు. ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా కలిసి నారాయణను మంచి మనిషిగా చేసేందుకు చేసే ప్రయత్నం ఇది.

గతంలో సుజన చౌదరి విషయంలో కూడా ఇదే జరిగింది. పొలిటీషియన్ గా, బిజినెస్ మేన్ గా ఆయన హవా బాగా నడిచిన రోజులవి. ఎప్పుడైతే బ్యాంకులకు పంగనామాలు పెట్టారో, ఎప్పుడైతే కేసులు పడ్డాయో, అప్పుడిక ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా రంగంలోకి దిగిపోయాయి. 

తన ఫౌండేషన్ ద్వారా సుజనా చౌదరి చేయని సేవా కార్యక్రమం లేదంటూ ఊదరగొట్టాయి. అప్పట్లో మెరుగైన సమాజం కోసమంటూ ఓ ఛానెల్ కూడా సుజనాను కొన్ని రోజుల పాటు హీరోను చేసేసింది. దానికి మరికొన్ని తోక ఛానెళ్లు బాకా ఊదాయి. ఆ తర్వాత ఆ ఫౌండేషన్ ఏమైందో, దాని పేరిట ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు.

నారాయణ ఉత్తి పుణ్యానికి ఎవరికీ చదువు చెప్పలేదు. కనీసం పేద విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పే పద్ధతి కూడా ఆ సంస్థలో లేదు. ఫీజులు ముక్కుపిండి వసూలు చేస్తారు, తోక జాడిస్తే హాల్ టికెట్లు ఇవ్వనంటారు, మధ్యలో కాలేజీ మారాలంటే ఫీజు మొత్తం కట్టి టీసీ తీసుకెళ్లాల్సిందే. 

ఇక కొన్ని చోట్ల కాలేజీలు, హాస్టళ్ల నిర్వహణ ఎంత దారుణంగా ఉంటుందో చెప్పలేం. టార్చర్ తట్టుకోలేక నారాయణ హాస్టళ్లలో ఎన్ని ప్రాణాలు పోయాయో అందరికీ తెలిసిందే. ఓవైపు డబ్బులు గుంజుతూ మరోవైపు నరకం చూపిస్తుంటారు పిల్లలకు. ఈ విషయాలన్నీ తెలిసినా కూడా నారాయణ విద్యావేత్త అయిపోయారంటే, విద్యా ప్రదాత అయ్యారంటే, ఆయనను ఆచార్య అని అంటున్నారంటే.. అంతకంటే దారుణం ఇంకోటి ఉండదు.

ఇప్పుడే ఇలా ఉందంటే, రేపు చంద్రబాబు లేదా లోకేష్ అరెస్ట్ అయితే.. వీళ్ల దృష్టిలో వాళ్లు ఏకంగా మహాత్ములు అయిపోతారేమో, దీనజనోద్ధారకులుగా మారిపోతారేమో. ఏమో.. చంద్రబాబు నాలుక ఎన్ని మడతలు తిరుగుతుందో ఎలా చెప్పలేమో, ఎల్లో మీడియా రాతలు ఎన్ని మలుపులు తిరుగుతాయో కూడా చెప్పలేం..

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?