ఆశ మనిషిని ఎంత దూరమైనా లాక్కెళ్తుంది. వజ్రాలు దొరుకుతున్నాయనే ప్రచారంతో కొండనే తవ్వేసిన ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో కోకొల్లలు. ఇప్పుడు అలాంటిదే మరో ప్రచారం మొదలైంది. ఈసారి బంగారం దొరుకుతుందట. అది కూడా సముద్రంలో దొరుకుతుందే ప్రచారం జరిగింది. దీంతో జనాలంతా ప్రాణాలకు తెగించి సముద్రంలోకి వెళ్లడం మొదలుపెట్టారు. శ్రీకాకుళం జిల్లాలోని చాలా తీరప్రాంతాల్లో ఇప్పుడీ పరిస్థితి కనిపిస్తోంది.
మొన్నటికిమొన్న శ్రీకాకుళం జిల్లాలోని ఓ తీరప్రాంతానికి ఓ బంగారు వర్ణపు రథం కొట్టుకొచ్చింది. దూరం నుంచి దాన్ని చూసి భయపడిన స్థానికులు తర్వాత అది దేవుడి రథం అని తెలుసుకొని ఒడ్డుకు చేర్చారు. మెరైన్ పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ రథం బయటకొచ్చిన వెంటనే, ఈ బంగారం ప్రచారం మొదలైంది.
ఇంతకీ మేటర్ ఏంటంటే.. 2-3 రోజులుగా అసని తుపాను ఉత్తరాంధ్రను వణికించిన సంగతి తెలిసిందే. ఆ తుపాను ధాటికి సముద్రంలో ఉన్న బంగారు ఒడ్డుకు కొట్టుకొని వస్తోందంటూ ఎవరో పుకారు పుట్టించారు. సముద్రం నుంచి బంగారు వస్తోందనే పుకారు శ్రీకాకుళం జిల్లా తీర ప్రాంతాల్లో దావాళనంలా వ్యాపించింది.
దీంతో వందల సంఖ్యలో తీరప్రాంత వాసులు సముద్రంలోకి ఎగబడ్డారు. అసలే తుపాను వల్ల సముద్రం మంచి పోటు మీదుంది. అయినప్పటికీ ప్రాణాలకు తెగించి చాలామంది సముద్రం దగ్గరకు వెళ్లి ఇసుకలో తవ్వడం మొదలుపెట్టారు.
తుపాను తీరం దాటింది. సముద్రం శాంతించింది. పుకారు చల్లారింది. ఒడ్డున మిగిలింది ఇసుక మాత్రమే అనే విషయం శ్రీకాకుళం తీర ప్రాంత జనాలకు తెలిసొచ్చింది. దీంతో భారంగా నిట్టూరుస్తూ ఎవరి ఇళ్లకు వాళ్లు చేరుకున్నారు.