‘గీతా’లాపన..భగవత్ సంకల్పం – గంగాధర్

సాధారణంగా ఒక రంగంలో సజావుగా సాగిపోతున్న వ్వవహారాన్ని వదిలేసి, కొత్త రంగంలోకి వెళ్లడానికి అంతగా ఇష్టపడరు. కానీ గాయకుడు, జర్నలిస్ట్ గంగాధర్ (లంకపల్లి గంగాధర శాస్త్రి) వ్యవహారం ఇందుకు భిన్నమైనది. చిన్నప్పటి నుంచి సంగీతంపై…

సాధారణంగా ఒక రంగంలో సజావుగా సాగిపోతున్న వ్వవహారాన్ని వదిలేసి, కొత్త రంగంలోకి వెళ్లడానికి అంతగా ఇష్టపడరు. కానీ గాయకుడు, జర్నలిస్ట్ గంగాధర్ (లంకపల్లి గంగాధర శాస్త్రి) వ్యవహారం ఇందుకు భిన్నమైనది. చిన్నప్పటి నుంచి సంగీతంపై ఆసక్తి.  హైదరాబాద్ వచ్చి సంగీతం నేర్చుకుంటూనే ఉద్యోగాలు చేసాడు. జర్నలిస్టుగా స్థిరపడ్డాడు. అందునా సినిమా జర్నలిస్ట్ గా. పది పన్నెండేళ్లు గడిచేసరికి అది ఇంక వద్దనుకున్నాడు..గాయకుడిగా మారాడు. కానీ సినిమా పాటల కన్నా వేదికపై ఘంటసాల పాటలు పాడేందుకు ఎక్కువ ఆసక్తి కనబర్చాడు. అది కూడా బాగానే వుంది రోజులు వెళ్లిపోతున్నాయనుకుంటే, ఉన్నట్లుండి భగవద్గీత ప్రాజెక్టు తలకెత్తుకున్నాడు. ఒకటా రెండా? సుమారు రెండున్నర కోట్ల రూపాయిల ప్రాజెక్టు..తొమ్మిదేళ్ల కాలం..తన పాటల పనులు, ఇంటి సంగతులు కూడా పక్కన పెట్టేసి మరీ అంకితమైపోయిన వ్యవహారం. ఇప్పుడు ఈ కలల ప్రాజెక్టు రెడీ అయిపోయింది. 29న (బుధవారం) గవర్నర్ నరసింహన్, సిఎమ్ కెసిఆర్ చేతుల మీదగా ఆవిష్కరణకు రెడీ అయింది. ఈ నేపథ్యంలో గంగాధర్ తో 'గ్రేట్ ఆంధ్ర' ఇంటర్వూ.

ఘంటసాల భగవద్దీగత అంత విశ్వ విఖ్యాతి చెందిన తరువాత కూడా మీకు ఈ ప్రాజెక్టు చేయాలని ఎందకు అనిపించింది?

ఇది నా గురువుకు గురవందనం. ఘంటసాల పాటలు పాడుతూ బతికాను. ఆయన పాటలు పాడడమే వృత్తిగా చేసుకున్నాను. ఆయన వల్ల బతికేయడమేనా..ఆయనను గురువుగా భావించినందుకు చేసేదైమైనా వుందా..అనుకంటే..ఇదే. ఈ భగవద్గీత ఆయనకు అంకితం. అదే నేను ఇవ్వగలిగింది.

భగవద్గీత రికార్డు వేయడానికే భయపడేలా తయారుచేసారు దాన్ని. ఏ అశుభం జరిగిందని జనం అనుకుంటారో అన్న భయం? ఇలాంటి నేపథ్యంలో మీరు భగవద్గీత ప్రాజెక్టు తీసుకున్నారు.?

దీనికి కొంత కారణం వుందని నేనే కాదు, అనుభవజ్ఞులు చాలా మంది భావిస్తుంటారు. ఘంటసాల గారు…భగవద్గీతను పూర్తిగా ఆర్ద్రతతో, అంతా ఒకే మాదిరిగా ఆలపించారు. బహుశా ఆయన ఆ విధమైన శైలిని తీసుకుని వుంటారు. నేను కూడా ముందు అదే శైలిలో వెళ్దాం అనుకున్నాను. దాదాపు వంద వరకు అలాగే రికార్డు చేసాం. కానీ ఆ తరువాత పెద్దలతో సాగించిన చర్చల్లో తెలుసుకున్న మేరకు, మళ్లీ వాటిని వదిలేసి, అర్థానికి సరిపోయే విధంగా, వివిధ రకాలుగా ఆలపించడం జరిగింది. అందువల్ల ఇది వింటూ వుంటే బాధో, సంతాపమో గుర్తుకు రాదు. 

అంటే మీరు విదేశీ వాయిద్యాలు, క్యాచీ ట్యూన్ లు చేసారా?

