యాత్ర.. దివంగతనేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్‌గా గత కొంతకాలంగా వినిపిస్తున్న సినిమా టైటిల్. యాత్ర.. తెలుగునాట సావిత్రి, ఎన్టీఆర్‌లతో జీవిత కథలతో పాటు వస్తున్న తొలి రాజకీయనేత జీవితకథ. యాత్ర.. తెలుగువారి గుండెల్లో గూడు కట్టేసుకున్న అతి కొద్దిమంది రాజకీయ నాయకుల్లో ఒకరైన వైఎస్ చేసిన పాదయాత్రకు చిత్రరూపం. ఈ సినిమా ఫిబ్రవరి 8న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా మీద కామన్ ప్రేక్షకుల్లో వున్న అనేక సందేహాలు, అలాగే అదే కామన్ ఆడియన్ తెలుసుకోవాలనుకుంటున్న సినిమా విశేషాల కోసం డైరక్టర్ మహిని కలవడం జరిగింది. ఆయనతో ముచ్చటించడం జరిగింది. ఆ విశేషాలే ఇవి…
యాత్ర.. ఎలా సాగుతోంది?
హాఫ్‌వే త్రూ వున్నాము. పూర్తి అయింది. ఎంత చేయగలమో, అంతా చేసాం. చూడాలి ఇంక.
వైఎస్‌ఆర్ బయోపిక్ కదా? వైఎస్‌ఆర్ అని పేరు పెట్టకుండా యాత్ర అని ఎందుకు పెట్టారు?
యాత్ర ఎందుకుంటే, మనిషి తనను తాను చూసుకునే లోపలికి చేసేయాత్ర. బయోపిక్ అన్న సంగతి పక్కన పెట్టండి. ఓ పర్సన్ యాత్ర ప్రారంభించిన దగ్గర నుంచి ముగించేసరికి వచ్చిన మార్పు. బేసిక్ ఓ రోడ్ మూవీ మాదిరిగా కూడా. అందుకే ఈ సినిమాకు యాత్ర అని పేరుపెట్టాం.
అసలు ఇది వైఎస్‌ఆర్ బయోపిక్ నా? కాదా? బయోపిక్ అయితే ఎక్కడ ప్రారంభమై ఎక్కడ ముగుస్తుంది. లేదూ బయోపిక్ కాకపోతే, కేవలం ఆయన పాదయాత్ర మీద మీరు ప్రొజెక్ట్ చేస్తున్న సినిమానా? కొంచెం క్లారిటీగా చెప్పగలరా?
హానెస్ట్‌గా చెప్పాలంటే, నేను బయోపిక్ అనే కాన్సెప్ట్‌ను నమ్మను. ఎందుకంటే ఏ బయోపిక్ అయినా ఫిక్షన్‌నే. సరైన బయోపిక్ ఏదీ లేదు. ఓ క్యారెక్టర్ తీసుకుని, దాని చుట్టూ జరిగిన సంఘటనల ఆధారంగా కథ తయారుచేసుకుని చేయడం మాత్రమే. నాకు వైఎస్‌ఆర్ క్యారెక్టర్ నచ్చింది. ఆయన చేసిన యాత్ర నాకు నచ్చింది. ఇదంతా ఓ కథగా నచ్చింది. అందుకే ఆ కథను సినిమా తీయాలని అనుకున్నా అంతే.
కానీ వైఎస్‌ఆర్ కథ అంటే, ఈతరం వాళ్లందరికీ తెలిసిందే. మీరు తీసిన దాన్ని ప్రతివాళ్లు వాళ్లకు తెలిసినదాంతో పోల్చుకుంటారు. ఇలా జరగలేదు. అలా జరగలేదు అన్న విమర్శ వచ్చే ప్రమాదం వుంది. దానికి మీరేం జాగ్రత్తలు తీసుకున్నారు?
ఏ సినిమా ప్రాధమికసూత్రం అయినా, పర్పస్ అయినా ఓ డ్రమెటిక్ ఎక్స్‌పీరియన్స్‌నే. నాకు తెలుసు. ఉదాహరణకు పాదయాత్ర అనేది ఎన్నికలకు ఏడాదిన్నర ముందు జరిగింది. అయినా మేం సినిమాలో ఆరునెలల ముందు జరిగినట్లు చూపించాను. వైఎస్‌ఆర్ మీద బోలెడు డాక్యుమెంటరీలు వున్నాయి. నాకు కావాల్సింది అదికాదు. ఆయన చేసిన జర్నీ, ఆయనలో వచ్చిన మార్పు, ఆయన క్యారెక్టర్. అవన్నీకలిపి సినిమాకు సోల్‌గా మారాలి.
మీరు చెప్పేది ఎలా వుందంటే, వైఎస్‌ఆర్ క్యారెక్టర్ తీసుకుని, ఆయన జీవితంలోని కొన్ని సంఘటనలు తీసుకుని, వాటి చుట్టూ కథ అల్లుకుంటూ, డ్రమటైజ్ చేస్తూ ఓ సినిమా చేసారు. అంతేనా?
అబ్సల్యూట్లీ. ఏ బయోపిక్ అయినా కాస్త అటు ఇటుగా చేసేది ఇదే. అలాకాకుండా ఇది జరిగింది. ఇది జరిగింది. అంటూ అలా అదే ఆర్డర్‌లో తీసుకుంటూపోతే డాక్యుమెంటరీలా వుంటుంది కానీ, డ్రమెటిక్‌గా వుండదనే నేను అనుకుంటాను. కొన్ని ఈవెంట్లు, కొన్ని క్యారెక్టర్లు, కొన్ని టైమ్‌లైన్‌లు క్లబ్ చేస్తాం. డాక్యుమెంటరీ చేస్తే మీరు కచ్చితంగా అడగోచ్చు. ఇలా జరగలేదు అలా జరిగింది అని. ఇక్కడ అలా అడిగే అవకాశం లేదు.
