పెట్రోలు, కరెంటు, లిక్కరు మాదిరిగానే ఇసుక అనేది కూడా మెజారిటీ ప్రజల మీద ప్రభావం చూపిస్తుంది. ఇసుక ధరల విషయంలో ఉండే హెచ్చుతగ్గులు, వ్యవహారాలు మెజారిటీ ప్రజలకు కనెక్ట్ అవుతాయి. ఈ రంగాల్లో జరిగే అవకతవకల వలన ప్రజల మీద ప్రభావం, వారి స్పందనకూడా జాస్తిగా ఉంటాయి. అయితే ఇసుక విషయంలో ఏపీలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అభాసు పాలు అవుతోంది. అలా అంటే సరికాదు, ప్రభుత్వంలోని పెద్దలే సమన్వయం లేకుండా మాట్లాడుతూ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేస్తున్నారు.
ఏపీ వ్యాప్తంగా ఇసుక తవ్వకాలు, రవాణాకు సంబంధించిన కాంట్రాక్టును ఉత్తరాదికి చెందిన జేపీ సంస్థ గుత్తకు తీసుకుంది. అయితే చెన్నైకు చెందిన టర్న్ కీ అనే సంస్థ ఈ మొత్తం దందాను నడిపిస్తున్నదంటూ ఒక పత్రికలో సుదీర్ఘమైన కథనం వచ్చింది. సదరు టర్న్‌కీ సంస్థ, అసలు లీజు సంస్థ జేపీ వారినుంచి సబ్ కాంట్రాక్టు పొందారనేది విషయం. ఈ చెన్నై సంస్థ పలు వివాదాల్లో ఉన్న నాయకుడు శేఖర్ రెడ్డికి చెందినది అనే ఆరోపణలతో.. జగన్మోహన్ రెడ్డికి ఇందులో వాటా ఉన్నదని ముడిపెడుతూ ఆ కథనంలో అనేక విషయాలు వండి వార్చారు.
ఈ కథనాన్ని ఖండించడానికి గనుల శాఖ అధికారి అమరావతిలో ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా తిరుపతిలో విలేకర్లతో మాట్లాడారు. అయితే ఈ ఇద్దరు వెల్లడించిన విషయాల మధ్య సమన్వయం లేదు. తలొకరీతిగా వీరు మాట్లాడిన మాటలు ప్రభుత్వానికి పరువు పోయేలా చేస్తున్నాయి.
చంద్రశేఖర్ వెల్లడించిన విషయాల్లో.. జేపీ సంస్థతో మాత్రమే తమకు సంబంధం ఉంటుందని.. వాళ్లు ఎవరికి సబ్ కాంట్రాక్టు ఇచ్చారనేదానితో ప్రభుత్వానికి సంబంధం ఉండదని, ఒప్పందం ప్రకారం అంతా జరుగుతోందా లేదా అనేది మాత్రమే పరిశీలిస్తామని అన్నారు. ఇదే విషయాన్ని మంత్రి పెద్దిరెడ్డి కూడా చెప్పారు. ఏ కాంట్రాక్టరు అయినా.. ఎవరికైనా సబ్ కాంట్రాక్టు ఇచ్చుకోవచ్చు. నిజమే, అయితే.. ప్రభుత్వం సమావేశాలు నిర్వహించినప్పుడు జేపీ సంస్థ ప్రతినిధులతో పాటు టర్న్కీ ప్రతినిధుల కూడా సమావేశాలకు వస్తుంటారని చంద్రశేఖర్ అన్నారు. వారితో ప్రభుత్వానికి సంబంధం లేనప్పుడు.. వారు ఎందుకు వస్తారనేది ప్రశ్న.
ఒకవైపు మంత్రి రామచంద్రారెడ్డి.. చాలా కఠినంగా నిబంధనలు పాటిస్తూ ఇసుక అమ్మకాలు జరుగుతున్నాయని అంటూ.. ఇప్పటిదాకా వేల కేసులు నమోదు చేశామని, 1400 వాహనాలు కూడా సీజ్ చేశామని వెల్లడించారు. అయితే గనుల శాఖ అధికారి చంద్రశేఖర్ మాత్రం ఇప్పటిదాకా ఒక్క కేసూ నమోదు కాలేదని స్పష్టంగా చెప్పడం ఒక తకరారు.
ఆన్ లైన్ లో చెల్లింపుల విషయంలోనూ చంద్రశేఖర్ మాటలు తేడాగా సాగాయి. ఒకవైపు మంత్రి పెద్దిరెడ్డి ఆన్ లైన్ లో చెల్లిస్తేనే వేబిల్లు జనరేట్ అవుతుందని, అంతా ఆన్ లైన్ చెల్లింపులే జరుగుతున్నాయని అన్నారు. అయితే అధికారి మాత్రం అందుకు భిన్నంగా.. ఆన్ లైన్ ఇన్వాయిస్ ల విధానం త్వరలో అమలు చేస్తామని చెప్పడం విశేషం. టర్న్ కీ సంస్థ ప్రింట్ చేసిన రసీదులు ఇస్తోందని, ఇందులో అక్రమాలు జరుగుతాయి కదా అని అన్నప్పుడు ఆయన ఇలా జవాబిచ్చి.. అలా టర్న్ కీ ప్రింట్ రసీదులు ఇచ్చే వైనాన్ని దాదాపుగా ధ్రువీకరించారు.
ఇలా అధికారులు–మంత్రులు పొంతనలేని మాటలు మాట్లాడితే.. అంతిమంగా నష్టం జరిగేది ఎవ్వరికి? వాస్తవంగా.. ఇసుక సరఫరా విషయాల్లో ఎలాంటి అక్రమాలూ జరగకపోవచ్చు గాక.. కానీ.. ఇలాంటి మాటలు ప్రజల్లో అనుమానాలు పెంచుతాయి. అసలే పచ్చమీడియా.. ప్రతి విషయాన్ని రచ్చరచ్చ చేయడానికి కాచుకుని ఉంటుంది. దానికి తగ్గట్టుగానే.. వీరిలా మాట్లాడుతోంటే.. ప్రభుత్వానికి పరువు పోతుంది.