కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం ( KRMB ) ని విశాఖలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. సహజ న్యాయసూత్రాలను అనుసరించినా , ప్రభుత్వం నిర్ణయించిన న్యాయరాజధాని రీత్యా చూసినా కార్యాలయాన్ని రాయలసీమలొనే ఏర్పాటు చేయాలి. వెంటనే ప్రభుత్వం విశాఖలో కార్యాలయ ఏర్పాటును ఉపసంహరించుకొని న్యాయ రాజధాని సీమలోనే ఏర్పాటు చేయాలని రాయలసీమ మేధావుల ఫోరం డిమాండ్ చేస్తుంది.
మూడు రాజధానుల నేపథ్యం..
గత ప్రభుత్వం అమరావతిని రాజధానిని ఎంపిక చేసి రాయలసీమకు అన్యాయం చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు ప్రాంతాల్లో రాజధానిలోని మూడు కీలక విభాగాలను మధ్య కోస్తా , రాయలసీమ , ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినది.
అందులో భాగంగా రాయలసీమలోని కర్నూలును న్యాయరాజధానిగా ప్రకటించినది. నిజానికి మూడు రాజధానులు ప్రక్రియలో రాయలసీమకు తగిన న్యాయం జరగలేదు.
కనీసం హైకోర్టు అయిన ఇచ్చారు నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారు అన్న ఆశతో ప్రభుత్వ నిర్ణయాన్ని రాయలసీమ ప్రజలు బలపరచారు. న్యాయ రాజధానిలో హైకోర్టుతో సహా న్యాయ స్వభావం కలిగి ఉన్న కార్యాలయాలు రాయలసీమకు ఇస్తామని పాలన వికేంద్రీకరణ చట్టం ద్వారా ప్రభుత్వం హామీ ఇచ్చింది.
KRMB కార్యాలయం రాయలసీమలో ఏర్పాటు చేయడం సహజ న్యాయం…
విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ లో ఉన్న కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఆంద్రప్రదేశ్ కు తరలించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ నిర్ణయిస్తే అక్కడ కార్యాలయం వస్తుంది. అంటే ఒక్క లేఖతో కీలక విభాగం రాయలసీమకు వస్తుంది.
పోలవరం పూర్తి అయిన తర్వాత మధ్య కొస్తాకు కృష్ణతో అనుబంధం ఉండదు. కృష్ణానది నీటిని ఏపీ వాటా పూర్తిగా రాయలసీమ , ప్రకాశం జిల్లాలకు ఉపయోగించాలి.
కృష్ణ దాని ఉపనది తుంగభద్ర లకు ఏపీలో ముఖద్వారం రాయలసీమనే కృష్ణ నీటితో రాయలసీమకు సంబంధం లేదు అని అడ్డగోలు వాదనలు చేస్తున్న తరుణంలో కృష్ణా యాజమాన్య కార్యాలయం రాయలసీమలో ఏర్పాటు చేస్తే మరింత నైతిక బలం చేకూరుస్తుంది.
న్యాయ స్వభావం కలిగి ఉన్న కార్యాలయాలు న్యాయ రాజధానిలో ఏర్పాటు చేస్తాము అన్న తర్వాత అలాంటి స్వభావం కలిగి ఉన్న యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని రాయలసీమలో ఏర్పాటు చేయడం కనీస ధర్మం.
KRMB ని ఇవ్వకపోతే న్యాయ రాజధానిపై అనుమానాలకు ఆస్కారం కల్పించిన వారు అవుతారు.
రాయలసీమలో కనీసం న్యాయ రాజధాని అయినా వస్తుంది అన్న ఆశను ప్రభుత్వం కల్పించింది. అమరావతిని సమర్దిస్తున్న వారు అమరావతి నుంచి రాజధానిని విశాఖకు తరలించేందుకు రాయలసీమ వాసులను బుజ్జగింపు చేయడానికి సీమకు హైకోర్టు అని అదికూడా రాదు అంటూ హేళన చేసినా సీమ ప్రజలు ప్రభుత్వంపై విశ్వాసాన్ని ఉంచారు.
నేడు ప్రభుత్వం తన చేతిలో ఉండి , నిధుల ఖర్చు కూడా లేని KRMB ని రాయలసీమకు ఇవ్వనప్పుడు కేంద్ర ప్రభుత్వం , సుప్రీం కోర్టు పరిధిలోని హైకోర్టు రాయలసీమకు రావడం సాధ్యమేనా ? అన్న అనుమానం కలగక మానదు. ఇలాంటి పరిస్థితులు రాయలసీమకు నష్టం తెస్తుంది.
అందుకే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. కృష్ణా నదితో కాని న్యాయ రాజాధాని కూడా కాని సంబంధం లేని విశాఖలో కాకుండా కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని న్యాయరాజధాని అయిన రాయలసీమలొనే ఏర్పాటు చేయాలని సీమ ప్రజల తరపున రాయలసీమ మేధావుల ఫోరం డిమాండు చేస్తుంది.
ప్రభుత్వం తన వైఖరిని మార్చు కోకపోతే ప్రభుత్వం సీమలో ఏర్పాటు చేస్తాము అంటున్న న్యాయ రాజధాని హామీని కూడా అనుమానించాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంది. ఇలాంటి వాతావరణం రాయలసీమకే కాదు జగన్ మోహన్ రెడ్డి గారిపై గంపెడు ఆశలతో ఉన్న సీమ ప్రజల అపనమ్మకం రాజకీయంగా ప్రభుత్వానికి కూడా మంచిది కాదు.
మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి
సమన్వయ కర్త
రాయలసీమ మేధావుల ఫోరం
9490493436