ఆయన సీనియర్ మోస్ట్ నాయకుడు. రాజకీయ నాయకుడి కంటే కూడా రాజనీతి కోవిదుడు అని అంతా అంతారు. ఆయన చిల్లరగా మాట్లాడరు అని పేరు. ఇక వారిది ఘనత వహించిన పూసపాటి వంశం. ఆయనే కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు. ఇక చూస్తే తాజాగా విజయనగరం జిల్లాలో జరిగిన మినీ మహానాడులో అశోక్ చేసిన కొన్ని కామెంట్స్ సంచలనంగా మారాయి.
ఆయన ఏపీలోని వైసీపీ సర్కార్ మీద విమర్శలు ధాటీగానే చేశారు. దశ, దిశ లేని ప్రభుత్వం అన్నారు. ప్రభుత్వం అనేక రకాలుగా వైఫల్యం చెందింది అని కూడా అన్నారు. అలా మాట్లాడుతూనే ఆయన ఒక్కసారిగా జగన్ మీద వ్యక్తిగత విమర్శలు కూడా గట్టిగానే చేశారు.
అయితే అవి జగన్ కి తగిలినట్లుగా ఉన్నా ఓటేసిన ప్రజల మీద కూడా అక్కసు వెళ్ళగక్కినట్లుగా ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పటికి పలు మార్లు ఈ తీరుగానే టీడీపీ అధినేత చంద్రబాబు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఇపుడు అదే మాదిరిగా అశోక్ కూడా ప్రజల మీద అక్కసు వెళ్లగక్కినట్లుగా ఉందని అంటున్నారు.
ఇంతకీ అశోక్ ఏమన్నారు అంటే జైల్లో ఉన్న నేరస్థుడ్ని ముఖ్యమంత్రిని చేశారన్నారు. రూ.43వేల కోట్లను మింగిన వ్యక్తికి అధికారం అప్పజెప్పారని కూడా అన్నారు. ఈ విధంగా ఆయన అనడం ద్వారా ప్రజల వివేచనా శక్తిని, వారి ఓటు వేసే సమర్ధతను ప్రశ్నించారా అన్న చర్చ కూడా వస్తోంది.
ఎవరికి ఓటు వేయాలో ప్రజలకు తెలియదు అన్నట్లుగానే ఇప్పటిదాకా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు తప్ప తమ అయిదేళ్ళ పాలనలో తప్పులు ఏం చేశామని చిత్తశుద్ధితో సమీక్ష చేసుకోవడం లేదని అంటున్నారు. ఇక అశోక్ వంటి పెద్ద మనిషి సైతం జనాలదే తప్పు అన్నట్లుగా మాట్లాడడమే చిత్రం.
మరో వైపు చూస్తే రాష్ట్రంలో గమ్మత్తైన రాజకీయాలు నడుస్తున్నాయని అశోక్ అంటున్నారు. ఆ విధంగా ఆలోచిస్తే నిజమే. విపక్షం ప్రజా కోణాన్ని మార్చేసి రాజకీయ కోణానికి పెద్ద పీట వేయడం కూడా ఒక గమ్మత్తుగానే చూడాలని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే జగన్ ఈ రోజుకీ నిందితుడు మాత్రమే.
ఆయన మీద కేసులు ఏవీ రుజువు కాలేదు. అలాంటిది ఆయన 43 వేల కోట్లను మింగేశాడు అని అశోక్ ఎలా అంటారు, ఎలా తీర్పు ఇచ్చేస్తారు అని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మొత్తానికి అక్కసు తో పాటు అసహనమే టీడీపీ పెద్ద మనుషుల చేత ఇలాంటి కామెంట్స్ చేయిస్తోందా అన్నదే అంతా అంటున్న మాటగా ఉంది.