Advertisement

Advertisement


Home > Movies - Reviews

Sarkaru Vaari Paata Review: మూవీ రివ్యూ: సర్కారు వారి పాట

Sarkaru Vaari Paata Review: మూవీ రివ్యూ: సర్కారు వారి పాట

టైటిల్: సర్కారు వారి పాట
రేటింగ్: 2.75/5
తారాగణం: మహేశ్ బాబు, కీర్తి సురేష్, సముద్రఖని, నదియా, వెన్నెల కిషోర్, సౌమ్య మీనన్,  సుబ్బరాజు, అజయ్, బ్రహ్మాజి, తనికెళ్ల తదితరులు
కెమెరా: ఆర్. మది
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేశ్
సంగీతం: ఎస్ తమన్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవి శంకర్, రాం ఆచంట, గోపి ఆచంట
కథ-దర్శకత్వం: పరశురాం
విడుదల తేదీ: 12 మే 2022

"సరిలేరు నీకెవ్వరు" లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మహేశ్ బాబు, "గీతగోవిందం" లాంటి సూపర్ హిట్ తర్వాత దర్శకుడు పరశురాం కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాపై "కళావతి" పాట విడుదలైనప్పట్నుంచి అంచనాలు మొదలయ్యాయియి. ఆ అంచనాలు ట్రైలర్ విడుదల తర్వాత మరింత పెరిగాయి. 

దానికి తోడు ప్రధమార్థంలో 45 నిమిషాలు ప్రేక్షకుల్ని కట్టి పారేయడం ఖాయమని, అలాంటి ఎపిసోడ్ తన కెరీర్ మొత్తంలోనే చెయ్యలేదని మహేశ్ బాబు చెప్పడంతో ఎప్పుడెప్పుడు చూడాలా అన్న ఆసక్తి ఆడియన్సులో పెరిగింది. 

ఇంతకీ విషయంలోకి వెళితే ఇదొక వడ్డీవ్యాపారి కథ. 

"అప్పు లేని వాడు స్ట్రాంగ్. ఇచ్చిన అప్పును వెనక్కి రాబట్టుకునేవాడు ఇంకా స్ట్రాంగ్" అనే పాయింటులో రెండో వాక్యానికి సరిపోయే కథానాయకుడిగా మహేశ్ బాబు కనిపిస్తాడు. అమెరికాలో హ్యాండ్ లోన్స్ ఇస్తూ, తిరిగివ్వని వాళ్లని చితక్కొట్టేసి వసూలు చేసుకుంటూ ఉండే మహేశ్ కి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. దానికీ, ఒక సోషల్ కాజ్ కి ముడి పెట్టి రాసుకున్న కథ ఇది. 

నిజానికి పాయింట్ పరంగా పర్ఫెక్ట్. కథ పరంగా కూడా ఓకే. కానీ కథనం నడపడంలో చాలా తప్పులు జరిగాయి. ఎంత కమెర్షియల్ ఫార్మెట్ అయినా ప్రతిదానికి ఒక కొలతుంటుంది. అది తప్పితే మ్యాజిక్ మిస్సవుతుంది. అప్పుడు లాజిక్ లేనితనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇక్కడదే జరిగింది. 

ప్రధమార్థం కామెడీ టచ్ తో సరదాగా నడిచింది. కానీ ఇది కథలో మెయిన్ పాయింట్ కాదు. ప్రధానపాత్రల మధ్య లవ్ ట్రాకే. అసలు పాయింట్ మొదలయ్యే సరికి కామెడీ నుంచి కథ సీరియస్ టోన్లోకి వెళ్తుంది. 

సముద్రఖని విశాఖలో ఒక బడా వ్యాపారి. రూలింగ్ పార్టీ ఎంపీ కూడా. ఢిల్లీలో పలుకుబడున్నవాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ అదేంటో అమెరికా నుంచి కూతురు తను ట్రబుల్లో ఉన్నానని ఫోన్ చెయ్యగానే హెలికాప్టర్లో పోలీసులొచ్చి ఆ ట్రబుల్ చెస్తున్న హీరోకి గాల్లోంచే తుపాకులు గురి పెట్టేస్తారు. అంటే మన ఎంపీ గారి పవర్ అమెరికన్ పోలీసుల్ని కూడా పరుగెత్తించగలదన్నమాట. 

పెద్ద హీరో సినిమాని కమెర్షియల్ యాంగిల్లో చూడాలి కానీ లాజిక్కులు వెతక్కుండా చూద్దామన్నా బలం లేని సీన్లు పంటి కింద రాళ్లలాగ తగులుతుంటాయి. 

మాటలు రాసుకోవడంలో గానీ, రాయించుకోవడంలో కానీ దర్శకుడి తాలూకు అశ్రద్ధ కూడా కొంత కనిపించింది. 

