మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం అన్నట్టు అతను కల కన్నాడు. తన కలను సాకారం చేసుకోడానికి హోదా, వయసు అడ్డంకి కాలేదు. 34 ఏళ్ల వయసులో అతను విద్యార్థి అయ్యాడు. బ్యాగ్ తగిలించుకుని చిన్నపిల్లాడిలా స్కూల్‌కు వెళ్లాడు. గురువు చెప్పినట్టు బుద్ధిగా విద్యనభ్యసించాడు. దీంతో నిర్దేశిత సమయం కంటే ముందే లక్ష్యాన్ని సాధించాడు. నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచిన ఆ యువ కిశోరం భూమన అభినయ్. తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాక రరెడ్డి కుమారుడు. కుడి చేతితో సమానంగా ఎడమ చేత్తో రాయగలిగే నైపుణ్యాన్ని సాధించి సవ్యసాచిగా నిలిచాడు.
అభినయ్‌కి బాల్యం నుంచి ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవాలనే కుతూహలం ఎక్కువ. చిన్నప్పుడు తన తల్లి వద్ద మహాభారతం కథని అభినయ్ ఆసక్తిగా విన్నాడు. అర్జునుడి క్యారెక్టర్ అభినయ్‌ని ఆకర్షించింది. అర్జునుడు ‘సవ్యసాచి’ అని తల్లి రేవతి చెప్పినపుడు వినడానికి కొత్తగా అనిపించింది. ‘సవ్యసాచి అంటే ఏంటమ్మా’ అని అభినయ్ ప్రశ్నించాడు. ‘ ఒక పనిని రెండు చేతులతో సమంగా చేసేవారిని ‘సవ్యసాచి’ అంటారు. రెండు చేతులతో బాణాలు సంధించడం అర్జునుడి ప్రత్యేకత. మహాభారత గాధలో మరే వీరుడికి ఇలాంటి నైపుణ్యం లేదు’ అని అమ్మ వివరించింది. అర్జునుడిలా రెండు చేతులతో తానెందుకు రాయకూడదనే ఆలోచనకు బాల్యంలోనే బీజం పడిందని ఓ కథలా చెబుతాడు అభినయ్. ఆ కోరిక, ఆశయం ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్టు తనతో పాటు పెరుగుతూ మహావృక్షమైందంటూ చెప్పుకొచ్చాడు.
అర్జునుడిలా తాను కూడా కుడి, ఎడమ చేతులతో పని చేయడానికి బాల్యంలోనే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. తలుపులు తెరవడం, తాళాలు తీయడం, బ్రెష్ చేయడం లాంటి చిన్న చిన్న పనులు మొదలు పెట్టాడు. ఒక రకంగా చెప్పాలంటే ఏకలవ్య విద్యార్థి. కానీ నేర్వలేక పోతున్నాననే అసంతృప్తి అతనిలో బలంగా ఉండింది. లోకజ్ఞానం పెరిగే కొద్దీ జ్ఞానాన్వేషణ కొనసాగుతూ వచ్చింది.
ఇటలీకి చెందిన శాస్త్రజ్ఞుడు, చిత్రకారుడు లియోనార్డ్ డివోన్సీ, నికోలా టెస్లా, బెంజిమన్ ప్రాంక్లిన్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన క్రీడాకారులు క్రిస్టియానో రొనాల్డో, సచిన్ టెండూల్కర్, షరపోవా, అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్లంతా సవ్యసాచులని అభినయ్ తెలుసుకుని స్ఫూర్తి పొందాడు.
వెతుకుతున్న తీగ కాలికి తగులుకున్న చందంగా తన వూళ్లోనే కాలిగ్రఫీ నిపుణుడు ‘భాస్కర్‌రాజు’ ఉన్నారని అభినయ్ తెలుసు కున్నాడు. ‘మేక్ మై బేబీ జీనియస్’ పేరుతో తిరుపతి నగరంలో అన్నారావు సర్కిల్ సమీపంలో ఆదర్శ పాఠశాల నడుపు తున్నాడని తెలుసుకుని అభినయ్ సంతోషించాడు. వెంటనే ఆ స్కూల్‌ను సందర్శించాడు. అక్కడి పిల్లలు కుడి, ఎడమ చేతులతో సునాయాసంగా రాయడం, పనులు చేయడం చూసి అభినయ్ అబ్బుర పడ్డాడు. బాల్యం నుంచి పెరుగుతూ వచ్చిన తన కోరికను భాస్కర్‌రాజు వద్ద బయటపెట్టాడు.
