బహుశా అది 2013లో జరిగిన బాలీవుడ్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల ఫంక్షన్..వేదిక మీద బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్, మరో స్టార్ హీరో- పటౌడీ వంశ వారసుడు సైఫ్ అలీఖాన్ లున్నారు. ఏదో అవార్డు కేటగిరీ నామినేషన్స్ గురించి ప్రకటన చేస్తూ.. నటుడు నీల్ నితిన్ ముఖేష్ పేరును వాళ్లు ప్రస్తావించారు. ఆ థియేటర్లో ఆ నటుడు కూడా తన కుటుంబ సమేతంగా కూర్చుని ఉన్నాడు.
ఒక అవార్డు విషయంలో తనూ పోటీదారుడు. ఆ విషయాన్ని షారూక్ అనౌన్స్ చేస్తూ.. 'నీల్ నితిన్ ముఖేష్..' అంటూ సంబోధించాడు. ఆ ప్రకటన విని.. వినమ్రంగా నిలబడ్డాడు అతడు. 'నిన్నో ప్రశ్న అడగాలి..' అంటూ షారూక్ హిందీలో సంభాషణ కొనసాగించాడు. ' నీ పేరు నీల్ నితీష్ ముఖేష్..భయ్యా.. సర్ నేమ్ కహాపే? ఈ పేరంతా ఫస్ట్ నేమ్ లానే ఉంది..(అంతా నవ్వుతున్నారు) వైడోంట్ యు హ్యావ్ ఏ సర్ నేమ్? ఆల్ ఆఫ్ అజ్ హ్యాజ్.. ఖాన్(తనను చూపించుకుంటూ) ఖాన్(సైఫ్ ను చూపిస్తూ) రోషన్…వేర్ ఈజ్ యువర్ సర్ నేమ్?' అంటూ నిలదీస్తున్నట్టుగా నీల్ నితిన్ ఉద్దేశించి షారూక్ వరస ప్రశ్నలు వేశాడు. ఈ ప్రశ్నలు వింటూ.. అక్కడి బాలీవుడ్ సెలబ్రిటీలు పడి పడి నవ్వుతున్నారు! వేదిక మీద ఉన్నది బాలీవుడ్ స్టార్ హీరో కదా, అతడు ఏం చెప్పినా నవ్వేస్తే ఓ పనైపోతుందన్నట్టుగా అక్కడి వాళ్లంతా అక్కడేదో కామెడీ జరుగుతున్నట్టుగా నవ్వుతున్నారు.
అయితే 'నీ ఇంటి పేరు ఏంటి?' అంటూ అలాంటి వేదిక మీద ప్రశ్నిస్తే.. అది ఆ వ్యక్తి ఐడెంటిటీని ప్రశ్నించడమే, అందులోనూ షారూక్ తనేదో పెద్ద వంశం నుంచి వచ్చినట్టుగా తనకూ ఇంటి పేరు ఉందని, తన పక్కనే ఉన్న సైఫ్ కూ ఒక పెద్ద ఇంటి పేరుందని, రాకేష్ రోషన్ ను చూపిస్తూ అతడి ఇంటి పేరును ప్రస్తావించి.. తామందరికీ తోక ఉందని, నీకేది? అన్నట్టుగా నీల్ నితిన్ ను ప్రశ్నించాడు!
ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా.. బాలీవుడ్ కు వచ్చి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు నీల్ నితిన్. ఇండస్ట్రీలో సక్సెస్ కావాలంటే ఇంటిపేరు ముఖ్యమనే విషయం ఎవరికీ తెలియనిది ఏమీ కాదు. అలాంటి ఇంటి పేర్లు లేకుండా సక్సెస్ అయ్యి వచ్చిన ఒక నటుడిని పట్టుకుని అలా గుచ్చిగుచ్చి ప్రశ్నించడం అమానవీయం. అందులో ఎలాంటి సందేహం లేదు. అలాంటి తన నీఛమైన వ్యక్తిత్వాన్ని షారూక్ అక్కడ ప్రదర్శించాడు.
