ఆన్ లైన్ లో లోన్ యాప్స్ ద్వారా అప్పులు తీసుకొని, వాటికి వడ్డీలు కట్టలేక అవమానాలు పాలైన వ్యక్తులు తెలుగు రాష్ట్రాల్లో కోకొల్లలు. లక్ష రూపాయలు తీసుకొని వడ్డిగా 2 లక్షలు కట్టిన ఘటనలు కూడా చూశాం. వడ్డీల భారం భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా చూశాం. ఓవైపు ఇలాంటి యాప్స్ పై ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, మరోవైపు ఈ యాప్స్ ఆగడాలు ఆగడం లేదు.
తాజాగా ఓ లోన్ యాప్, న్యూడ్ ఫొటోలతో ఓ మహిళను బెదిరించాయి. మహిళ ఫొటోకు, నగ్నంగా ఉన్న మరో శరీరాన్ని జతచేసి, మార్ఫింగ్ చేసి, ఆ ఫొటోలతో బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది. మంచిర్యాలలో జరిగింది ఈ దారుణం.
మంచిర్యాలలో గోపాలవాడకు చెందిన కల్యాణి అనే మహిళ లోన్ యాప్ లో డబ్బులు తీసుకుంది. ఆమె తీసుకున్నది కేవలం 5వేల రూపాయలు మాత్రమే. అయితే సమయానికి డబ్బులు కట్టకపోవడంతో అది కాస్తా 30వేల రూపాయలైంది. వెంటనే ఆ డబ్బు కట్టాలని, లేదంటే న్యూడ్ ఫొటోలను బయటకు వదులుతామంటూ మార్ఫింగా ఫొటోలతో బెదిరించడం మొదలుపెట్టింది లోన్ యాప్.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కల్యాణి, తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఓవైపు ఇంత జరిగినా, లోన్ యాప్ మాత్రం తన ఆగడాలు ఆపలేదు. కల్యాణి చనిపోయినప్పటికీ వేధింపులు కొనసాగించింది. చనిపోయిన ఫొటోను పంపించాలని డిమాండ్ చేసింది.
దీనికి సంబంధించి మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. వేధింపులకు గురిచేసిన సదరు లోన్ యాప్ వివరాల్ని బయటకు లాగేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.