34 ఏళ్ల వయసులో, అది కూడా తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ నేర్చుకోవాలన్న పట్టుదలకు భాస్కర్‌రాజు ఫిదా అయ్యాడు. మీ వీలున్నప్పుడు వచ్చి ప్రాక్టీస్ చేయాలని సూచించాడు. కేవలం చేతి రాత కోసం తాము ప్రత్యేకంగా రూపొందించి స్లేట్లు, ఇతర నమూనాల్లో కనీసం 450 సార్లు రాస్తే ఎడమ చేత్తో రాయడం అలవడుతుందని భాస్కర్‌రాజు వివరించాడు. దీంతో ఏకలవ్య విద్యార్థి అయిన అభినయ్‌కి ద్రోణాచార్యుడు లాంటి గురువు దొరికనట్టైంది.
గత ఏడాది సెప్టెంబర్ 14న భాస్కర్‌రాజు నేతృత్వంలో ఎడమ చేతి అక్షరాభ్యాసం మొదలైంది. తాను 45 రోజులు టార్గెట్ పెట్టుకుని ప్రాక్టీస్ చేశాడు. సంతోషించదగ్గ విషయం ఏమంటే 25 రోజులకే ఎడమ చేత్తో ఒక మోస్తారుగా రాయగలిగే పరిస్థితికి చేరుకున్నాడు.
‘మంచి గురువు దొరకడం కష్టమేమీ కాదు. కానీ విద్య నేర్చుకోవాలనే పట్టుదల, నిబద్ధత కలిగిన శిష్యులు దొరకడం గురువు అదృష్టం. చాలా త్వరగా అభినయ్ ఎడమ చేత్తో రాయడం నేర్చుకోవడం వెనుక నా మెళకువల కంటే అతని పట్టుదలే ఎక్కువ. అందుకే అభినయ్ నిర్దేశిత సమయం కంటే ఎంతో ముందుగానే ఎడమ చేత్తో రాయడంలో నైపుణ్యం సాధించాడు’ అని భాస్కర్‌రాజు చెప్పాడు.
ప్రయోజనాలు ఏంటంటే…
రెండు చేతులతో రాసే నైపుణ్యం కోటి మందిలో ఒకరికి మాత్రమే వుంటుంది. ఆ కోటి మందిలో తానున్నానే ఫీలింగ్ ఇచ్చే కిక్ అనిర్వచనీయమైందని అభినయ్ అభిప్రాయం. అసాధ్యాన్ని సుసాధ్యం చేశామనే భావన సహజంగానే మన అంతరంగంలో తెలియని ఆత్మవిశ్వాసాన్ని బలోపేతం చేస్తుందని అతను అంటాడు. మరి ఆ విశ్వాసమో లేక ఎడమ చేత్తో రాయడం వల్ల లెఫ్ట్ హెమిస్పియర్‌తో రైట్ హెమిస్పియర్ సింక్ కావడం వల్లో మల్టీ టాస్కింగ్ చాలా సులభంగా చేయగలుగుతున్నట్టు అభినయ్ అభిప్రాయం. గతంలో మల్టీ టాస్కింగ్ అసలు చేసేవాన్ని కాదన్నాడు.
ఏదో ఒక దాని మీదే తన పూర్తి ఏకాగ్రత పెట్టేవాడినని అన్నాడు. కానీ ఇప్పుడు ఒకేసారి మూడు నాలుగు పనులు కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా చేయగలుగుతున్నట్టు అభినయ్ పేర్కొన్నాడు. అంతేకాదు, స్ట్రెస్ బాధ తగ్గిందన్నాడు. Emotions ను కంట్రోల్ చేయగలిగే పరిస్థితికి వచ్చాననే ఫీలింగ్ కలుగుతోందన్నాడు. Oratory స్కిల్స్ పెరిగాయన్నాడు. అప్పటికప్పుడే ఏదైనా విషయంపై మాట్లాడగలిగే నేర్పు పెరిగిందన్నాడు. దేన్నైనా అర్థం చేసుకోవడంలో గతంలో కంటే చాలా వేగంగా గ్రహిస్తున్నట్టు అభినయ్ అభిప్రాయపడ్డాడు.
ఒకేసారి శ్లోకం చెబుతూనే, అంకెల్ని కూడా లెక్కించగలిగే నైపుణ్యాన్ని సాధించడాన్ని గుర్తించా నన్నాడు. ఇంతకు ముందు తాను ఆ పని చేసినట్టు గుర్తు లేదన్నాడు. అన్నిటికి మించి జ్ఞాపకశక్తి బాగా పెరిగిందన్నాడు. పాత విషయాలన్నీ గుర్తుకొస్తున్నాయన్నాడు. బాల్య స్మృతులు గుర్తుకొస్తున్నట్టు అభినయ్ మధురానుభూతిని వ్యక్తం చేస్తున్నాడు.