Advertisement

Advertisement


Home > Politics - Opinion

ముందస్తు ఎన్నికల ముచ్చట్లు

ముందస్తు ఎన్నికల ముచ్చట్లు

ఆంధ్ర అసెంబ్లీ కాలపరిమితి ఇంకా చాలా కాలం వుంది. కానీ ఆంధ్రలో మాత్రం ఎన్నికల వేడి వేసవి వేడితో సమానంగా పెరిగిపోతోంది. అధికారపక్షం, ప్రతిపక్షం అన్నీ కూడా ఎన్నికల సన్నాహాల్లో మునిగిపోయాయి. గత రెండున్నరేళ్లుగా ఎక్కడున్నారో తెలియని తెలుగుదేశం నాయకులు వీధుల్లోకి వస్తున్నారు. జెండాలు కడుతున్నారు. పార్టీ ఆఫీసులు తెరిచారు. రెండున్నరేళ్లు పాలనలో బిజీగా వుంటూ జ‌నాల మధ్యకు రాలేకపోయిన సిఎమ్ జ‌గన్ ఏ అవకాశం దొరికినా జ‌నం ముందుకు వస్తున్నారు. 

తెలుగు దేశం పార్టీ నాయకుడు నార్త్ సైడ్ వుంటే జ‌నసేన అధిపతి పవన్ సౌత్ సైడ్ కు వెళ్లూ, వెల్ ప్లాన్డ్ గా టూర్లు ప్లాన్ చేసుకుంటున్నారు. సీనియర్లు అంతా అమ్మ…ఆలి రేంజ్ లో కాకున్నా, కాస్త అటు ఇటుగా బూతులు తిట్టేసుకుంటున్నారు. పనిలో పనిగా ట్విట్టర్ ను కూడా బూతుల పంచాంగంగా మార్చేస్తున్నారు. మొత్తం మీద ఆంధ్రలో ఎన్నికల వాతావరణం మెల్లగా అలుముకుంటోంది. వాస్తవానికి ఆంధ్రలోనే కాదు తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి. కానీ ఆంధ్ర రేంజ్ హడావుడి లేదంతే.

ఇలాంటి నేపథ్యంలో ఏ క్షణమైనా ఎన్నికల యుద్దం రావచ్చు అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించేసారు. సర్వం సిద్దంగా వుండడంటూ తన సేనలకు పిలుపు నిచ్చారు. కొన్నాళ్ల క్రితం దాదాపు ఇదే తరహా మాటలను సిఎమ్ జ‌గన్ కూడా అన్నారు. మరోపక్కన జ‌నసేన పార్టీ లోకల్ నేతలు యాక్టివ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ కూడా కొత్త పిసిసి అధ్యక్షుడిని తెచ్చి, పార్టీని కనీసం లేచి నిల్చునేలా చేయాలని అనుకుంటోంది. అంటే ముందస్తు ఎన్నికల ముచ్చట నిజ‌మేనా? అనే అనిపిస్తోంది. కానీ ఈ ముచ్చట ఎవరిది? రాష్ట్రానిదా? కేంద్రానిదా?

ఈ ప్రశ్న వేసుకుంటే మాత్రం కేంద్రానికే అన్న సమాధానం వస్తోంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్లాలని ఆంధ్రలో సిఎమ్ జ‌గన్ ఎందుకు అనుకుంటారు. మొన్నటికి మొన్నే మంత్రి వర్గాన్ని మార్చారు. అభివృద్ది పనుల మీద దృష్టి పెట్టారు. రోడ్ల మరమ్మతులు ప్రారంభమయ్యాయి. కరెంట్ కష్టాలు తీరుతున్నాయి. ఇలాంటి టైమ్ లో ఎన్నికలకు వెళ్లాలని అనుకోవడం సరి కాదు. మహా అయితే మరో ఏడాది తరువాత వెళ్లాలని అనుకుంటే అనుకోవచ్చు.

కానీ కేంద్రం వైపు వ్యవహారం అలా కనిపించడం లేదు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుంచి సమర సన్నాహాల్లోనే వుంది. మరోపక్కన కాంగ్రెస్ పార్టీ చింతన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసింది. ఆ పార్టీకి అంత టైమ్ ఇవ్వడం అవసరమా అనే ఆలోచన భాజ‌పాకు వుంది. మేధావి వర్గం రెండుగా చీలిపోయింది. భాజ‌పా అనుకూల మేధావి వర్గం, వ్యతిరేక వర్గం బలంగా సోషల్ మీడియాలో ఢీకొంటున్నాయి. మరోపక్కన పెట్రోలు ధరలు, వంట నూనెల ధరలు ఆకాశాన్ని అంటేసాయి. 100 రూపాయల రేంజ్ లో వున్న వంట నూనెల ధరలు ఒకేసారి రెండు వందల రేంజ్ కు వెళ్లిపోయాయి. నార్త్ కు కీలకమైన గోధుమ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెట్రోలు సంగతి సరే సరి, గ్యాస్ సంగతి మరీ భయంకరం.

