తెలుగు భాషకు రామోజీ నేతృత్వంలో చేసిన, చేస్తున్న సేవ అమూల్యం. ఇందులో రెండో మాటకే తావులేదు. అయితే రాజకీయంగా ప్రత్యర్థిగా భావిస్తున్న వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దగ్గరికి వచ్చే సరికి “ఈనాడు”కు తెగులొస్తుంది. తన మార్క్ వక్రభాష్యాన్ని, విషపు రాతల్ని రాసేందుకు ఈనాడు తనను తాను చంద్రబాబుకు బలి పెట్టుకుంటోంది. ఇదే విషాదం.
ఇవాళ ఈనాడులో టీడీపీ, వైసీపీ ఎన్నికల ఖర్చు గురించి రాస్తూ, జగన్‌పై విషాన్ని చిమ్మడం గురించి తెలుసుకుందాం.
“భాజపా అన్ని పార్టీల కంటే అత్యధికంగా రూ.1,264 కోట్టు ఖర్చు చేసింది. మొత్తం ఎన్నికల వ్యయంలో దీని వాటా 41.49%. కాంగ్రెస్ రూ.820 కోట్లు (26.92%) ఖర్చు చేసి రెండో స్థానంలో నిలిచింది” అని రాసింది.
ఇందులో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను సమానంగా “ఈనాడు” చూడడాన్ని గుర్తించొచ్చు. తెలుగు రాష్ట్రాలకు, అది కూడా జగన్ దగ్గరికి వచ్చే సరికి ఈనాడు కలం వంకర ఎలా తిరుగుతుందో తెలుసుకుందాం.
“తెలుగు రాష్ట్రాల్లోని నాలుగు ప్రాంతీయ పార్టీలు కలిపి చేసిన వ్యయం రూ.227 కోట్లు. ఇందులో రూ.131 కోట్లతో తెదేపా తొలిస్థానం లో నిలవగా, రూ.86 కోట్ల వ్యయంతో వైకాపా రెండో స్థానాన్ని ఆక్రమించింది” అని “ఈనాడు” రాసింది. తెదేపా మాత్రం తొలిస్థానంలో నిలిచినట్టు రాసి, వైసీపీ విషయానికి వచ్చేసరికి రెండో స్థానాన్ని ఆక్రమించిందని రాయడం వెనుక రామోజీరావు అక్కసు ఎంత తీవ్రస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
చంద్రబాబుపై అపార భక్తి, జగన్‌పై ద్వేషాన్ని ప్రకటించే క్రమంలో ఈనాడు అన్ని విలువలకూ పాతరేస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈనాడు ప్రతి అక్షరం జగన్‌పై విషపు సిరాతో రాస్తుందనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?