వేరే వాళ్లు అయితే సర్దుకుని పోయేవాళ్లేమో, తమను మాటలతో హింసిస్తున్నది ఒక బాలీవుడ్ స్టార్ హీరో కాబట్టి..తనకు ఇంటి పేరు లేదని గేలి చేస్తున్నది ఇండస్ట్రీపై గ్రిప్ ఉన్న హీరో కాబట్టి కామ్ గా ఉండటమో లేక తమ పై వేస్తున్న ఆ థర్డ్ గ్రేడ్ జోక్ కు తాము కూడా నవ్వేసి, అలాంటి పర్వర్టెడ్ జోక్ ఆహ్వానించడమో చేసే వాళ్లు. అయితే నీల్ నితిన్ మాత్రం షారూక్ కు అతడితో వంత పాడిన సైఫ్ కు గట్టి సమాధానం ఇచ్చాడు. ఇంతకీ ఆ సమాధానం ఏమిటంటే..'జస్ట్ షటప్..' అని!
'నేను ఇండస్ట్రీలో స్వశక్తితో ఎదిగా, ఇలాంటి థియేటర్లో ముందు పది వరసల్లో కూర్చున్నా, ఇక్కడే నా తండ్రి కూడా ఉన్నాడు. ఇలాంటప్పుడు నా ఇంటి పేరును అడగాల్సిన అవసరం లేదు. అలా అడిగితే నా సమాధానం ఒక్కటే.. జస్ట్ షటప్..' అంటూ సంయమనం కోల్పోకుండానే గట్టి సమాధానం ఇచ్చాడు నీల్ నితిన్. షారూక్ స్టామినానో, సైఫ్ బ్యాక్ గ్రౌండ్ కో భయపడకుండా.. తప్పుడు ప్రశ్నలు అడగకుండా నోరు మూసుకొమ్మని ఆ నటుడు ఇచ్చిన సమాధానం 'వారెవ్వా..' అనిపిస్తుంది!
నిజానికి షారూక్ ఎలాంటి వారసత్వంతో సినిమాల్లోకి రాలేదు. తను కూడా కష్టపడే వచ్చాడు. స్వశక్తితో ఎదిగాడు. సైఫ్ అంటే రాజరికం, క్రికెట్, సిని వారసత్వాలతో వచ్చాడు. అతంత మాత్రంగా ఎదిగాడు. అతడు అలాంటి వదరబోతు తనంతో ఒక వర్ధమాన నటుడి ని బుల్లీయింగ్ చేసి ఉంటే అదో లెక్క. షారూక్ అలా మాట్లాడటం మాత్రం నిజంగా క్షమించరాని నేరం. దశాబ్దాల తన ఎదుగుదలతో ఎదురుగా ఉన్నది తన బోటి వాడని షారూక్ మరిచిపోయినట్టుగా ఉన్నాడు. తోలు మందం కావడంతో.. ఒక యువకుడిని పట్టుకుని ఇష్టానుసారం మాట్లాడాడు. 'నీకెందుకు ఇంటి పేరు లేదు? మాకు లాగా నీ పేరెందుకు లేదు?' అంటూ ఎంతో అహంభావపూర్వకమైన ప్రశ్నను వేశాడు. తన పేరు వెనుక ఉన్న ఖాన్ అనేది ఏదో వీసా, పాస్ పోర్ట్ అన్నట్టుగా షారూక్ ఆ ప్రశ్న అడిగాడు. దానికి చాచి కొట్టినట్టుగా నీల్ నితిన్ సమాధానం ఇచ్చాడు. ఆ సమాధానం విని ఏడవలేక నవ్వారు షారూక్ ఖాన్, సైఫ్ అలీఖాన్ లు. తాము అహంభావంతో రాంగ్ బటన్ ను టచ్ చేశామని వాళ్లకు లేటుగా అర్థం అయ్యింది. అందరూ మాటలు పడరు, కొందరు గట్టి షాక్ ఇస్తారని.. ఆ బాలీవుడ్ స్టార్లకు అప్పుడు అర్థం అయ్యింది. దీంతో ఏడ్వలేక నవ్వినట్టుగా యాక్ట్ చేసి ఆ వ్యవహారాన్ని ముగించారు. ఆ తర్వాత నీల్ నితిన్ ఎదురుపడినప్పుడు ఆ ఇద్దరూ మొహాలు ఎలా పెట్టుకుని ఉంటారో ఊహించుకోవడం పెద్ద కష్టం ఏమీ కాదు!
ఈ మొత్తం ఎపిసోడ్ కు సంబంధించి ఇప్పటికీ యూట్యూబ్ లో వీడియో ఉంది. ఆసక్తి ఉన్న వాళ్లు సెర్చ్ చూసి చూడవచ్చు. ఫిల్మ్ ఫేర్ అవార్డుల ఫంక్షన్లో జరిగిన ఈ సంభాషణ చాలు.. బాలీవుడ్ లో పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవడానికి. బోలెడన్ని కెమెరాలు రికార్డు చేస్తున్న సమయంలోనే… బ్యాక్ గ్రౌండ్ లేదు, ఇంటి పేరు లేదన్నట్టుగా ఒక యువనటుడిని ఇన్ సల్ట్ చేశారు ఇద్దరు పెద్ద హీరోలు. ఆ వెకిలి మాటలకు అక్కడున్న సెలబ్రిటీలంతా పడిపడి నవ్వారు! ఆ వెకిలి నవ్వులకు చెప్పుతో కొట్టినట్టుగా అతడు సమాధానం ఇచ్చాడు.
ఇండస్ట్రీలో అలాంటివన్నీ సహజమే, అయితే స్పందించే తీరులోనే తేడా ఉంటుంది! తన బ్యాక్ గ్రౌండ్ ఏమిటి, ఇంటి పేరు ఏమిటి అన్న స్టార్ హీరోకు ఘాటైన సమాధానం ఇవ్వగలిగాడు నీల్ నితిన్. అది అతడి ఆత్మగౌరవం. అలా సమాధానం ఇచ్చినందుకు షారూక్ మళ్లీ ఎప్పుడైన తన సినిమాల్లో అతడికి చిన్న క్యారెక్టర్ అయినా ఇస్తాడా? అవమానించిన విషయాన్ని మరిచిపోయి సైఫ్ రేపు తన సినిమాల్లో అతడిని ఉంచుతాడా?
షారూక్ చెబితే వినే బోలెడంత మంది నిర్మాతలు, దర్శకులు, హీరోలుంటారు. ఆ అవమానాన్ని సీరియస్ గా తీసుకుని షారూక్… తన దగ్గరి వారందరి సినిమాల్లోనూ నీల్ నితిన్ ను తొలగింపజేయవచ్చు. ఆ పరిణామాలను ఆ నటుడు ఎలా ఎదుర్కొంటాడు? అనేదే కీలకమైన అంశం. నీల్ నితిన్ పై షారూక్ ఆ తర్వాత కక్ష సాధించాడో లేదో కానీ, ఇండస్ట్రీలో ఇంటి పేర్లతో ఎంత రాజకీయం ముడిపడి ఉంటుందో మాత్రం బాహాటంగా స్పష్టం అవుతూ ఉంది.
కొన్ని ఇంటి పేర్లతో వచ్చే వారికి ఇండస్ట్రీ రెడ్ కార్పెట్ పరిచి వెల్కమ్ చెబుతుంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చే వారు లేకపోలేదు. అయితే కొంతకాలానికే వారు ఏదో ఒక క్యాంపుకు చేరాల్సి ఉండవచ్చు. ఎవరి అడుగులకో మడుగులొత్తాల్సి రావొచ్చు. తమకంటూ ప్రత్యేకంగా వ్యక్తిత్వం లేకుండా అలా భజన బృందంలో కొందరు సెటిలవుతారు. అక్కడక్కడ ఒక్కో నీల్ నితిన్ ఉంటాడు, మరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కూడా ఉంటాడు! ఎదురయ్యే చేదు అనుభవాలను ఒక్కోరు ఒక్కోలా ఎదుర్కొంటారు. కొందరు తలొంచుతారు, మరి కొందరు తల ఎగరేసి తట్టుకుంటారు, తట్టుకోలేని వారు ప్రాణాలూ తీసుకుంటున్నారు. ఈ విషయంలో నిజంగా బాలీవుడ్ స్టార్లే కాదు, అన్ని చిత్రపరిశ్రమల్లోని స్టార్లూ సిగ్గుపడాలి. తామేదో కారణజన్ములం అని భావించే తెలుగు సినిమా నటులూ లేరా? ఇక్కడ ఉన్నది సినీ వారసత్వాలు కాదా? ఈ ఆటలు ఎన్నాళ్లో!
-జీవన్ రెడ్డి.బి