తెలుగుదేశం నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి హై కోర్టులో ఊరట లభించిందట. ఒక మహిళా మున్సిపల్ కమిషనర్ ను పట్టుకుని బూతులు తిట్టిన, నీఛంగా మాట్లాడిన ఆయనపై సదరు అధికారిణి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తన తాత ఫొటోను మున్సిపల్ కమిషనర్ కార్యాలయం నుంచి తీసేశారని అయ్యన్నకు కోపం వచ్చిందట. దీంతో మున్సిపల్ కమిషనర్ పై దుమ్మెత్తి పోశారట.
ఆ క్రమంలో వీలైనంత తొందరగా తన తాత ఫొటోను కమిషనర్ కార్యాలయంలో పెట్టకపోతే 'బట్టలూడదీస్తా..' అంటూ సదరు మహిళా అధికారిణిని ఉద్దేశించి అయ్యన్న విరుచుకుపడినట్టుగా సమాచారం. ఈ విషయంపై ఆమె ఫిర్యాదు చేసింది.
ఈ క్రమంలో అయ్యన్నపై నిర్భయ చట్టాన్ని ప్రయోగించారు, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు పెట్టారు. అయితే ఈ విషయంలో చంద్రబాబు నాయుడే స్వయంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో గవర్నర్ కూ కంప్లైంట్ ఇచ్చారట! అనాల్సిన మాటలన్నీ అనేసి.. ఇప్పుడు వృద్ధనారీ పతివ్రత అన్నట్టుగా ఉంది తెలుగుదేశం వ్యవహారం.
ఆ సంగతలా ఉంటే.. అయ్యన్న అరెస్టుకు పోలీసుల ప్రయత్నాలు కొనసాగాయి. ఆయన అజ్ఞాతంలో ఉండి..ముందస్తు బెయిల్ కు ప్రయత్నాలు చేశారట. ఈ క్రమంలో ఆయనకు హై కోర్టులో ఊరట లభించిందని, ఆయన అరెస్టుపై హై కోర్టు స్టే ఇచ్చిందని సమాచారం!