మోడీ ప్రభుత్వం సబ్సిడీలకు సైలంట్ గా మంగళం పాడేసింది. సీనియర్ సిటిజ‌న్లకు ఉపకరించే బ్యాంక్ వడ్డీలు లేకుండా పోయాయి. రైళ్లలో సీనియర్ సిటిజ‌న్లకు కనెక్షన్ పక్కన పెట్టారు. గ్యాస్ సబ్సిడీ వందల నుంచి నాలుగు రూపాయలకు దిగిపోయింది. అయినా ప్రత్యామ్నాయం అన్నది లేక మోడీ ప్రభుత్వం మాత్రమే ఓన్లీ ఆల్టర్ నేటివ్ అన్నట్లు అయిపోయింది. ఇలాంటి నేపథ్యంలో హిందూ కార్డ్ ఒక్కటే మోడీ ప్రభుత్వానికి రక్షగా మారింది. లేటెస్ట్ గా జ్ఞాన్‌వాపి శివలింగం ఉదంతం ఫేస్ బుక్ లను, వాట్సాప్ లను ఊపేస్తోంది.

అందువల్ల యాంటీ ఓటు పెరగకుండా, ప్రతిపక్షాలు బలపడకుండా వుండగానే మోడీ ఎన్నికలను ఫేస్ చేయాలనుకుంటున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.అదే నిజ‌మైతే రాష్ట్రాలు చేయగలిగింది లేదు. జ‌గన్, కేసిఆర్ కలిసి అంతేగా..అంతేగా అనడం మినహా మరో దారి లేదు. ఈ క్షణం ఏ క్షణమైనా రావచ్చనే ఆలోచనతోనే జ‌గన్ చకచకా పావులు కదుపుతున్నారు. తెలుగుదేశం, జ‌నసేన ఢీ అంటే ఢీ అంటున్నాయి.

ఆంధ్రలో జ‌గన్ ఎన్నికల టీమ్ అయిన ప్రశాంత్ కిషోర్ బృందం అప్పుడే రంగంలోకి దిగిపోయింది. సర్వేల మీద సర్వేలు సాగుతున్నాయి. ఆల్టర్ నేటివ్ అభ్యర్ధుల జాబితా కు కసరత్తు మొదలైపోయింది. తెలుగుదేశం పార్టీలో కూడా జ‌నసేనతో పొత్తు అంటే దానికి వదలగలిగిన మాగ్జిమమ్ స్థానాల మీద కసరత్తు మొదలైనట్లు బోగట్టా. కానీ జ‌గన్ ముందస్తు ఎత్తుగడంతో ఆ పార్టీలు రెండూ ఒకటే, దత్తపుత్రుడు, తెలుగుదేశం బీ టీమ్ అనే మాటలు విసురుతూ, ఆ కలయికకు బ్రేక్ లు వేస్తోంది. ఇప్పటి నుంచీ ఇదే ప్రచారం సాగిస్తే కలయికను ఆపే అవకాశం అలాగే కలిసినా మైనస్ చేసే అవకాశం వుంటుందనే ఎత్తుగడ దాని వెనుక కనిపిస్తోంది.

జ‌గన్ కు కలిసివచ్చే అంశాలు ఏమిటంటే కేంద్రం కాస్త అనుకూలంగా వుండడం, అప్పులకు అనుమతులు లభిస్తూ వుండడం. దానివల్ల ఎన్నికల వేళ వరకు జ‌నాలకు పంచాల్సినవి పంచుకోవచ్చు. అభివృద్ది పనులు చేసుకోవచ్చు. అన్నింటికి మించి రాజ‌ధాని వికేంద్రీకరణ మీద దృష్టి పెట్టవచ్చు. ఆ విధంగా ప్రాంతీయ ఓటర్ల మనసు గెలుచుకోవచ్చు.

జ‌గన్ కు కనీసం 30 శాతం ఫిక్స్ డ్ ఓటు బ్యాంకు వుంది అని ప్రతిపక్షాలు సైతం అంగీకరిస్తున్నాయి. ఇప్పడు దాన్ని మరింత మెరుగుపర్చుకోవాల్సి వుంది. అలా వున్న అవకాశాల్లో ప్రధానమైనది ఉద్యోగుల ఓట్ బ్యాంక్. ఉద్యోగులకు ఏ పార్టీ మీద ప్రేమా వుండదు. ద్వేషమూ వుండదు. వారికి కావాల్సినవి ఎవరు ఇస్తే వారికే మద్దతు. ఈ అంశం మీద జ‌గన్ దృష్టి పెట్టాల్సి వుంటుంది. బిసి ఓటు బ్యాంక్ ను పూర్తిగా నమ్ముకుంది. కాపు, కమ్మ ఓట్లను దాదాపు వదులుకోవడానికే సిద్దమైంది. మైనారిటీ, ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ తమదే అన్న ధీమాతో వుంది.

జ‌గన్ మైనస్ అన్నది ప్రచారం. సోషల్ మీడియాలో జ‌గన్ కు నెగిటివ్ ప్రచారం గట్టిగానే కనిపిస్తోంది. అప్పుల వ్యవహారం, ప్రఙలకు పంచడం అన్నది ఓ సెక్షన్ లో కొంత నెగిటివ్ చేసింది. అలాగే రోడ్ల మరమ్మతు ఆలస్యం కావడం అన్నది కొంత వరకు మైనస్ చేసింది. తెలుగుదేశం అధికారంలో వున్నపుడు ఎక్కడ ఏం ఙరిగినా దాన్ని అణచిపెట్టిన ‘సామాజిక మీడియా’ ఇప్పుడు ఏ చిన్న విషయాన్నైనా గోరింతలు కొండంతలు చేస్తోంది.

ఇలాంటి ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్డడం అన్నది జ‌గన్ సోషల్ మీడియా వింగ్ కు సాధ్యం కావడం లేదు. జ‌గన్ చుట్టూ చేరిన వారు తమ పనులు తాము చక్క బెట్టుకోవడంలో బిజీ అయ్యారు. జ‌గన్ అధికారంలోకి రాకముందు తెగ హడావుడి చేసిన నాయకులు అంతా ఎన్నికల తరువాత ఏదో ఒక పోస్ట్ అందుకుని సైలంట్ అయిపోయారు. మొన్నటి దాకా మంత్రులుగా వున్నవారు పదవులు పోయాక ఇళ్లకే పరిమితం అయిపోయారు.

తెలుగుదేశం పార్టీ సమరోత్సాహంతో సాగుతోంది. ఆల్ మోస్ట్ విజ‌యం తమ గుమ్మంలోకి వచ్చేసినంత హడావుడి చేస్తోంది. కానీ కేడర్ దగ్గరకు వచ్చేసరికి సమస్యగానే వుంది. కేడర్ చాలా వరకు ఙారిపోయింది. అటు జ‌నసేన వైపు, ఇటు వైకాపా వైపు మళ్లిపోయింది. అభ్యర్ధులను ముందుగా డిసైడ్ చేస్తే తప్ప క్యాడర్ ను కూడగట్టకోవడం సాధ్యం కాదు. అప్పటికప్పుడు పేర్లు ప్రకటిస్తే క్యాడర్ ను సమకూర్చుకోవడం కష్టం అవుతుంది. అదే ఆ పార్టీకి అతి పెద్ద మైనస్. జ‌నసేనను దగ్గరకు తీస్తే బిసి ఓటు బ్యాంక్ తెలుగుదేశానికి ఏ మేరకు వస్తుంది అన్నది చూడాలి.

జ‌నసేనకు లోకల్ గా ఊపు బాగుంది. కేడర్ వుంది. కానీ ఆర్గనైజ్ చేసే మిడ్ రేంజ్ లీడర్ షిప్ ఇంకా రంగంలోకి దిగలేదు. ఏయే స్థానాల్లో జ‌నసేన పోటీ చేస్తుంది అన్న క్లారిటీ వస్తే తప్ప సరైన దిశ అన్నది రాదు. అలా పోటీ చేయకపోతే ఈ క్యాడర్ తెలుగుదేశం పార్టీకి అండగా నిలస్తారా? వైకాపా వైపు వెళ్తారా అన్నది పోటీ చేసే అభ్యర్ధులను బట్టి వుంటుంది. జ‌నసేన కేడర్ అంతా తమకే ఉపయోగపడుతుందనే భ్రమలో తెలుగుదేశం వున్నట్లు కనిపిస్తోంది. కానీ స్థానిక సామాజిక ఈక్వేషన్ల దృష్ట్యా అదంత సులువు కాదు. భాజ‌పా కేవలం పోటీకే పరిమితం అవుతుందేమో తప్ప, అంతకు మించి వుండకపోవచ్చు.

మొత్తం మీద ఆంధ్రలో ఎన్నికల వేడి అలుముకుంటోందన్నది వాస్తవం. ఇంకా ఎత్తులు, పొత్తులు, పై ఎత్తులు అనే వరకు రాలేదు. వన్స్ ఆ స్టేజ్ వస్తే…ఇక జ‌నాలకు 24/7 ఇదే హడావుడి వుంటుంది.

ఆర్వీ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?