ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు అసలు కథ ఇప్పుడే మొదలైందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయనపై ఏపీ సర్కార్ సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 8 నుంచి ఏబీవీని విధుల్లోకి తీసుకున్నట్టుగా ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఏబీవీ వర్సెస్ ఏపీ సర్కార్ మధ్య వివాదానికి తెరపడినట్టు అందరూ భావించారు.
అయితే ఇక్కడే ట్విస్ట్. ప్రభుత్వం ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ఒకవైపు ఏబీవీ సస్పెన్షన్ ఎత్తివేత ప్రక్రియ సాగుతుండగానే, మరోవైపు 17 మంది సీనియర్, జూనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ బదిలీల జాబితాలో ఏబీవీ చోటు దక్కించుకోకపోవడం గమనార్హం. దీంతో ఏబీవీ పోస్టింగ్‌పై ప్రభుత్వ మనసులో ఏముందో అర్థం చేసుకోవచ్చు.
తదుపరి పోస్టింగ్ ఇచ్చే వరకూ జీఏడీకి రిపోర్ట్ చేసుకోవాలని ఏబీవీని ప్రభుత్వం ఆదేశించింది. ఏబీవీకి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇచ్చేందుకు చీఫ్ సెక్రటరీ సమీర్‌శర్మ నిరాకరించడాన్ని చూశాం. అలాంటిది తనకు పోస్టింగ్ ఇస్తారని ఏబీ వెంకటేశ్వర రావు అనుకుంటే అత్యాశే.
గతంలో విధుల్లో భాగంగా ఏబీ వెంకటేశ్వరరావు అక్రమాలకు పాల్పడ్డారా? అని మరోసారి ప్రభుత్వం అన్వేషణ మొదలు పెట్టినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో తనకు పోస్టింగ్ కథ దేవుడెరుగు, మరోసారి ఏదో ఒక కారణంతో సస్పెన్షన్ వేటు వేయకపోతే అదే చాలని ఏబీ తృప్తి పడాల్సి వుంటుంది. ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే ఏబీని విధుల్లోకి తీసుకుంటున్నట్టు ఉత్తర్వులు ఇవ్వడమే తప్ప, ప్రత్యేకంగా పోస్టింగ్ ఇచ్చే సూచనలు కనిపించడం లేదని ఉన్నతాధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారం.