బిగ్ బాస్ హౌజ్ లో గెలిస్తే టాలీవుడ్ లో అవకాశాలు వస్తాయనేది అందరికీ తెలిసిందే. ఇప్పటికే చాలామంది అలా అవకాశాలు దక్కించుకున్నారు. ఇప్పుడు బిందుమాధవి వంతు వచ్చింది. బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరిట ఓటీటీలో 84 రోజుల పాటు నడిచిన రియాలిటీ షోలో విన్నర్ గా నిలిచింది బిందు మాధవి. ఆ వెంటనే బాలయ్య సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.
తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వాలని, టాలీవుడ్ లో మళ్లీ అవకాశాలు దక్కించుకోవాలనే లక్ష్యంతోనే బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చానని ఓపెన్ గా ప్రకటించిన ఈ హీరోయిన్, అనుకున్నట్టుగానే బాలయ్య లాంటి పెద్ద స్టార్ సరసన నటించే అవకాశం కొట్టేసింది.
బిందుమాధవి కోసం తను ఓ పాత్రను సిద్ధం చేస్తానని, అన్నీ అనుకున్నట్టు జరిగితే బాలయ్య సినిమాలోనే ఆ పాత్ర ఉండేలా ట్రై చేస్తానని అనీల్ రావిపూడి హామీ ఇచ్చాడు.
ప్రతి ఏటా స్టార్ మా ఛానెల్ లో వచ్చేది బిగ్ బాస్ రియాలిటీ షో. ఈసారి దానికి భిన్నంగా బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరిట ఓటీటీలో ఈ పోటీ పెట్టారు. డిస్నీ హాట్ స్టార్ వేదికగా ఫిబ్రవరి 27న మొదలైన ఈ రియాలిటీ షో కోసం ఎప్పట్లానే అన్నపూర్ణ స్టుడియోస్ లో భారీ సెట్ వేశారు.
అలా హౌజ్ లోకి చాలామంది కంటెస్టెంట్లు ప్రవేశించగా.. టాప్-5 లీగ్ లోకి మాత్రం బిందుమాధవితో పాటు అరియానా, అఖిల్ సార్థక్, యాంకర్ శివ, మిత్రా శర్మ మాత్రమే నిలిచారు.
వీళ్లలో బిందుమాధవి, అఖిల్ మధ్య గట్టిపోటీ నడిచింది. ఓ దశలో అఖిల్ గెలిచేస్తాడని అంతా అనుకున్నారు. అయితే బిందుమాధవికి కోలీవుడ్ కనెక్ట్ ఉంది. అట్నుంచి కూడా ఆమెకు కొన్ని ఓట్లు పడ్డాయి. అలా బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ గా బిందుమాధవి నిలిచింది.