హైదరాబాద్ నగరంలోని బేగంబజార్ పరువు హత్య కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. బేగంబజార్‌కు వస్తే ప్రాణహాని వుందని హతుడు నీరజ్ పర్వాన్ భార్య సంజనను ఆమె తల్లి హెచ్చరించడం వెలుగు చూసింది. హెచ్చరికలను పట్టించుకోకపోవడం వల్లే నీరజ్ పర్వాన్ ప్రాణాల మీదకి తెచ్చింది. రిమాండ్ రిపోర్ట్‌లో కొత్త విషయాలు వెలుగు చూశాయి. వాటి వివరాలేంటో తెలుసుకుందాం.
నీరజ్ పర్వార్, సంజన కులాంతర వివాహం చేసుకున్నారు. నీరజ్‌ను పెళ్లి చేసుకోవడం సంజన కుటుంబ సభ్యులకు ఎంత మాత్రం ఇష్టం లేదు. పెళ్లి తర్వాత నీరజ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అలాగే యాదవ్ సమాజ్ నుంచి దాదాపు సంజన కుటుంబం బహిష్కరణకు గురైంది. దీంతో సంజన కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో నీరజ్‌పై సంజన బంధువులు కక్ష పెంచుకున్నారు.
బాబు పుట్టాక యాదవ అహీర్ సమాజ్ వ్యక్తులతో నీరజ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడని నిందితులు పోలీసుల విచారణలో చెప్పారు. యాదవ్ సమాజ్ కార్యక్రమాలకు సంజన కుటుంబ సభ్యులను పిలవడం మానేశారని నిందితులు చెప్పారు. దీన్ని అవమానంగా భావించినట్టు విచారణలో వెల్లడించారు. కూతురు ఇంటి నుంచి వెళ్లపోవడంతో బంధువులు, సొంత సామాజిక వర్గానికి చెందిన వాళ్లు చిన్న చూపు చూడడాన్ని సంజన కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోయారు.
బాబు పుట్టిన తర్వాత తల్లితో సంజన మాట్లాడింది. తల్లీకూతురు మధ్య మాటలు సాగేవి. దీంతో తనవైపు వారి ఆగ్రహం ఎంత తీవ్రంగా ఉందో సంజనకు తెలిసేది. ఎలాంటి పరిస్థితుల్లోనూ బేగం బజార్‌కు రావొద్దని నీరజ్ దంపతులను సంజన తల్లి హెచ్చరించినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
అయితే తల్లి హెచ్చరికలను లెక్క చేయకుండా బేగం బజార్‌లోనే నీరజ్ జంట ఉంది. దీంతో రగిలిపోయిన సంజన వైపు వ్యక్తులు, ఎలాగైనా నీరజ్‌ను అంతమొందించాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో గత వారం ప్లాన్‌ను అమలు చేశారు. తల్లి మాటలు విననందుకు సంజన జంట భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
చివరికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త నీరజ్ శాశ్వతంగా దూరమయ్యాడు. తల్లి మాటలు వినకపోవడం వల్లే నీరజ్ దూరమయ్యారనే ఆవేదన ఆమెను జీవితాంతం వెంటాడుతూనే వుంటుంది.