ఏకంగా వంద కోట్ల మంది ఇళ్లకు పరిమితం అయ్యారు! చరిత్రలో ఎన్నడూ జరగని విషయం అది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన సుదీర్ఘ లాక్ డౌన్ సమయంలో ఇండియన్ ఇళ్లలో ఏం జరిగిందనే అంశం గురించి ఇప్పుడిప్పుడు కథనాలు వస్తున్నాయి. ప్రపంచంలో భారీ జనాభా ఉన్న రెండో దేశం మనది. ఇలాంటి దేశంలో పేద,ధనిక తేడా లేకుండా.. సామాన్యుడు, అసామాన్యుడు అనే బేధం లేకుండా అంతా ఇళ్లకు పరిమితం అయ్యారు. వంద కోట్ల మంది దాదాపు వంద రోజుల పాటు బయటకు పెద్దగా కదల్లేని పరిస్థితి. ఇలాంటి క్రమంలో రకరకాల విషయాలు ఇళ్లలో చోటు చేసుకోవడం సహజమే.
మరి ఇంతకీ ఇండియన్స్ ఇళ్లలో ఎక్కువగా ఏం చేశారంటే.. వంట! అనే సమాధానం వినిపిస్తూ ఉంది. ఇండియాలో వంట అనేది దాదాపు ఆడవాళ్ల పనే. ఐటీ కంపెనీలో పని చేసే అమ్మాయి అయినా భర్తకూ, పిల్లలకు వంట చేసే ఇళ్ల నుంచి కదలాల్సిందే. ఇంకా పిల్లలు లేని జంటల్లో కూడా వంట అనేది స్త్రీ పనే. అయితే లాక్ డౌన్ వేళ మాత్రం అనూహ్యమైన మార్పు కనిపించిందని పరిశీలకులు అంటున్నారు. అనేక మంది మగాళ్లూ గరిట పట్టారని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇళ్లలో వంటలు చేసిన వారు అనేక మందని పరిశీలనల్లో తెలుస్తోంది.
కేవలం వంట చేయడమే కాదు.. తాము చేసిన విషయాన్ని బాగా బయటకు చెప్పుకోవడంతోనే అసలు కథ బయటకు వస్తూ ఉంది. తాము వంట చేసిన వైనం గురించి అనేక మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇది లాక్ డౌన్ నేర్పిన అలవాటుగా మారింది! ప్రత్యేకించి ఇన్ స్టాగ్రమ్ లో ఈ హడావుడి ఎక్కువని పరిశీలకులు అంటున్నారు. అనేక మంది వివిధ రకాల వంటకాలు చేసి.. వాటి ఫొటోలను, వీడియోలను ఇన్ స్టాగ్రమ్ కు ఎక్కించిన వైనాన్ని పరిశీలకులు ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇలా లాక్ డౌన్ సమయంలో ఇళ్లకు పరిమితం అయిన వారు తమ కుకింగ్ స్కిల్స్ ను ప్రపంచానికి, వాటి రుచిని ఇంట్లోని వారికి చూపించారు.
అలాగే ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపులు, వాట్సాప్ స్టేటస్ లు కూడా వంటకాలకు సంబంధించిన ఫొటోలో మార్మోగాయని తెలుస్తోంది. తమలోని కుక్ ను అందరికీ పరిచయం చేస్తూ భారతీయులు లాక్ డౌన్ సమయంలో కుకింగ్ ను ఒక ఎంటర్ టైన్ మెంట్ గా మార్చుకున్నారని తెలుస్తోంది. ఈ విషయంలో సెలబ్రిటీలు కూడా వార్తల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. సెలబ్రిటీలతో సంబంధం లేకుండా, సామాన్యులకు కూడా వంటలు వినోదంగా మారాయని పరిశీలకులు చెబుతున్నారు.
లాక్ డౌన్ సమయంలో కూరగాయలు, చికెన్ -మటన్ ల కోసం కూడా నిర్ధిష్టమైన సమయంలోనే వెళ్లాల్సి వచ్చేది. ఈ క్రమంలో ఏ రోజుకారోజు ఒక మెనూని అనుకుని, ఆ మెనూ ప్రకారం.. కావాల్సినవి తెచ్చుకోవడం, తెచ్చిన వాటితో శుభ్రంగా వంట చేసి తమ పాకశాస్త్రప్రావీణ్యాన్ని చాటుకోవడం వయసుతో సంబంధం లేకుండా కోట్ల మంది భారతీయులకు దినచర్యగా సాగిందని లాక్ డౌన్ పరిస్థితుల గురించి విశ్లేషిస్తున్న వారు వివరిస్తున్నారు. కేవలం క్యాజువల్ గా కాకుండా.. చాలా సీరియస్ గా నే ఈ వంటల ఉద్యమం, చేసిన వంటలను సోషల్ మీడియాకు ఎక్కించే పని జరిగిందని స్పష్టం అవుతోంది.
ఏతావాతా లాక్ డౌన్ సమయంలో మధ్యతరగతి, ఆ పై స్థాయి భారతీయులు వెరైటీ వెరైటీ వంటకాలను చేసుకోవడం, తినడం పనిగా పెట్టుకున్న వైనం గోచరిస్తూ ఉంది. రకరకాల ఫుడ్ సప్లై యాప్స్ ను యూజ్ చేయడం మొదలుపెట్టిన వాళ్లు, తిండిని ఒక ఉద్యమంగా మార్చుకోవడం.. ఇవన్నీ కూడా లాక్ డౌన్ సమయంలో అలవాటుగా మారిన విషయాలని వారి వారి అనుభవాలను బట్టి అర్థం అవుతూ ఉంది. వీలైనన్ని ఎక్కువ సార్లు భోజనం చేశామని అనేక మంది చెబుతున్నారు. వంటల్లో కొత్త రుచులను కనుగొన్నట్టుగా, ఆన్ లైన్ లో కొత్త కొత్త ఫుడ్ సప్లై యాప్స్ ను కనుగొని ఉపయోగించుకున్నట్టుగా.. ఇక నుంచి తమ తమ ఫుడ్ హ్యాబిట్స్ మొత్తం మారిపోయేలా ఉన్నాయని అనేక మంది చెప్పారు.