చంద్రబాబు నాయుడి కుటిల రాజకీయాలు పరాకాష్టకు చేరి చాలా కాలం అయ్యింది. గత కొన్నాళ్లుగా అడ్డగోలు ఆరోపణలతో జగన్ ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకుని..ఎంతలా నవ్వులపాలవ్వాలో తెలుగుదేశం పార్టీ, దాని అధినేత చంద్రబాబు నాయుడు అంతలానూ అవుతున్నారు. జగన్ కు లేఖలు రాయడం, తనే దిశానిర్ధేశం చేస్తున్నట్టుగా కలరింగ్ ఇచ్చుకోవడం చంద్రబాబు నాయుడి చాదస్తపు రాజకీయంలో భాగం అయ్యింది. ఇక మోడీ అంటే భయం, మోడీని ఏ విషయంలోనూ విమర్శించలేరు. జగన్ ను అనుదినం ఏదోలా విమర్శిస్తూ ఉండాలి. ఇదే తంతు.
ఈ క్రమంలో ఇటీవలే చంద్రబాబు నాయుడు తనకు మోడీతో వ్యక్తిగత విబేధాలు లేవని ప్రకటించారు. అయితే మరి ఆ వ్యక్తిగత విమర్శల మాటేంటి? 'మోడీ నీకు కుటుంబం లేదు. నాకు కుటుంబం ఉంది, ఓడిపోతే నువ్వెక్కడికి పోతావ్? నేను మనవడితో ఆడుకుంటా..' అంటూ ఎన్నికల ప్రచార సమయాల్లో మోడీ భార్యప్రస్తావన కూడా తీసుకు వచ్చి చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. మోడీని చంద్రబాబు తిట్టిన తిట్లు ఒక ఎత్తు అయితే, ఆయన భార్య విషయంలో కూడా చంద్రబాబు నాయుడు తోచినట్టుగా మాట్లాడారు. ఇప్పుడేమో వ్యక్తిగత విమర్శలు చేయలేదని చెబుతున్నారు. తనేం చెబితే అదే జనం నమ్ముతారనే నమ్మకం చంద్రబాబుకు ఇంకా పోనట్టుగా ఉంది.
ఆ సంగతలా ఉంటే.. చంద్రబాబు నాయుడుగారు తాజాగా జగన్ కు ఒక లేఖరాశారట. అదేమిటంటే.. పెట్రోల్ ధరలు తగ్గించాలని! ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారని.. కాబట్టి పెట్రోల్- డీజిల్ ధరలు అర్జెంటుగా తగ్గించేయాలని గద్దిస్తూ చంద్రబాబునాయుడు తన లేఖలో ఆర్డరేశారట! ఈ లెటర్ సోషల్ మీడియాలో సర్ఫేస్ అవుతోంది. ఇంతకీ చంద్రబాబుకు ఏమైంది? అనే ప్రశ్నతో అది వైరల్ గా మారింది. పెట్రోల్ ధరల విషయంలో దేశమంతా కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ ఉంది. వరసగా పదో రోజు పెట్రో ధరలు పెరిగాయని, వరసగా పద్నాలుగో రోజు ధర పెరిగిందని అంటూ.. మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ విషయంలో మోడీ ప్రభుత్వాన్ని నిందించే వాళ్లు నిందిస్తున్నారు.
పెట్రోల్ ధరల పెంపును ఆనందంగా స్వీకరించడం దేశభక్తి అనుకునే వాళ్లు ఏడవలేక నవ్వుతున్నారు. పెంచింది మోడీ సర్కారు కాబట్టి అది దేశభక్తే అవుతుందనే భక్తులు ఉన్నారు మరి! ఆ కామెడీ అలా ఉంటే.. పెట్రోల్ ధరల విషయంలో జగన్ కు లేఖ రాయడం ద్వారా చంద్రబాబు నాయుడు తన థర్డ్ గ్రేడ్ పాలిటిక్స్ మరోసారి ఆయన ప్రదర్శనకు ఉంచారు. ఈ మధ్యకాలంలో ఏపీ ప్రభుత్వం పెట్రోల్ మీద ఎలాంటి సర్ చార్జీలు అదనంగా వేయలేదు, తన వాటా పన్నులేవీ పెంచలేదు. జగన్ వచ్చినప్పటి నుంచి అలాంటి పనులు చేయలేదు. పెంపుదల అంతా కేంద్రం చేస్తున్నదే. ఇలాంటి క్రమంలో మోడీకి ఈ మాత్రం ఒక లేఖ రాయలేక చంద్రబాబునాయుడు ఇలా జగన్ కు లేఖ రాయడం ఆయన పరిస్థితికి నిదర్శనంగా మారింది.
ఇక్కడే మరో విషయాన్ని గుర్తు చేయాలి.. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో.. ఏపీలో అదనపు సర్ చార్జీలతో పక్క రాష్ట్రాలతో పోల్చినా పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉండేవి. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో ఏపీ కన్నా లీటర్ ఐదారు రూపాయల తక్కువ ధరలో పెట్రోల్ దొరికేది. కర్ణాటక సరిహద్దుల్లో అయితే బోర్డులు సైతం పెట్టి అమ్మారు కన్నడీగులు. ఏపీలో కన్నా తమ దగ్గర లీటర్ పెట్రోల్ ఏడు రూపాయలు తక్కువని.. ఇక్కడే ఫుల్ ట్యాంకులు చేయించుకొమ్మన్నట్టుగా కర్ణాటక సరిహద్దుల్లో బోర్డులు కనిపించేవి అప్పట్లో. అయినా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్టించుకోలేదు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు మోడీ ప్రభుత్వ నిర్వాకం గురించి జగన్ కు లేఖ రాయడం అనేది పరమ నికృష్ట రాజకీయం కాదా? ఇలాంటి రాజకీయం చేసి మళ్లీ అధికారం అందుకోవాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారా? అని జనాలు గొణుక్కొంటున్నారు.