ప్రధమార్థంలో హీరోయిన్ మొదట పదివేల డాలర్లు అప్పు తీసుకుని, తర్వాత పాతికవేలు కూడా తీసుకుంటుంది. అది చాలా స్పష్టంగా చూపించిన విషయం. అయితే తర్వాతంతా 10 వేల డాలర్లు తిరిగిచ్చేయమనే అడుగుతుంటాడు హీరో. ఇలా కంటిన్యుటీని డిస్టర్బ్ చేసే సీన్స్ వల్ల ఆడియన్స్ దర్శకుడిని తమ కన్నా తక్కువ స్థాయిలో చూస్తారు. దాంతో ఎంగేజ్ అవ్వకుండా తప్పులు వెతికే పనిలో పడుతాయి ఆడియన్స్ బ్రెయిన్స్. అందుకే, ఫ్లోలో పాసైపోతాయిలే అని ఇలాంటి తప్పుల్ని చేయకూడదు. 

"అప్పు చేసేటప్పుడు భయపడాలి. తీర్చేటప్పుడు గర్వపడాలి. మీరు భయం దగ్గరే ఆగిపోయారు" అంటాడు హీరో విలన్ తో ఒక సన్నివేశంలో. అసలా విలన్ ఎప్పుడు భయపడ్డాడనేది మొదటి ప్రశ్న. ఎగ్గొట్టే ఆలోచనతోటే తీసుకుంటాడు తప్ప ఎలా తీరుస్తానా అనే భయంతో కాదు కదా!

"సరిలేరు నీకెవ్వరు"లో ప్రకాష్ రాజ్ ని డిసిప్లిన్ లో పెట్టినట్టు, ఇక్కడ సముద్రఖనిని బాధ్యతాయుతమైన ఆడపిల్ల తండ్రిగా తీర్చిదిద్దడం హీరో లక్ష్యం. 

మరొక మైనస్ ఏంటంటే..పాత్రల్ని ప్రవేశపెట్టి వాటిని సరిగ్గా వాడుకోని తీరు. సత్యం రాజేష్ పాత్ర ఎంటరవుతుంది కానీ సరైన ఎగ్జిట్ లేదు. అలాగే తనికెళ్ల భరణి, నదియా పాత్రల బాధలు కంటికి కనపడవు. వాళ్లు చెబితే విని గుర్తుపెట్టుకోవాలి తప్ప ఆ పాత్రలతో జర్నీ లేదు. దానివల్ల ఎమోషన్ పండలేదు.

నెగటివ్స్ ముందు చెప్పేసుకున్నాం కాబట్టి ఇప్పుడు పాజిటివ్స్ మాట్లాడుకుందాం. 

ఇందులో ప్రధానంగా చెప్పుకోవల్సింది మహేశ్ బాబు పర్ఫార్మెన్స్, లుక్స్. తన కామెడీ టైమింగ్ కానీ, ఈజ్ కానీ నిజంగా కట్టిపారేస్తాయి. పాటల్లో వేసిన స్టెప్స్ కూడా కళ్లు తిప్పుకోనీయవు. కథనంలో ఒడిదుడుకులున్నా మహేశ్ బాబు పూర్తిగా తన భుజాలమీద సినిమాని మోసిన తీరు ప్రశంసనీయం. 

కీర్తి సురేష్ గురించి చెప్పక్కర్లేదు. ఈ జాతీయ అవార్డు నటికి ఈ మాత్రం క్యారెక్టర్ చేయడం విషయమేం కాదు. కానీ ఫస్టాఫులో ఉన్నంత స్కోప్ ఆమెకు సెకండ్ హాఫ్ లో లేదు.

తమన్ నేపథ్య సంగీతం కూడా చాలా గ్రిప్పింగ్ గా ఉంది. ఉన్న మూడు పాటలూ అలరిస్తాయి. మరీ ముఖ్యంగా "మ మ మహేశా..." మూస పద్ధతిలో ఉన్న కంపోజిషనే అయినా ఆకట్టుకుంది. కెమెరా వగైరా సాంకేతికాంశాల్ని వంక పెట్టలేం.

ఎక్కడా హెవీ కాకుండా లైటర్ వీన్ ట్రీట్మెంటు తో నడిపే ప్రయత్నం చేసాడు దర్శకుడు. అయినప్పటికీ అంచనాలు లేకుండా చూసినట్టైతే బాగానే అనిపించొచ్చు. కానీ మహేశ్ సినిమాని అంచనాల్లేకుండా చూడడం వీలౌతుందా? బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలా పర్ఫార్మ్ చేస్తుందో వేచి చూడాలి. 

బాటం లైన్: మహేషు గారి పాట

నేను రెడ్డి అని ఎందుకు పెట్టుకున్నానంటే...

జ‌గ‌న్ ను చూసి నేను మారను