ఇండియాలో కోవిడ్-19 విరుగుడు వ్యాక్సినేషన్ ఈ నెలలోనే మొదలు కానుంది. రాష్ట్రాల వారీగా కోటాను కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. అందుకు ఉదాహరణలను పరిశీలిస్తే.. జనవరి నెలలో ఏపీ వాటాగా సుమారు లక్షా డెబ్బై వేల వయెల్స్ రానున్నాయట.
ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ ఆల్రెడీ రాష్ట్రాల వారీగా కేంద్ర ప్రభుత్వం కోటాను డిసైడ్ చేసినట్టుగా ఉంది. ఆ లెక్క ప్రకారం చూస్తే.. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి అధికారికంగా సుమారు కోటి వయెల్స్ కరోనా వ్యాక్సిన్ ఏపీకి అందుబాటులోకి రానుంది. అయితే రాష్ట్ర జనాభాతో పోలిస్తే ఈ డోసేజ్ చాలా తక్కువ అని వేరే చెప్పనక్కర్లేదు.
అయితే రాబోయే రోజుల్లో పరిస్థితుల్లో మరింత మార్పు రావొచ్చు. వ్యాక్సినేషన్ కు సంబంధించి ఇంకా కొత్త కంపెనీలు ఏవైనా ప్రగతి సాధించవచ్చు. కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలక అడుగులు పడవచ్చు. గత తొమ్మిది నెలల వ్యవధిలో వ్యాక్సిన్ రెడీ అయ్యింది. కాబట్టి.. మరో తొమ్మిది నెలల వ్యవధిని పరిగణనలోకి తీసుకుంటే.. వ్యాక్సిన్ కు సంబంధించి మరింత సానుకూల పరిస్థితులు కచ్చితంగా ఏర్పడే అవకాశం ఉంది.
మరోవైపు కొత్త స్ట్రెయిన్ ఆందోళన ఒక్కటీ మిగిలింది. ఇండియాలో ఇప్పుడు జనజీవనం దాదాపు కరోనా పూర్వపు స్థితికి వచ్చింది. ఈ విషయంలో మరో సందేహం లేదు. ఆర్టీసీ బస్సులు రెట్టింపు సామర్థ్యంతో తిరుగుతున్నాయంటే.. కరోనాను జనాలు ఎంత లైట్ తీసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు.
పెళ్లిళ్ల సీజన్ కూడా ముగుస్తోంది. కరోనా లాక్ డౌన్ సమయంలో వాయిదా పడ్డ పెళ్లిళ్లతో సహా.. అనేక రకాల శుభకార్యాలు గత రెండు మూడు నెలల్లో జరిగాయి. ఈ ఏడాది మాఘమాసం పెళ్లిళ్లకు ముహూర్తాలు లేవన్న పండితుల సూచనల నేపథ్యంలో.. ఇటీవలి కాలంలో పెళ్లిళ్లు భారీ సంఖ్యలో జరిగాయి.
సంక్రాంతితో అటు పెళ్లిళ్ల సీజన్, ఇటు పండగల సీజన్ కూడా ముగియనుంది. ఇక పెళ్లి వేడుకల్లో మాస్కుల ఊసే లేదు. కరోనా జాగ్రత్త చర్యలు తీసుకోవడం అటుంచి, అసలు కరోనా అనే విషయాన్నే జనాలు మరిచిపోయిన వైనం స్పష్టం అవుతోంది క్షేత్ర స్థాయిలో.
ఇలాంటి నేపథ్యంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. దానిపై ప్రజల ఆసక్తి ఎంత వరకూ ఉంటుంది? అనేది ప్రశ్నార్థకం. చదువుకున్న వాళ్ల మధ్యనే వ్యాక్సిన్ గురించి చర్చ జరుగుతూ ఉందంతే. పనులు చేసుకునే ప్రజలు వ్యాక్సిన్ వచ్చిందంట అంటున్నారు కానీ.. అది తమకు కావాలనే ఆసక్తి వారిలో కనిపించడం లేదు.
వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చినా.. సైడ్ ఎఫెక్ట్స్ భయాలు, సహజంగానే సూది మందుపై ఇండియాలో ఉండే భయాలు, అనాసక్తి.. వీటన్నింటి నేపథ్యంలో.. ఎంత మంది దాన్ని వేయించుకుంటారనేది ప్రశ్నార్థకమే. పరిశోధకులు కూడా వ్యాక్సిన్ ను అప్పటికప్పుడు తయారు చేసినట్టుగా ఉంది.
ఈ వ్యాక్సిన్ వేస్తే ఎవరిలో అయినా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే.. వారిని ట్రీట్ చేయడానికి ఏపీలో కూడా కొన్ని ఆసుపత్రులను నిర్వహించనున్నారట. ఇలాంటి వార్తలు వ్యాక్సిన్ పై ప్రజల్లో అభద్రతా భావాన్ని పెంచుతాయి. అయితే.. బ్రిటన్ స్ట్రెయిన్ వంటి వార్తలు మాత్రం వ్యాక్సిన్ అవసరాన్ని నొక్కి చెబుతాయి.
బ్రిటన్ స్ట్రెయిన్ మాత్రమే కాదు.. కరోనా వైరస్ తన మనుగడ కోసం తన రూపాన్ని మరింతగా మార్చుకోవచ్చు.. అని పరిశోధకులు ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. వ్యాక్సిన్ అవసరం లేదు కానీ, కొత్త స్ట్రెయిన్ లు విజృంభించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి.. వ్యాక్సిన్ అవసరమని వారు స్పష్టం చేస్తున్నారు.