అలా కాదు..ముమ్మాటికీ అలా కాదు. శ్లోకం అర్థాన్ని బట్టి, దాని తీవ్రతను బట్టి, అందులో పదాలను బట్టి, స్వరకల్పన చేయడం జరిగింది. విన్నవారిని ఒక ధ్యాన పూర్వకమైన మూడ్ లోకి తీసుకెళ్లే శబ్దాలనే వినిపించడం జరగింది. అందుకోసం ఒకటి రెండు పాశ్చాత్య వాయిద్యాలను కూడా తీసుకున్నాం. కానీ ఆ ధ్యానం లేదా మెడిటేషన్ మూడ్ ను మాత్రం విస్మరించలేదు. 

అసలు ఈ బృహత్ ప్రయత్నం తలకెత్తుకోవాలని ఎందుకు అనిపించింది?

ఇది పూర్తిగా దైవ సంకల్పం. రెండు అబద్దాలు నాచేత ఆడించి, ముందుకు నడిపించాడు పరమాత్మ. స్వామి స్వరూపానంద ఓ సారి ఫోన్ చేసి, ఇప్పుడు ఏం చేస్తున్నావ్..అని అడిగారు. నిజానికి అప్పటికి నాలో ఏ ఆలోచనా లేదు. కానీ నేను అసంకల్పంగా, భగవద్గీత మొత్తం రికార్డు చేస్తే ఎలా వుంటుంది అనుకుంటున్నా అన్నా. నిజానికి అది అబద్దం. నేనేమీ అలాంటి పనిలో లేను అప్పటికి. దాంతో ఆయన 'ఎప్పుడు మొదలెడతావ్' అన్నారు. మళ్లీ మరో అబద్దం నా నోటి వెంట వచ్చింది..'మీరు ఎప్పుడు ముహుర్తం పెడితే అప్పుడు' అని. దాంతో ఆయన వెంటనే ముహుర్తం పెట్టి, మొదలుపెట్టు అన్నారు. ఆనాటికి అసలు ఈ ప్రాజెక్టుపై అంగుళం కూడా వర్క్ చేయలేదు.దానికి ఎంత ఖర్చు అవుతుందో తెలియదు. ఎలా సంపాదించాలో తెలియదు.  అప్పుడు మొదలుపెట్టాను. పెద్దలు ఎందరో తమ తమ సూచనలు, సలహాలు ఇచ్చారు. . మహామహోపాధ్యాయ, 'పద్మశ్రీ' ఆచా ర్య శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు, 'సంస్కతమిత్ర' డాక్టర్ ఆర్‌.వి.ఎస్‌.ఎస్‌.అవధానులు మరియు ఆచార్య శ్రీ కోరాడ  సుబ్రహ్మణ్యం గార్ల పర్యవేక్షణలో ప్రామాణిక స్థాయిలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది.  శ్లోకాలను వినడం, తప్పులు చెప్పడం, మళ్లీ రికార్డు చేయడం ఇలా. 

అంటే మొత్తం భగవద్గీత ఆలపించారన్నమాట.?

అవును. ఘంటసాల గారు పాడినవి 106 శ్లోకాలు మాత్రమే. కానీ భగవద్గీతలోని 700 శ్లోకాలు, వాటి అర్థాలు, వ్యాఖ్యానాలు కూడా అందించడం జరగింది. ఇప్పుడు ఇవి 18 సిడీలు, వాటికి అదనంగా మరొ సిడి కలిపి 19 సిడీలను తయారుచేసాం. ఇందుకు పట్టిన సమయం తొమ్మిదేళ్లు, ముందుగా చేసిన పనికి కావచ్చు, పండితుల సహాయ సహకారాలు తీసుకోవడానికి, రికార్డు చేయడానికి ఇలా అన్నింటికీ. 2006, జూన్‌ 25న ప్రారంభించాం..ఇప్పుడు ఆవిష్కరిస్తున్నాం.

నిజానికి డిజిటిల్ మాధ్యమం వచ్చిన తరువాత అడియో సిడీల మార్కెట్ పడిపోయింది. ఒక్క సిడీ అమ్ముడైతే చాలు, నెట్ లోకి వెళ్లి, లక్షల మందికి ఉచితంగా చేరిపోతోంది..మరి మీ ప్రాజెక్టు లాభదాయకం ఎలా?

ముందు ఒక్క విషయం..ఇది లాభాల ప్రాజెక్టు కాదు. ఇప్పుడు సిడీలకు పెట్టిన ధరలో కూడా తయారీకి అయిన ఖర్చే తప్ప, నాకో, సహకరించిన పెద్దలకో అయిన ఖర్చు కానీ, ప్రతిఫలం కానీ లేదు. ఇక రెండవది..ఓ భగవత్కార్యం తలకెత్తుకున్నాం. కొని సహకరించమని అర్థిస్తున్నాం. ఇక శ్రోతల ఇష్టం. అయితే నెట్ ద్వారా ఉచితంగా లక్షల మందికి చేరుతుందీ అంటున్నారే, అది కూడా మంచిదే. భగవద్గీతను ఈ తరం ముందుకు అపరిమితంగా తీసుకెళ్లాలనుకున్న మా ఆశయం నెరవేరినట్లే.

