మ‌నుషుల మాన‌సిక ఆరోగ్యాన్ని దెబ్బ‌తీస్తున్న సోష‌ల్ మీడియా!

సోష‌ల్ మీడియా మ‌నుషుల మాన‌సిక ఆరోగ్యాల‌ను దెబ్బ‌తీస్తోంద‌ని చెప్ప‌డానికి పెద్ద పెద్ద అధ్య‌య‌నాలు అవ‌స‌రం లేదు.

సోష‌ల్ మీడియా.. గ‌త ద‌శాబ్దంన్న‌ర కాలంలో బాగా వినిపిస్తున్న ప‌దం! స‌ర్వం సోష‌ల్ మ‌యం అయిపోయింది. రోజులో క‌నీసం ఐదారు గంట‌ల పాటు సోష‌ల్ మీడియాలో గ‌డిపేస్తున్న వారి జ‌నాభా కూడా గ‌ణ‌నీయంగా ఉంటుంది. ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, గ్రామాల్లో ప‌నులు చేసుకునే వారు.. ఇలా తేడా ఏమీ లేదు! గంట‌ల కొద్దీ సోష‌ల్ మీడియాలో స‌మ‌యాన్ని ఇట్టే గ‌డిపేస్తూ ఉన్నారు. మ‌రి దీని ఫ‌లితంగా సామాజిక ప‌రిస్థితుల్లో కూడా చాలా తేడాలొచ్చాయి!

తాము చేస్తోంది సోష‌ల్ మీడియాలో చూపించుకోవ‌డం ఒక‌టైతే, సోష‌ల్ మీడియాలో చూపించుకోవ‌డానికి చేయ‌డం కూడా వృత్తిగా మారింది. వృత్తిగా మారిన వారిదైనా ఒక ఎత్తు అయితే, ఇత‌రుల పోస్టుల‌ను చూసి పోటీ ప‌డే వారి ప‌రిస్థితి మ‌రో ఎత్తు! సోష‌ల్ మీడియా మ‌నుషుల మాన‌సిక ఆరోగ్యాల‌ను దెబ్బ‌తీస్తోంద‌ని చెప్ప‌డానికి పెద్ద పెద్ద అధ్య‌య‌నాలు అవ‌స‌రం లేదు. ఇత‌రుల పోస్టుల మీద ఆలోచ‌న‌లు సాగ‌డ‌మే పెద్ద మాన‌సిక జ‌బ్బు అని స్ప‌ష్టంగా చెప్ప‌వ‌చ్చు!

ఇన్ సెక్యూరిటీ పెంచేస్తోంది!

మీరు త‌ర‌చూ డైరెక్టుగా క‌లిసే ఆఫీసులోని స‌హోద్యోగో లేక బంధువులో త‌ర‌చుగా టూర్లు వెళ్తూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటే.. వారు మీ స‌హోద్యోగే, స‌మ‌స్థాయి బంధువే అయినా వారి ద‌గ్గ‌ర ఇన్ సెక్యూరిటీ మొద‌ల‌వుతోంది.. అనేది అధ్య‌య‌నాలు చెప్పే మాట‌. వారు తిరుగుతూ, హ్యాపీగా అందంగా ఫొటోలు దిగుతూ పోస్టు చేసేస్తూ ఉన్నారు. వాటిని వందల మంది లైక్ లు చేసేస్తూ ఉన్నారు. అలా మీరు చేయ‌లేక‌పోతున్నారు. ఇది చాలు ఆ ప‌ర్స‌న్ క‌నిపించిన‌ప్పుడ‌ల్లా ఒక ఇన్ సెక్యూరిటీ క‌ల‌గ‌డానికి. ఇలా మొద‌లుపెడితే సోష‌ల్ మీడియా స్నేహితుల మ‌ధ్య‌న‌, స‌హోద్యోగుల మ‌ధ్య‌న‌, తెలిసిన వారి మ‌ధ్య‌న ఇన్ సెక్యూరిటీలు క్రియేట్ చేయ‌డంలో చాలా లోతుల్లోకి వెళ్తోంది.

