Advertisement

Advertisement


Home > Politics - Analysis

151.. 156.. అసలు వైసీపీ బలం ఎంత?

151.. 156.. అసలు వైసీపీ బలం ఎంత?

వైసీపీ గెలుచుకున్న స్థానాలు 151. ఆ తర్వాత అభిమానంతో దగ్గరైన ఇతర పార్టీల ఎమ్మెల్యేల సంఖ్య 5. మొత్తం కలిపితే 156. కానీ మూడేళ్ల తర్వాత కూడా ఆ పార్టీ నేతలు తమ బలం 151 మాత్రమే అని చెప్పుకుంటున్నారు. 

సాక్షాత్తూ పార్టీ అధినేత కూడా తమకి 151మంది ఎమ్మెల్యేలున్నారని, 2024లో 175 స్థానాలు గెలుస్తామని అంటున్నారు. అంతే తప్ప, పార్టీలోకొచ్చిన ఆ ఐదుగురిని లెక్కలోకి తీసుకోవడం లేదు. మరి పార్టీ కండువా కప్పుకోకుండా జగన్ పక్కన నిలబడి ఫొటోలు దిగిన ఆ ఐదుగురి పరిస్థితి ఏంటి..?

టీడీపీ టికెట్ పై గెలిచిన కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్, జనసేన టికెట్ పై గెలిచిన రాపాక వరప్రసాద్.. వీరంతా వైసీపీ స్టాండ్ తీసుకోడానికి ఎంతో కాలం పట్టలేదు. ఏడాదిలోపే అందరూ టీడీపీకి బైబై చెప్పేశారు. కానీ జగన్ పెట్టిన కండిషన్ వల్ల వీరు వైసీపీ తీర్థం పుచ్చుకోలేదు, కండువా కప్పుకోలేదు. 

లాజికల్ గా వైసీపీ సానుభూతిపరులు అనిపించుకున్నారు. తమ అనుచరులను, కుటుంబసభ్యులను వైసీపీలో చేర్చి మమ అనిపించారు. ఆ తర్వాత అన్నిచోట్లా అధికార పార్టీ ఎమ్మెల్యేలుగానే హవా చూపించాలనుకున్నారు.

కానీ ఎక్కడో తేడా కొట్టింది. ఆ ఐదుగురు మానసికంగా జగన్ తోనే ఉన్నా.. భౌతికంగా మాత్రం వైసీపీతో పూర్తి స్థాయిలో కలవలేకపోతున్నారు. ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్న వైసీపీ నేతలు వారిని తమవారిగా అంగీకరించలేకపోతున్నారు. 

గతంలో చంద్రబాబు తెలివిగా కండువా కప్పేసి, వైసీపీ ఎమ్మెల్యేలను నేరుగా తనతోనే తిప్పుకునేవారు. సభల్లో తన పక్కన కూర్చోబెట్టుకునేవారు, వారికే నియోజకవర్గ పార్టీ పగ్గాలు కూడా అప్పగించారు. అదెంత తప్పో ఆయనకి ఆ తర్వాత ఎన్నికల్లో తెలిసొచ్చింది.

పార్టీమారిన ఏ ఒక్కరూ గెలిచిన పాపాన పోలేదు. సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే వారికి షాకిచ్చారు. ఇక్కడ వైసీపీలో ఆ పరిస్థితి లేదు. స్థానికంగా వైసీపీ నేతలు బలంగానే ఉన్నారు. వారితో పొసగక పక్క పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు దూరంగా ఉంటున్నారు. అధికారిక కార్యక్రమాల్లో కూడా వారి ప్రాధాన్యత అంతంతమాత్రమే. అందులోనూ అధినేత జగన్ ఆ ఐదు నియోజకవర్గాల్లో అధికారిక కార్యక్రమాలు చేపట్టకపోవడంతో సందడి లేకుండా పోయింది.

భవిష్యత్ ఏంటి..?

ప్రస్తుతానికి ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కూడా అంత హుషారుగా పాల్గొనడం లేదు. అంటే ఎక్కడో చిన్న గ్యాప్ ఉందనే విషయం అర్థమవుతోంది. మరి ఆ గ్యాప్ ని కనీసం ఈ రెండేళ్లలో అయినా పూడ్చుకుంటారా..? లేక పెద్దది చేసుకుని పార్టీ టికెట్ కే ఎసరు తెచ్చుకుంటారా అనేది తేలాల్సి ఉంది. 

వైసీపీ లెక్క ప్రకారం ప్రస్తుతానికి ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 151 మాత్రమే. పార్టీ మారిన ఐదుగురిని వారు కౌంట్ చేయడం లేదు. చంద్రబాబు చేసిన తప్పును వైసీపీ రిపీట్ చేయడం లేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?