రాజకీయ కామెడీ స్టార్ గా పవన్ కళ్యాణ్

సినిమాలలో సీరియస్ సన్నివేశాలు నడుస్తున్నప్పడు మద్యలో కామెడీ సీన్ పెడతారు. ఎందుకంటే ప్రేక్షకులకు కొంత రిలీఫ్ ఇవ్వడానికి అని చెబుతారు. ఇప్పుడు రాజకీయాలలో కూడా ఆ తరహా పద్దతిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్…

సినిమాలలో సీరియస్ సన్నివేశాలు నడుస్తున్నప్పడు మద్యలో కామెడీ సీన్ పెడతారు. ఎందుకంటే ప్రేక్షకులకు కొంత రిలీఫ్ ఇవ్వడానికి అని చెబుతారు. ఇప్పుడు రాజకీయాలలో కూడా ఆ తరహా పద్దతిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రవేశ పెట్టినట్లుగా ఉంది. 

రెండు నెలలకో, లేక సినిమా షూటింగ్ లు లేనప్పుడో సడన్ గా ఏపికి పవన్ కళ్యాణ్ వస్తుంటారు. ఆ సందర్భంగా ఆయన చేసే వ్యాఖ్యలు అచ్చం సినిమాలలో కామెడీ సీన్ ను తలపిస్తాయి. వైసిపి ఎమ్మెల్యేలను జనసేన నిలదీస్తుందట. అసలు అసెంబ్లీనే ముట్టడిస్తారట. 

జనసేన అంటే వైసీపీ భయపడుతోందట. మంత్రి కొడాలి నాని ఎవరో ఆయనకు తెలియదట. వీటిని ఆయన పంచ్ డైలాగులుగా భావిస్తున్నారేమో కాని అవి అన్నీ కామెడీ డైలాగులుగా మారుతున్నాయని పవన్ కళ్యాణ్ గుర్తించలేకపోతున్నారు. 

ఆయన రాజకీయ జీవితం అంతా ఇలా డైలాగులు చెప్పడం , ఆ తర్వాత విషయ పరిజ్ఞానం లేకుండా వ్యవహరించడం సాధారణం అయిపోయింది. అందువల్ల పవన్ కళ్యాణ్ ఏపిలో ఎక్కడికైనా వస్తున్నారంటే, సినిమా నటుడిని చూద్దామని వచ్చే పిల్లలే ఎక్కువ తప్ప, ఆయన రాజకీయం గా ఎలా మాట్లాడతారో చూద్దామని వచ్చేవారు తక్కువే అని చెప్పాలి.

తాజాగా ఆయన గుడివాడలో పర్యటించిన సందర్భంలో చేసిన ప్రకటనలన్నీ కామెడీ సీన్ లుగా మారాయంటే అతిశయోక్తి కాదు. భారతీయ జనతా పార్టీతో మిత్రత్వం నడుపుతున్నా, ఆయన మనసు అంతా టిడిపి అదినేత చంద్రబాబు పైన, టిడిపి వైపే ఉన్నట్లు కనిపిస్తుంటుంది. 

వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు 35వేల రూపాయలు ఇవ్వాలని కొత్తగా ఒక డిమాండ్ చేస్తున్నారు. ఇదే మాట చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదని ఎవరైనా అడిగితే ఏమని సమాదానం ఇస్తారు?

ఒకసారి పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లాలో తిత్లి తుపాను బాధితులను పరామర్శించడానికి వెళ్లారు. అక్కడ ఒక గ్రామంలో బాదితులు ఏమి చెప్పారంటే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఊరందరికి కలిపి 500 రూపాయలు మాత్రమే కూరగాయలు వంటి సరుకుల కొనుగోలుకు ఇచ్చిందని ఆయనకే స్వయంగా చెప్పారు. మరి దాని గురించి ఎన్నడైనా పవన్ కళ్యాణ్ ప్రశ్నించారా? 

అంతేకాదు. ఒక రాష్ట్ర ప్రభుత్వం అలా 35 వేల రూపాయల చొప్పున ఇవ్వగలుగుతుందా? అన్న కనీస ఆలోచన లేకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. దీని గురించి ప్రదాని నరేంద్ర మోడీని కూడా అడగవచ్చు కదా..అలా అడగడానికి పవన్ భయపడుతున్నారా?

నివార్ తుపాను బాదితులకు డిసెంబర్ 31 కల్లా నష్ట పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ నవంబర్ లోనే ప్రకటించారు. అయినా పవన్ కళ్యాణ్ అంతవరకు ఆగకుండా డిసెంబర్ 28న గుడివాడ పర్యటన పెట్టుకొని ఏవో విమర్శలు చేశారు. ప్రభుత్వం తన పద్దతితో జిఓ ఇచ్చి పరిహారం పంపిణీ చేస్తే, అదంతా తన క్రెడిట్ అని చెప్పుకోవడానికి తంటాలు పడుతున్నారు. అక్కడే అర్దం అవుతోంది. రాజకీయాలలో ఆయనకు పరిపక్వత రాలేదని.  

పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ప్రజారాజ్యం యువజన నేతగా ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ల పంచెలూడగొడతానని అన్నారు. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం అయిపోయింది. ఆయన సోదరుడు చిరంజీవి కేంద్ర మంత్రి కూడా అయ్యారు. మరి ఎవరి పంచెలు పవన్ కళ్యాణ్ ఊడగొట్టారో తెలియదు. 

ఆ తర్వాత 2014 నాటికి జనసేన అవతారం ఎత్తారు. అప్పుడు ఆయన పార్టీ పోటీపెట్టకుండా టిడిపి ,బిజెపిల గెలుపుకోసం పనిచేయడం చిత్రమైన విషయం. తదుపరి చంద్రబాబుకు చాలాకాలం మద్దతు ఇచ్చారు. కాని ఆ తర్వాత ఏమైందో కాని సడన్ గా చంద్రబాబు,లోకేష్ ల అవినీతి అంటూ భారీ డైలాగులు చెప్పారు.

బిజెపి ప్రత్యేక హోదా ఇవ్వలేదని,పాచిపోయిన లడ్లు ఇచ్చిందని ఆ పార్టీని విమర్శించేవారు. చావనైనా చస్తాం కాని, బిజెపితో విలీనం అవుతామా అని హూంకరించారు. తదుపరి విప్లవ వీరుడు చెగువేరా తమకు ఆదర్శం అంటూ వామపక్షాలతో కలిసి 2019లో పోటీచేసి ఘోరంగా ఓటమిచెందారు. 

స్వయంగా పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరంలలో పోటీచేసి పరాజయం చెందారు. మళ్లీ ఆ నియోజకవర్గాల వైపు చూసినట్లు లేదు. ఈ ఓటమి తర్వాత   మళ్లీ బిజెపి వారి చుట్టూ తిరిగి ఆ పార్టీతో మితృత్వం కుదుర్చుకున్నారు. 

2019 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు తో రహస్య పొత్తు పెట్టుకన్నారన్నది బహిరంగంగానే అంతా చెప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలోనే కాదు..రాజకీయ జీవితంలో కూడా ఆయనకు ఒక స్థిరత్వం లేదని,చపల చిత్తుడని పలువురు వ్యాఖ్యానిస్తుంటారు.

ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు ఏపి వెళ్లి ముఖ్యమంత్రి జగన్ ను, వైసిపి ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేస్తున్న విమర్శలు కామెడీగా మారుతున్నాయి. మంత్రి పేర్ని నాని అయితే  చిడతల నాయుడు అంటూ పవన్ ను ఎద్దేవ చేశారు. 

రాజకీయాలలో కొంత అయినా సీరియస్ నెస్ ఉండాలి. అలాంటివేమీ లేకుండా కూడా టైమ్ పాస్ రాజకీయాలు చేయవచ్చని పవన్ కళ్యాణ్ రుజువు చేస్తున్నారు.అదే ఆయన పరువు తీస్తోంది. 

ఈ నేపధ్యంలో సోషల్ మీడియాలో ఆయన అబిమాని ఒకరు పెట్టిన పోస్టింగ్ ఆసక్తికరంగా ఉంది. శ్రీ #పవన్ కల్యాణ్ గారు.. మీ గురించి మొదట్లో చాలా గొప్పగా ఊహించుకున్నాను, కానీ రోజు రోజు కీ మీరు మీ స్థాయి ని దిగజార్చుకుంటున్నారు, హుందాతనం లేదు, మాటల్లో పరిపక్వత ఇప్పటికి కనిపించడలేదు, కేవలం నేనే తోపు అనే పిల్లచేష్టలు తప్ప ఇంకేం లేదు

మీకోసం నిజంగా ప్రజా సేవ చేస్తున్న ఎంతోమంది స్వచ్చమైన కార్యకర్తలకి  కూడా విలువ లేకుండా పోతోంది, కానీ వాళ్ళు కూడా బాదపడుతున్నారే కానీ ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు.. కొంచం విచక్షణ తో ఆలోచించు స్వామీ, బాగోలేదు అసలు నువ్వు ఈ రోజు ఎమి మాట్లాడుతావో , మరీ రేపు అదే విషయం మీద ఇంకేం మాట్లాడుతావో అన్న క్లారిటీ లేదు.. చాలా కామిడీ అయిపోయింది, బ్రో నెక్ష్ట్ మా పవన్ కల్యాణ్ అన్నే సి.ఎమ్. అని మీ వాళ్ళు తెగ ముచ్చట్లు పడుతున్నారు, ఏంటి బ్రో ఇది మరీ కామేడీ లకి హద్దు పద్దు లేకుండా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. 

ఈ పరిస్థితి తెచ్చుకున్న రాజకీయ కామెడీ స్టార్ గా పవన్ కళ్యాణ్ మారిపోవడం జనసేన అభిమానులకు గుండె తరుక్కు పోయే విషయమే అవుతుంది.

Kommineni

చంద్రబాబుకు, దేవుడు అన్నా, ప్రజాస్వామ్యం అన్నా నమ్మకం లేదు

ముంబై నైట్ లైఫ్ అంటే చాలా ఇష్టం