తిరుపతి ఉప ఎన్నికలకు మాంచి మసాలా..!

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ప్రతిపక్షాల ఓవర్ యాక్షన్.. అంతా తిరుపతి ఉప ఎన్నికలకు మాంచి మసాలాగా ఉపయోగపడుతుంది. అయితే ప్రతిపక్షాలు నూరుతున్న ఈ మసాలా ఘాటు ఉప ఎన్నికలనాటికి ఆవిరైపోతుందా లేక అలాగే నిలిచి…

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ప్రతిపక్షాల ఓవర్ యాక్షన్.. అంతా తిరుపతి ఉప ఎన్నికలకు మాంచి మసాలాగా ఉపయోగపడుతుంది. అయితే ప్రతిపక్షాలు నూరుతున్న ఈ మసాలా ఘాటు ఉప ఎన్నికలనాటికి ఆవిరైపోతుందా లేక అలాగే నిలిచి ఉంటుందా అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. 

తిరుపతి టెంపుల్ సిటీ కావొచ్చు కానీ, తిరుపతి లోక్ సభ నియోజకవర్గంలో కేవలం హిందూ ఓట్లని మాత్రమే నమ్ముకుంటామంటే మాత్రం కష్టం. కానీ జనసేన, బీజేపీ ఎందుకో ఆ దుస్సాహసం చేస్తున్నాయి. తిరుపతి ఉపఎన్నికల నగారా మోగే లోపే.. మతాన్ని పూర్తి స్థాయిలో తెరపైకి తెచ్చాయి.

దేశమంతా మత రాజకీయాలు చేసినా.. ఏపీలో మాత్రం బీజేపీ ఆ సాహసాన్ని ఇప్పటివరకూ చేయలేదు. కానీ ఈ దఫా మాత్రం పక్కాగా మతాన్ని అడ్డు పెట్టుకుని ఓట్లు అడిగేందుకు ఆ పార్టీ సిద్ధమవుతోంది. జనసేనని కూడా పూర్తిగా తన ట్రాక్ లోకి తెచ్చేసుకుని, పవన్ కల్యాణ్ మేకప్ లో కాషాయం రంగు కలిపేసింది. 

ఇంకేముంది.. రెండు పార్టీల నేతలు, హిందూ ఆలయాలు, హిందూ ఆలయాల ఆస్తులు అంటూ రెచ్చిపోవడం మొదలు పెట్టారు. రాష్ట్రంలో విగ్రహాలు ధ్వంసమవుతున్న ఘటనలు.. వీరికి అనుకోని వరంలా మారాయి. దీంతో చెదురుమదురు సంఘటనలన్నిటినీ ఒకేచోట చేర్చి, హిందూ మతంపై దాడి అంటూ ప్రభుత్వంపై రాళ్లేయడం మొదలు పెట్టారు. 

సీఎం జగన్ మతాన్ని తెరపైకి తెచ్చి ఆయనను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజకీయ శకుని చంద్రబాబు ఆలోచనలు కూడా తోడవడంతో విగ్రహాల ధ్వంసం అనే సంఘటన కరోనా కంటే పెద్ద రాష్ట్ర విపత్తుగా మారింది. 

ఈ వ్యవహారమే రేపు తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాల ప్రధాన ప్రచారాస్త్రంగా మారబోతోంది. హిందూ మతాన్ని రక్షించేవారు కావాలో, విగ్రహాలను పగలగొడుతున్నా పట్టించుకోని వారు కావాలో తేల్చుకోండి అంటూ ప్రతిపక్షాలు ఇప్పటికే ప్రజల బుర్రల్ని తినేస్తున్నాయి. 

చంద్రబాబు కూడా పూర్తిగా మతాన్ని భుజానికెత్తుకున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేలెత్తి చూపే ధైర్యం లేకపోవడం, వాటిపై విమర్శలు చేసినా కూడా అది ప్రభుత్వానికి తాను చేసిన ప్రచారమే అవుతుందని చంద్రబాబు భావించడం.. వెరసి ఆయన కూడా మత రాజకీయాలవైపు మళ్లేలా చేశాయి.

రాష్ట్రంలో ఇప్పుడున్న పొలిటికల్ హీట్ చూస్తుంటే.. ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు జరిగితే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఓ రేంజ్ లో విరుచుకుపడే అవకాశం కనిపిస్తోంది. గెలుపు ఓటముల విషయం పక్కనపెడితే.. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రతిపక్షం దగ్గర ఓ పాయింట్ ఉందనే విషయాన్ని మాత్రం కాదనలేం.

అయితే ఈ పొలిటికల్ మసాలా అంతా తిరుపతి ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే వరకు అలాగే ఉంటుందా లేదా అనేది అనుమానమే. ఎల్లో మీడియా మాత్రం ఈ వివాదాల్ని వీలైనంత కాలం అలా సాగదీయాలని ప్రయత్నిస్తూనే ఉంది. 

చంద్రబాబుకు, దేవుడు అన్నా, ప్రజాస్వామ్యం అన్నా నమ్మకం లేదు

ముంబై నైట్ లైఫ్ అంటే చాలా ఇష్టం