సర్కారువారి పాట సినిమాకు ఇచ్చిన ప్రత్యేక జీవో వెసులుబాటు నిన్నటితో ముగిసింది. ఇవాళ్టి నుంచి సర్కారువారి పాట సినిమాను సాధారణ టికెట్ ధరలకే థియేటర్లలో చూడొచ్చు. అయితే దీని వల్ల ఏంటి ఉపయోగం? టికెట్ రేట్లు తగ్గాయని జనాలు థియేటర్లకు వస్తారా? మరోసారి సర్కారువారి పాట సినిమాను చూస్తారా?
మహేష్ సినిమా కోసం ఆంధ్రప్రదేశ్ లో 12వ తేదీ నుంచి 10 రోజుల పాటు టికెట్ రేట్ల పెంపు అమల్లోకి వచ్చింది. తెలంగాణలో ఈ టికెట్ రేట్ల పెంపునకు వారం రోజుల పాటు అనుమతి ఇచ్చారు. దీంతో పాటు తెలంగాణలో తొలి వారం రోజుల పాటు రోజుకు 5 షోలు వేసుకునే వెసులుబాటును కల్పించారు. నాన్-ఏసీ థియేటర్ల టికెట్ రేట్లలో ఎలాంటి మార్పుల్లేవు. ఇలా ఏపీలో 10 రోజులు, నైజాంలో వారం రోజుల పాటు భారీ రేట్లకు టికెట్లను అమ్ముకున్నారు.
నైజాంలో ఈ సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. అటు ఏపీలో మాత్రం ఉత్తరాంధ్రలో విడుదలైన వారం రోజులకే బ్రేక్ ఈవెన్ అయినట్టు పేపర్ ప్రకటనలు కూడా ఇచ్చుకున్నారు. మిగతా ప్రాంతాల్లో ఇంకా వసూళ్లు రావాల్సి ఉంది.
నైజాంలో కీలకమైన హైదరాబాద్ విషయానికొస్తే.. ఇప్పటికీ ఇక్కడ మల్టీప్లెక్కుల్లో ఒక టికెట్ రేటు 328 రూపాయలుగా ఉంది. ఆన్ లైన్ లో బుక్ చేస్తే ట్యాక్సులతో కలుపుకొని ఓ టికెట్ కు ఇంత రేటు పెట్టాల్సి ఉంటుంది. ఈ రేటుకు కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా అనేది డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు ఓసారి ఆలోచించుకోవాలి. సాధారణ టికెట్ రేటు అంటే ఇదేనా? నలుగురు సభ్యులున్న ఓ మధ్యతరగతి కుటుంబం సినిమా చూడ్డానికి 2వేల రూపాయలు ఖర్చు అవుతుంటే (స్నాక్స్ తో కలిపి) అది సాధారణం ఎలా అవుతుంది?
ప్రస్తుతం దీనిపైనే సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతోంది. రేట్లు తగ్గించామని పైకి చెప్పి ఇలా దోచేయడం వల్ల బంగారు బాతు లాంటి థియేట్రికల్ వ్యవస్థను టాలీవుడ్ జనాలు నాశనం చేస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఓటీటీకి ఊతమిచ్చినట్టు అవుతుందంటున్నారు.
అది నిజమే.. ఇప్పటికే చాలామంది ప్రేక్షకులు థియేటర్లకు దూరమయ్యారు. ఓటీటీలో ఎప్పుడొస్తే అప్పుడు తీరిగ్గా చూసుకుందాం అనే మైండ్ సెట్ లోకి వెళ్లిపోయారు. ఇలాంటి టైమ్ లో సినిమా రిలీజైన వారం, 10 రోజుల తర్వాత టికెట్ రేట్లు సాధారణ స్థాయికి వచ్చాయని గొప్పగా చెప్పుకోవడం, దాన్ని ఘనంగా ప్రకటించి మరోసారి థియేటర్లకు ఆడియన్స్ ను రప్పించాలని ప్రయత్నించడంలో ఎలాంటి ఉపయోగం ఉండదు.