దొంగ దారి.. చివరికి అవి కూడా కొట్టేస్తున్నారు

దొంగలు సాధారణంగా ఏం కొట్టేస్తారు. నగలు దోచేస్తారు, డబ్బులు కొట్టేస్తారు. ఇంట్లో ఇంకేమైనా విలువైన వస్తువులుంటే పట్టుకెళ్తారు. కానీ ఇప్పుడు దొంగలు రూటు మార్చారు. వాళ్ల దృష్టిలో పైన చెప్పుకున్నవి మాత్రమే విలువైనవి కావు.…

దొంగలు సాధారణంగా ఏం కొట్టేస్తారు. నగలు దోచేస్తారు, డబ్బులు కొట్టేస్తారు. ఇంట్లో ఇంకేమైనా విలువైన వస్తువులుంటే పట్టుకెళ్తారు. కానీ ఇప్పుడు దొంగలు రూటు మార్చారు. వాళ్ల దృష్టిలో పైన చెప్పుకున్నవి మాత్రమే విలువైనవి కావు. ట్రెండ్ కు తగ్గట్టు దొంగతనాలు షురూ చేశారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో టమాట దొంగలు ఎక్కువయ్యారు.

తెలుగు రాష్ట్రాల్లో టమాట ధరలు ఆకాశాన్నంటిన సంగతి తెలిసిందే. దీంతో దొంగలు టమాటాలు దొంగతనం చేయడం మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాంతాల్లో టమాటాలు చోరీకి గురవుతున్నాయి. నిన్నటికినిన్న మదనపల్లెలో 10 ట్రేలతో ఉన్న టమాటాలు మాయమయ్యాయి. దీనిపై పోలీస్ కేసు నమోదైంది. అంతకంటే ముందు కృష్ణా జిల్లాలోని పెదగంజిప్రోలులో కూడా టమాటాలు దొంగిలించారు. ఇలా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో టమాట చోరీలపై 5 కేసులు నమోదయ్యాయి.

టమాటాల కంటే ముందు దొంగల కన్ను నిమ్మకాయలపై పడింది. సరిగ్గా నెల రోజుల కిందట నిమ్మ రేటు అమాంతం పెరిగిన సంగతి తెలిసిందే. ఒక్క నిమ్మకాయ 10 రూపాయలకు కూడా అమ్ముడుపోయింది. సూపర్ మార్కెట్లలోనైతే అద్దాల ఫ్రిడ్జ్ లో పెట్టి మరీ 20 రూపాయలకు ఒక నిమ్మకాయ అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో దొంగలు గత నెల నిమ్మకాయలు దొంగతనం చేశారు. 5వేల రూపాయల ట్రేను 2-3 వేలకు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు.

అంతకంటే ముందు తెలంగాణలో కోళ్లు మాయమయ్యాయి. చికెన్ ధరలు అమాంతం పెరగడంతో పౌల్ట్రీల నుంచి కోళ్లు దొంగిలించి రిటైల్ మార్కెట్లో సగం రేట్లకే అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు దొంగలు. తెలంగాణలోని చాలా కోళ్ల ఫారాల్లో ఈ విధంగా దొంగతనాలు జరిగాయి. వందల సంఖ్యలో కోళ్లు మిస్సయ్యాయి.

ఇలా దొంగలు ట్రెండ్ కు తగ్గట్టు దొంగతనం చేయడం నేర్చుకున్నారు. నిత్యం ఇళ్లపై కన్నేస్తే పోలీసులకు ఇట్టే దొరికిపోతుండడంతో.. ఇలా రూటమార్చి దొంగతనాలు మొదలుపెట్టారు. ఇకపై రేటు పెరిగిన ఏ వస్తువునైనా జాగ్రత్తగా కాపాడుకోవాలన్నమాట. అది కోడి అయినా, గుడ్డు అయినా సరే.