జగన్ ను గద్దె దింపే ఏకైక లక్ష్యంతో జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ తరచు ఏదో ఊరికి వెళ్లి ఉపన్యాసాలు ఇస్తున్నారు. కానీ సుబ్బి పెళ్లి ఎంకి చావుకు వచ్చినట్లుంది పవన్ చేస్తున్న రాజకీయాలు..నిర్మాత ఎఎమ్ రత్నంకు ఇబ్బందిగా మారుతున్నాయి.
రెండు భారీ సెట్లు వేసి, ఈ నెల 12 నుంచి షెడ్యూలు వేస్తే అది కాస్తా క్యాన్సిల్ కొట్టారు. కేవలం పవన్ రాజకీయ కార్యక్రమాల కోసం. దీంతో రెండు సెట్లు వేసిన స్టూడియోకి రెంట్లు కట్టాల్సిందే.మళ్లీ కాంబినేషన్ కాల్ షీట్లు తీసుకోవాల్సిందే. ఇదంతా మామూలు తలకాయనొప్పి కాదు.
పవన్ ఓ లెంగ్తీ షెడ్యూలు క్యాన్సిల్ కొట్టడం వల్ల కేవలం హరి హర వీరమల్లు సినిమాకు, దాని నిర్మాత ఎ ఎమ్ రత్నం, దర్శకుడు క్రిష్ కు మాత్రమేనా ఇబ్బంది అంటే పొరపాటే. ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందా? తమ సినిమా ఎప్పుడు మొదలుపెడదామా అని వెనకాల రెండు యూనిట్ లు రెడీగా వున్నాయి.
అందులో ఒకటి సముద్రఖని డైరక్షన్ లో సినిమా. ఈ సినిమా జూన్ నుంచి మొదలు అనుకున్నారు. కానీ ఇప్పుడు హరిహర వీరమల్లు వెనుక్కు జరుగుతుంటే అదీ వెనక్కు జరగాల్సి వస్తోంది. ఈ రెండూ వెనక్కు జరుగుతుంటే ఎప్పటి నుంచో కాసుకుకూర్చున్న హరీష్ శంకర్ సినిమా భవదీయుడు భగత్ సింగ్ కూడా వెనక్కు జరగాల్సిందే.
ఆగస్టు నుంచి తమకు చాన్స్ వస్తుందని హరీష్ నమ్మకంగా వున్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అది సాధ్యం కానట్లు కనిపిస్తోంది. పైగా ఇక రోజు రోజుకు రాజకీయాలు ఊపందుకుంటాయి. అందువల్ల పవన్ షెడ్యూలు క్యాన్సిల్ అన్నది జరుగుతొనే వుంటుందేమో? పాపం, పవన్ నిర్మాతలు.