చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ల వరకు అందర్నీ ఇబ్బంది పెట్టే కాలం చలికాలం. ఈ సీజన్ లో అంతా మరిచిపోయే సింపుల్ విషయం ఏంటంటే.. మానవ శరీరంలో ఎక్కువగా రోగాలు పుట్టడానికి కారణం చలికాలం. ఎక్కువ శారీరక సమస్యలు ఎదుర్కొనే కాలం కూడా ఇదే. ఈ విషయం చాలామందికి తెలిసినా నిర్లక్ష్యం వహిస్తుంటారు.
మరీ ముఖ్యంగా వింటర్ సీజన్ ను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై చాలామందికి క్లారిటీ ఉండదు. చలికాలంలో ఏం తింటే ఆరోగ్యంగా ఉంటాం, రోగనిరోధకశక్తి పెరుగుతుందనే విషయాన్ని ఎక్కువమంది పట్టించుకోరు. దీనిపై ఆహార నిపుణులు కొన్ని సింపుల్ సూచనలు అందిస్తున్నారు. వాటిని పాటిస్తే శీతాకాలంలో రోగాల బారి నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు.
చలికాలంలో ఎక్కువమంది ఎదుర్కొనే సమస్య అజీర్తి. తిన్నది అరక్కపోవడం, పొద్దునే కాలకృత్యాలు సక్రమంగా జరక్కపోవడం ఈ కాలంలో ఎక్కువ. దీనికి సింపుల్ చిట్కా తృణధాన్యాలు. వింటర్ సీజన్ లో తృణధాన్యాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలంటున్నారు డైటీషియన్లు. ఐరెన్, ప్రొటీన్లతో పాటు ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి అజీర్తి సమస్యలు ఎదురుకావు. పైగా రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
ఒకప్పుడంటే తృణధాన్యాలతో ఏదో ఒకటి వండి తినాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు తృణధాన్యాలతో చేసిన స్నాక్స్ అందుబాటులోకి వచ్చాయి. పైగా వాటిని బెల్లంతో తయారుచేస్తున్నారు కాబట్టి అందరూ తినొచ్చు.
ఈ కాలంలో బెల్లం తినడం కూడా అత్యావశ్యకం కాబట్టి.. అటు మిల్లెట్లు, ఇటు బెల్లం రెండూ ఉన్న స్నాక్స్ ను తినడం చాలామంచిది. అదే సమయంలో కార్బొహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే రైస్ ను తగ్గించడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.
తృణధాన్యాలు, బెల్లం తర్వాత ఆహారంలో నెయ్యి, ఉసిరికాయ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. కొంతమంది నెయ్యి వాడుతుంటారు కానీ ఉసిరికాయకు మాత్రం చాలామంది దూరం. కానీ చలికాలం ఉసిరికాయ తినాలంటున్నారు వైద్య నిపుణులు.
ఈ కాలం దొరికే ఆరెంజ్ కంటే ఉసిరి గొప్ప మేలు చేస్తుందని చెబుతున్నారు. ఇక నెయ్యి తినడం వల్ల చర్మం డ్రై అవ్వకుండా ఉంటుంది. పైగా జీర్ణ క్రియను పెంచుతుంది. పైన చెప్పిన ఆహార పదార్థాలతో పాటు రోజూ తినే భోజనంలో పసుపు-వెల్లుల్లి మోతాదును కాస్త పెంచాలని సూచిస్తున్నారు డైటీషియన్లు.
చలికాలం తినే ఆహారంలో పసుపు-వెల్లుల్ని మోతాదును కాస్త పెంచడం వల్ల శరీరానికి అవసరమైన రోగ నిరోధక శక్తి తక్షణం అందుతుందని చెబుతున్నారు. ఇలాంటి చిన్న చిట్కాలు పాటిస్తే, ఈ చలికాలంలో వెచ్చగా ఉండొచ్చు.