Advertisement

Advertisement

indiaclicks

Home > Politics - Opinion

పరువు హత్యలు చేయకపోతే ఇలా కూడా జరగవచ్చు

పరువు హత్యలు చేయకపోతే ఇలా కూడా జరగవచ్చు

1985 ప్రాంతంలో హైదరబాదులోని చిక్కడపల్లి ప్రాంతంలో ఒక వైశ్య కుటుంబం. తండ్రి ఒక మధ్యతరగతి గుమాస్తా. అతనికి ఒక కొడుకు, కూతురు. కొడుకుకి పెద్దగా చదువబ్బలేదు. కూతురు ఒకతన్ని ప్రేమించింది. అతడొక మధ్యతరగతి ఎస్సీ. క్వాలిఫికేషన్ ఏంటంటే బ్యాడ్మింటన్ ఆటగాడు. 

ఇంకేముంది..ఇంట్లో అందరూ భగ్గుమన్నారు. తండ్రి చివాట్లు పెట్టాడు. అన్న అతన్ని చంపుతానని ఊగిపోయాడు. కానీ ప్రేమికులిద్దరూ ఎదిరించి వెళ్లిపోయి పెళ్ళి చేసుకున్నారు. 

కొన్నాళ్లకి స్పోర్ట్స్ కోటాలోనూ, రిజర్వేషన్ కారణంగానూ అతనికి కేంద్రప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. క్రమంగా బావమరిదిని ఆదుకున్నాడు. ఒకప్పుడు కోపంతో ఊగినతను బావ పవర్ చూసి తగ్గాడు.  మామగారికి సుస్తీ చేస్తే పెద్ద హాస్పిటల్లో దగ్గరుండి వైద్యం ఇప్పించాడు అల్లుడు. ఆయనకూడా అల్లుడి మనసు తెలుసుకుని కులం గురించి ఆలోచించడం మానేసాడు. ఉన్నంతకాలం అల్లుడిని అల్లుడిగానే చూసాడు. కాలక్రమంలో కన్ను మూసాడు. 

నేడు ఆ అల్లుడొక పెద్ద బ్యూరోక్రాట్. షష్టిపూర్తికి దగ్గరపడ్డాడు. పలుకుబడి ఉన్నవాడు. తన ఇంఫ్లుయెన్స్ నీడలో బావమరిది, అతని కుటుంబం కూడా లబ్ధి పొందారు. బావ సలహా లేనిదే బావమరిది ఏ పనీ చేయడు. అలా ఉంది నేడు వాళ్ల అనుబంధం. 

కోపం అనేది తాత్కాలికం. దానిని పెంచి పోషించి పగగా మార్చకూడదు. కోపం చల్లారిపోయింది కాబట్టి పైన చెప్పుకున్న కుటుంబం ప్రశాంతంగా బతికేసింది. అదే కత్తి దూసుంటే ప్రాణం పోవడం, కూతురు శాశ్వతంగా తన పుట్టింటివారిని వెలివేయడం, నేరస్థులై జైల్లో చిప్పకూడు తినడం, దశాబ్దాల పాటు అప్రతిష్ట ...ఇలా ఎన్నో జరిగుండేవి. 

పరువుహత్యలు చేయకపోతే ఇలాంటి శుభం కార్డులు చాలా జీవితాలకి పడొచ్చు. 

ఇలాంటి వాళ్లు మన చుట్టుపక్కల ఎందరో ఉంటారు. 

కులం వేరైనా, ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా ఎదిగిన పిల్లలు పెళ్లి విషయంలో తీసుకున్న నిర్ణయానికి తలొగ్గాల్సిన పరిస్థితులు కొన్నుంటాయి. అందరు పిల్లలూ తల్లిదండ్రుల్ని ఒప్పించే పెళ్లి చేసుకోవాలి అన్నంత ఉన్నతంగా ఉండరు. అలాంటి వాళ్లని కనడం తల్లిదండ్రులు ఏ జన్మలోనో చేసుకున్న పాపం అనుకుని పెళ్లికి పచ్చ జెండా ఊపేయాలి తప్ప నేరాలు చేసి కొత్త పాపాలు చేయడం ఎంత వరకు సబబు? 

ఒకవేళ అమ్మాయి ఇష్టపడింది అప్రయోజకుడిని, దుర్మార్గుడిని అని తెలిస్తున్నా పట్టుబట్టి పెళ్లి చెసుకుంటాననే మూర్ఖపు ప్రేమలో ఆమె మునిగిపోయుంటే తల్లితండ్రులు చేయగలిగిందేమీ లేదు. ఎవరి కర్మకి వారే బాధ్యులు. ఆ సమయంలో కూడా, "నువ్వు అతనితో క్షేమంగా, సుఖంగా ఉంటాననుకుంటే చేసుకో. కానీ తేడా వచ్చినప్పుడు ఈ ఇంటి గుమ్మం ఎప్పుడూ నీకు తెరిచే ఉంటుంది. అలాగని తేడా రావాలని ఆశీర్వదించడంలేదు. ఆ అవకాశం ఉందేమోనని అనుమానంగా ఉంది" అని చెప్పి పంపాలి తప్ప ఆమెను గదిలో పెట్టి తాళమేసి, అతనిని మర్డర్ చేయిస్తే ప్రాబ్లం సాల్వ్ కాదు. 

అయినా మనిషి ప్రాణం తీస్తే సమస్య పరిష్కారమవుతుందా? ఇంకా జటిలమవుతుంది కానీ...

"చెప్పడం తేలికే.. ఆ కష్టం నీకొస్తే తెలుస్తుంది" అని నన్ను అనొచ్చు. అది నిజమే. కచ్చితంగా పిల్లలు పెద్దలకిష్టం లేని పెళ్లిళ్లు చేసుకుంటే కష్టంగానే ఉంటుంది. దానిని పంటి బిగువున అణచుకుని ఎవరికి వాళ్లు నచ్చజెప్పుకోవాలి తప్ప పరువుహత్యలంటూ పరువుతక్కువ పనులు చేయకూడదనేది ఇక్కడి సారాంశం. 

జీవితం చాలా చిన్నది. మనం పుట్టకముందు ఎక్కడున్నామో తెలియదు. పోయాక ఏమౌతామో తెలియదు. ఉన్న కొన్నాళ్లూ నా కూతురు, నా కొడుకు, నా కులం, నా ఆస్తి, నా పరువు అంటూ నానా బ్యాగేజీల్ని నెత్తిన పెట్టుకుని బతికే బానిస బతుకూ ఒక బతుకేనా అనుకోవాలి. 

"మన పిల్లలు మన నుంచి రారు..మన ద్వారా మాత్రమే వస్తారు" అనే సత్యాన్ని గ్రహించాలి. అది గ్రహించినప్పుడు అక్కర్లేని వెర్రి ఎటాచ్మెంట్ తగ్గుతుంది. దానివల్ల కోపాలు త్వరగా తగ్గుతాయి. పగలు అస్సలు పెరగవు. 

శ్రీనివాసమూర్తి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?