జ‌ల‌సీని పుట్టిస్తోంది!

కేవ‌లం టూర్లు, షికార్లే కాదు.. చాలా మంది త‌మ లైఫ్ స్టైల్లో గ్లామ‌ర‌స్ అనిపించిన వాటిన‌ల్లా సోష‌ల్ మీడియాలో పోస్టు చూస్తూ ఉంటారు. తాగే ఖరీదైన మ‌ద్యాన్ని, ప‌బ్బుల్లో- బార్ల‌లో గ‌డిపే స‌మ‌యాన్ని, సిటీలో తాము తిరిగే వాటి గురించి అందంగా ఫొటోలు తీసి, వీడియోలు తీసి పెడ‌తారు. మామూలుగా అయితే అది వారి వ‌ర‌కే! ఎప్పుడైతే అదంతా సోష‌ల్ మీడియాలో పోస్ట‌వుతుందో.. అది వారి స‌ర్కిల్ లోని వారిలో జ‌ల‌సీని పుట్టించే అవ‌కాశాలుంటాయి. అస‌లు త‌మ స‌ర్కిల్ లో ఈ త‌ర‌హా జ‌ల‌సీని పుట్టించాల‌నే తీరుతోనే కావాల‌ని ఇలాంటి ఫోటోల‌ను పోస్టు చేసే వాళ్లూ చాలా మంది ఉంటారు కూడా!

నిద్ర‌కు భంగం!

తాము ప‌డుకునే ముందు ఆఖ‌రిగా చేసే ప‌ని .. ఫోన్ లో సోష‌ల్ మీడియాను స్క్రోల్ చేయ‌డం అనేది చాలా మంది ఒప్పుకునే విష‌యం. ప‌గ‌లంతా చూసినా, చూస్తున్నా.. రాత్రి ప‌డుకునే ముందు ఒక సారి పోస్టుల‌న్నీ చెక్ చేసి ప‌డుకోవ‌డం చాలా రొటీన్ చాలా మంది. దీని వ‌ల్ల నిద్ర‌కు తెలియకుండానే భంగం క‌లుగుతోంద‌ని పరిశోధ‌న‌లు చెబుతూ ఉన్నాయి. రాత్రిళ్లు రెండు, మూడు వ‌ర‌కూ ఇన్ స్టా రీల్స్ను స్క్రోల్ చేసే వాళ్ల సంగ‌తి స‌రేస‌రి, వారికి నిద్ర‌పోయే స‌మ‌యమే లేకుండా పోతోంది. వారి సంగ‌త‌లా ఉంటే.. అది ప‌దికి ప‌డుకునే వాళ్లు అయినా ప‌డుకునే ముందు ఎలక్ట్రిక్ డివైజ్ ల వైపు త‌దేకంగా చూడ‌డం వ‌ల్ల వారి నిద్ర స‌మ‌యం పై ప్ర‌భావం చూపుతుంద‌ట‌. ప్ర‌త్యేకించి నిద్ర‌లేమి జ‌బ్బుకు ఇది కార‌ణం అవుతుంద‌ట‌. నిద్ర‌ప‌ట్ట‌డం లేద‌ని మ‌ళ్లీ ఫోన్ చూసుకుంటూ ఉండే ప‌రిస్థితి కూడా ఇలాంటి వారికి త‌ప్ప‌దు!

స్ట్రెస్, యాంగ్జైటీ!

వేరే వాళ్ల పోస్టుల‌ను చూస్తే.. త‌మ జీవితంలో పెద్ద లోటు ఉన్న‌ట్టుగా, జ‌ల‌సీ క‌లగ‌డం ఒక ఎత్తు అయితే, మ‌నమే పోస్టులు పెడుతూ ఉంటే, ఎంత‌మంది చూస్తున్నారు, ఎన్ని లైకులు వ‌స్తున్నాయి. గ‌తంలో పోస్టుల‌కు ఎన్ని? ఇప్పుడు పోస్టుల‌కు ఎన్ని? ఇలాంటి లెక్క‌ల‌తో మ‌రి కొంద‌రు ఒత్తిడికి గుర‌వుతూ ఉంటారు. వ‌చ్చే లైకుల‌ను, షేర్ల‌ను లెక్క‌బెట్టుకుంటూ వారు యాంగ్జైటీకి గుర‌వుతూ ఉంటారు. త‌క్కువ లైకులు వ‌స్తే ప్రాణం పోయినంత ప‌ని అవుతూ ఉంటుంది. వీరి క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావు, ప‌డే వాళ్ల‌కే వాటి ప్ర‌భావం తెలుస్తుంది!

