నిజంగా ప్రేమించి, పెళ్లాడాలనుకునే వ్యక్తి ఇలా చేయడు. చక్కగా గుడిలో పెళ్లి చేసుకుంటాడు, భార్యను చక్కగా చూసుకుంటాడు. కానీ ఈ దుర్మార్గుడు మాత్రం మోసం చేయడం కోసమే పెళ్లి చేసుకున్నాడు. గర్భం దాల్చిందని తెలుసుకొని విషప్రయోగం చేయబోయాడు.
నూజివీడు సమీపంలో ఉన్న రావిచర్లలో ఉంటున్న సురేష్. అదే ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల అమ్మాయిని ప్రేమించానంటూ వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. కొన్ని నెలలుగా వెంటపడుతున్న సురేష్ ను బాధిత యువతి నమ్మింది. పెళ్లికి అంగీకరించింది.
ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి గుడికి లేదా ఆర్యసమాజానికి తీసుకెళ్తారు. కానీ సురేష్ మాత్రం యువతిని లాడ్జికి తీసుకెళ్లాడు. నాలుగు గోడల మధ్య తాళి కట్టి పెళ్లయిపోయిందన్నాడు. ఆ వెంటనే కాపురం స్టార్ట్ చేశాడు.
అలా శారీరకంగా తన కోరికలు తీర్చుకున్నాడు సురేష్. అయితే ఈ క్రమంలో యువతి గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న సురేష్, తన అసలు రంగు బయటపెట్టాడు. కడుపులో పెరుగుతున్న పిండంతో పాటు, యువతిని కూడా వదిలించుకోవాలనుకున్నాడు. జ్యూస్ లో విషం కలిపి తాగించే ప్రయత్నం చేశాడు.
కొన్నాళ్లుగా భర్త వ్యవహారశైలిపై అనుమానంగా ఉన్న బాధిత యువతి, జ్యూస్ లో విషం కలిపిన విషయాన్ని గ్రహించింది. అక్కడ్నుంచి తప్పించుకొని, పోలీసుల్ని ఆశ్రయించింది. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.