టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడితే వైసీపీ మీద ఎన్నో విమర్శలు చేస్తూ వస్తారు. ఆఖరుకు వైసీపీ వారి రాజ్యసభ సభ్యుల ఎంపిక వ్యవహారం మీద ప్రాంతాలు, రాష్ట్రాలు లెక్కలు తీసి మాట్లాడుతున్నారు. దాంతో వైసీపీ నేతలకు బాగా మండిపోతోంది. వారు చంద్రబాబుకు అనేక రకాలుగా తిరుగు జవాబు ఇచ్చారు.
కానీ లేటెస్ట్ గా సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఇచ్చిన కౌంటర్ అయితే అల్టిమేట్ అనే చెప్పాలేమో. ఆయన తాజాగా శ్రీకాకుళం జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఇన్ని లెక్కలు చెబుతూ రాష్ట్రాలు ప్రాంతాలు అంటున్నారు, మేము ఎంపిక చేసిన రాజ్యసభ అభ్యర్ధుల మీద చాలానే మాట్లాడుతున్నారు కదా ఇంతకీ ఆయన ఏ రాష్ట్రం వారు అని గట్టిగానే ప్రశ్న వేశారు.
చంద్రబాబు ఉంటున్నది తెలంగాణా కాదా. ఆయన అక్కడ చాలా ఏళ్ళుగా నివసించడంలేదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక చంద్రబాబుకు ఏపీలో శాశ్వత చిరునామా అన్నది ఎక్కడ అయినా ఉందా అని కూడా బిగ్ డౌట్ వ్యక్తం చేశారు. అంటే బాబుకు ఏపీలో ఎక్కడా సొంత ఇల్లు లేదని ఇన్ డైరెక్ట్ గా బొత్స చెప్పారు అన్నమాట.
బాబు వేరే రాష్ట్రంలో ఉంటూ ఏపీ రాజకీయాలను ఎలా చేస్తారు అని లాజిక్ మిస్ కాకుండా ఒక సూటి ప్రశ్ననే సంధించారు. మొత్తానికి బాబు ప్రవాసాంధ్రుడు అని సింపుల్ గా బొత్స తేల్చేశారు అన్న మాట.
అయినా టీడీపీ జమానాలో రాజ్యసభ సభ్యులుగా వేరే రాష్ట్రాలకు చెందిన నిర్మలా సీతారామన్, సురేష్ ప్రభులను ఎంపిక చేసిన చంద్రబాబు ఈ రోజు గుండెలు ఎందుకు బాదుకుంటున్నారు అంటే మాది బీసీల పార్టీ కాబట్టి అని బొత్స ఒక్క ముక్కలో చెప్పేశారు.
మొత్తానికి బాబు ఏపీ కి చెందిన వారు కాదు అన్నట్లుగానే బొత్స కామెంట్స్ ఉన్నాయి. దీనికి టీడీపీ రియాక్షన్ ఏంటో చూడాలి.