అంతిమంగా డిప్రెష‌న్!

సోష‌ల్ మీడియా ద్వారా క‌లిగే స్ట్రెస్, యాంగ్జైటీ, జ‌ల‌సీల పుణ్య‌మా అని అంతిమంగా డిప్రెష‌న్ లో కూరుకుపోయే అవ‌కాశాలు ఉంటాయి. స్థాయిల్లో తేడాలు ఉండ‌వ‌చ్చు కానీ, విప‌రీతం అయిన సోష‌ల్ మీడియా పుణ్యాన డిప్రెష‌న్ క‌లిగే అవ‌కాశాలు 45 శాతం వ‌ర‌కూ ఉంటాయ‌ని అధ్య‌య‌నాలు చెబుతూ ఉన్నాయి. ఇత‌రుల‌తో పోల్చుకోవ‌డం, త‌మ పాపులారిటీని లైకుల్లో లెక్కేసుకోవ‌డం, అతిగా తాప‌త్ర‌య‌డ‌ప‌డ‌టం.. ఇవ‌న్నీ డిప్రెష‌న్ కు దారి తీసేలా చేయ‌వ‌చ్చు!

తెలుసుకోవాల్సిన స‌త్యం!

పెళ్లైన వారు కావొచ్చు, బ్యాచిల‌ర్లుగా ప్ర‌పంచాన్ని తిరిగే వారు కావొచ్చు.. తాము సోష‌ల్ మీడియాలో పోస్టు చేసేది ప్ర‌తి ఒక్క‌టీ ఫిల్ట‌ర్ చేసిందే అని అర్థం చేసుకున్న వారు జ్ఞానులు! ప్ర‌తి రోజూ కొన్ని కోట్ల మంది సోష‌ల్ మీడియాలో పోస్టు చేసే త‌మ గ్లామ‌రస్ పిక్చ‌ర్ల‌లో కావొచ్చు, త‌మ ఎంజాయ్ మెంట్ కు సంబంధించిన ఫోటోలు కావొచ్చు.. అన్నీ ఫిల్ట‌ర్డ్ ఎమోష‌న్సే! అందులో వాస్త‌విక‌త చాలా చాలా త‌క్కువ‌.

ఒక్క ఫోటో పోస్టు చేయ‌డానికి వంద‌ల ఫొటోల అవ‌స‌రం ఏర్ప‌డ‌వ‌చ్చు వారికి కూడా! టూర్ల‌లో ఎన్నో స్ట్రెస్ ల‌ను ఎదుర్కొంటూ చివ‌ర‌కు అది బాగా జ‌రిగింద‌నిపించేలా ఒక పోస్టు పెడ‌తారు త‌ప్ప‌, అక్క‌డ త‌మ ఇబ్బందుల‌ను నూటికి తొంభై తొమ్మిది మందీ సోష‌ల్ మీడియాలో అయితే చెప్ప‌రంతే! ప్ర‌తి పోస్టు వెనుకా ప్ర‌తి ఒక్క‌రికీ ఏదో ఒక టార్గెట్టే ఉంటుంది త‌ప్ప‌, వాస్త‌వం అయితే ఏదీ కాదు! ఇది తెలిసిన వారు.. సోష‌ల్ మీడియాను ఎంత లైట్ తీసుకుంటారో చెప్ప‌న‌క్క‌ర్లేదు!

One Reply to “మ‌నుషుల మాన‌సిక ఆరోగ్యాన్ని దెబ్బ‌తీస్తున్న సోష‌ల్ మీడియా!”

Comments are closed.