సినిమా రంగంలో వున్నవారు సాధారణంగా పక్కకు తప్పుకోవడానికి ఇష్టపడరు. మీరు ఇటు సినిమా జర్నలిజం అటు సినిమా సంగీతం రంగం రెండూ వదిలేసి, ఇలా..?

భుక్తి కోసం సినిమా జర్నలిజంలో పని చేసాను. కానీ ఒక దశలో కాస్త విసుపు అనిపించింది. అదే రాతలు, అదే మెచ్చుకోళ్లు, అదే భజన..వదిలేసాను. నారాయణరెడ్డిగారు, దాసరి గారు ప్రోత్సహించి గాయకుడిని, సంగీత దర్శకుడిని చేసారు. వేదికలపై పాడే అవకాశాలు వచ్చాయి. అక్కడ కూడా మంచి పాటలే పాడాను తప్ప, చెత్త కాదు. అనుకోకుండా ఈ ప్రాజెక్టులోకి వచ్చాను.  మొత్తం మీద నా జీవితంలో ఏదీ నేను చేయలేదు. దైవీకంగా అలా జరుగుతూ వస్తున్నాయి అంతే. 

జనం షార్ట్ కట్ మెథడ్ లకు అలవాటు పడ్డారు. మూడు మునకలేస్తే, పాపం మొత్తం పోతుందని పుష్కరాలకు పరుగెత్తారు. ఘంటసాల 106 శ్లోకాల భగవద్గీతే వినే ఓపిక లేదనిపిస్తుంది ఇప్పటి తరానికి. మరి మీ 700 శ్లోకాలు  వింటారంటారా?

అది భగవద్గీత పవర్. లేదంటే ఇన్ని వేల సంవత్సరాలుగా కాలానికి అలా నిలిచి వుండదు కదా. విదేశీయులు సైతం పేరు మార్చుకుని, మతం మార్చుకని, భగవద్గీతకు అంకితమైన ఉదాహరణలున్నాయి. అందువల్ల దాని విశిష్టత తెలసిన వారు వింటారనే నమ్మకం.

సంపాదన వదిలేసి, ఆదాయం లేని ఈ మార్గంలో పడితే మీ కుటుంబ సభ్యులు సహకరించారా?

అది నా అదృష్టం. నా భార్య అవసరమైతే నా తాళి, నగలు కూడా తీసుకోండి, ముందుకు వెళ్లండి అంది. ఆ అవసరం రాకుండానే పరమాత్మ నడిపించాడు. ఎందరో సాయం చేసారు. పైవాళ్లే అలా సహకరించినపుడు, కుటుంబ సభ్యులు మాత్రం ఎందుకు కాదంటారు. నా భార్య అందించిన సహకారం విస్మరించలేనిది. అలాగే నా కుటుంబ సభ్యులు, బంధువులు కూడా.

ఈ ప్రాజెక్టు కోసం చాలా మందిని సంప్రదించినట్లున్నారు. ఆశించిన మేరకు సహకారం అందిందా?

మాటలయితే చాలా మంది ఇచ్చారు. కానీ సాయం చేసిన వారు కొందరే. టీటీడీ వారు ముందుకు వచ్చాక ప్రాజెక్టు సజావుగా సాగింది. భగవంతుడు ప్రేరేపించిన ప్రతి ఒక్కరూ సాయం చేసారు. లేని వారు లేదు. కానీ ఈ తొమ్మిదేళ్లలో చాలా కష్టాలు పడ్డాం..ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేయడం కోసం..నేను వేదికల పై పాటలు పాడడం, వచ్చిన ఆదాయాన్ని ఇలా ఖర్చు చేయడం. 

ఇక మళ్లీ మీ పాటల పనిలోకి వచ్చేస్తారా..ఇక్కడితో ఈ ఫౌండేషన్ పనులు పూర్తయినట్లేనా?

పాటలు పాడడం అన్నది ఎవరైనా అడిగితే సరే. అది కాకపోతే ఫౌండేషన్ పనులు ఇంకా వున్నాయి. హైదరాబాద్ తో గీతాభవన్ నిర్మించాలని, భగవద్గీత వర్సిటీ ఏర్పాటు చేయాలని వుంది. యువతలో భగవద్గీతా సారాశం పట్ల మరింత అవగాహన పెంచాలని వుంది. 

అంటే ఇప్పుడు మీ జీవితాన్ని భగవద్గీతతో పెనవేసేసినట్లేనా? 

భగవద్గీత ఆలపించడానికి ముందు గంగాధర్ వేరు, ఆలపించిన తరువాత గంగాధర్ వేరు. అంతలా ప్రభావం కనబర్చింది నా మీద.

అంటే మీరు కూడా ఓ ప్రవచనకర్తగా మారిపోతారా?

అంత అదృష్టమా? గీతాచార్యుడిని మించిన ఆచార్యుడు ఎవరున్నారు? ఏమో ఆయన నా చేత అలా ప్రవచనాలే చేయించాలనుకుంటే, కాదనేదేముంది? అన్నీ ఆయన సంకల్పాలే.

మీ సంకల్పాలు, ఆశయాలు నెరవేరాలని కోరుకుంటున్నాం

ధన్యవాదాలు.

విఎస్ఎన్ మూర్తి