ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ (46) ని రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. ఈయన ఆల్ రౌండర్ కూడా. ఇటీవలే ఆస్ట్రేలియా ప్రముఖ క్రికెటర్, ప్రపంచ ప్రసిద్ధ స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ ఆకస్మిక మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషాదం నుంచి ఆస్ట్రేలియా క్రికెట్ కోలుకుంటున్న తరుణంలో మరో క్రికెటర్ తనువు చాలించడం గమనార్హం.
ఇదిలా వుండగా క్విన్స్‌లాండ్‌లోని టౌన్స్‌వీల్లేలో సైమండ్స్ నివాసం ఉండేవారు. తన నివాసం ప్రాంతంలో గత రాత్రి కారు ప్రమాదానికి లోనయ్యాడు. ఈ ఘటనలో సైమండ్స్ ప్రాణాలు కోల్పోయాడు.
సైమండ్స్ 1998-2009 మధ్య ఆస్ట్రేలియా క్రికెట్‌కు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తం 26 టెస్ట్‌లు, 198 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
ముఖ్యంగా 2003,2007లలో వరుసగా ప్రపంచ కప్ విజేతగా ఆస్ట్రేలియా నిలబడడానికి ఆల్‌రౌండర్‌గా సైమండ్స్ కీలక పాత్ర పోషించాడు. ఈయన మృతిపై ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు విచారం వ్యక్తం చేశారు. ఆయనకు ఆత్మశాంతి కలగాలని పలువురు ఆకాంక్షించారు.