రాజశేఖర రెడ్డి యాత్రకు ముందు, వెనుక అని చూసుకంటే, ఆయన యాత్రకు ముందు చాలా అగ్రెసివ్‌గా వుండేవారు అంటారు. నిజానికి సినిమాకు పనికి వచ్చే కంటెంట్ అది. మరి మీరు దాన్ని ఏమయినా టచ్ చేసారా?
నాకు వైఎస్‌ఆర్‌కు ఎలాంటి పరిచయం లేదు. నేను ఇండియాకు తిరిగి వచ్చాక ఆయన కేవలం మూడునెలలు మాత్రమే బతికి వున్నారు. ఆయన గురించి అందరి దగ్గర నుంచి అడిగి పక్కాగా తెలుసుకుని, కథ తయారు చేసుకున్నారు. నేను ఎవర్ని కలిసినా, ఎవ్వరూ కూడా ఆయన ఇంత కరేజియస్, ఇంత ఫెరోషియస్ అని చెప్పలేదు కేవలం ఆయన మంచితనం, సహాయగుణం చెప్పారు. ఉదాహరణకు ఆరోగ్యశ్రీ, ఇలాంటివి. మిగిలినవి నాకు అనవసరం. నాకు నచ్చిన రాజశేఖర రెడ్డి ఎలా వుంటారో అలాగే చూపించాను.
అవన్నీ ఆయన రాజకీయ నాయకుడిగా చేసినవి. వ్యక్తిగాకాదు. అంటే మీరు ఆయన రాజకీయ నాయకుడిగా చేసిన మంచి చూసి ఇష్టపడి సినిమా స్టార్ట్ చేసారా? వ్యక్తిగా ఇష్టపడినా?
నేను చూపించినది యాత్ర ప్రారంభం నుంచి.ఈ మనిషి యాత్ర ప్రారంభంలో ఇలా వున్నాడు. ముగిసేసరికి ఇలా మారాడు. అదీ నేను చూపించినది.
వైఎస్‌ఆర్ ఫ్యామిలీ వ్యవహారాలు ఏమన్నా చూపించారా?
లేదండీ. పాదయాత్ర, ముఖ్యమంత్రి కావడం అంతే. కానీ అలా కాకుండా తండ్రితో అనుబంధం, ఒకటి రెండు విషయాలు క్లబ్ చేసాను.
జగన్‌తో అనుబంధం ఏమీ చూపించలేదా?
లేదండీ. 2004లో అలాంటి వ్యవహారాలు ఏవీలేవు నాకు తెలిసి.
వైఎస్‌ఆర్ పాత్ర కోసం మమ్ముట్టి దగ్గరకు ఎందుకు వెళ్లారు. ఇక్కడ ఎవరూ దొరక్కా, చేయకా? లేక మమ్ముట్టినే కావాలి అనా?
ఇక్కడ ఎవరూ చేయరండీ అది వాస్తవం. అదికాకుండా నాకు వైఎస్‌ఆర్‌ను మిమిక్రీ చేసే నటుడు కాదు కావాల్సింది. ఇక్కడ ఎవర్ని తీసుకున్నా, జనాలు ఆ నటుడినే చూస్తారు. వైఎస్‌ఆర్‌ను కాదు. మమ్ముట్టిని ఆయనలాగే నటించమన్నా తప్ప, రాజశేఖర రెడ్డిలా మాట్లాడమని, ప్రవర్తించమని కోరలేదు. అది నాకు ఇష్టంలేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మమ్ముట్టిని తీసుకున్నా. ఆయన ఓ అద్భుతమైన నటుడు.
ఇక్కడ ఎవరూ చేయరని అంటున్నారు. ఎవర్ని అన్నా అడిగారా?
ఇది రాజకీయ చిత్రం. ఇక్కడ అడగడం కూడా అనవసరం. పైగా వైఎస్‌ఆర్ పార్టీ అధికారంలో కూడా లేదు. ఇంక అడగడం అనవసరం కూడా.
ఇంత అవగాహన వుంది. మరి ఇది కమర్షియల్‌గా ఎలా ఆడుతుంది అని అనుకుంటున్నారు.
ఎలా ఆడుతుంది అన్నది పక్కన పెట్టండి. ఈ సబ్జెక్ట్ కు అన్ని విధాల దమ్ము వుంది. ఎమోషన్లు వున్నాయి. తొలిరోజు కొంచెం వచ్చి, తరువాత టాక్‌ను బట్టి ముందుకు వెళ్తుంది అనుకుంటున్నాను.
కానీ సినిమా అంటే అన్నివర్గాలు రావాలి. ముఖ్యంగా ఫ్యామిలీలు.
కచ్చితంగా చెబుతున్నా, ఈ సినిమా కచ్చితంగా ప్యూర్.. ప్యూర్ హ్యూమన్ డ్రామా. అందువల్ల ఎవరైనా చూడొచ్చు.
ఈ సినిమా వెనుక ఎవరైనా వున్నారా? మిమ్మల్ని వాళ్లు ఎంచుకుని నడిపించారా?
అదేం లేదండీ. ఆనందో బ్రహ్మ తరువాత ఏదో సినిమా చేయాలి. ఇది చేయాలనుకున్నాను. నిర్మాతలకు కూడా నేనే చెప్పాను. ఎవరో ఫోర్స్ లేదా సజెస్ట్ చేసేంత ఏమీలేదు. నాకు అంత తెలివి తేటలు కూడా లేవు. ఎన్నికల ముందు ఈ సినిమా రావడం కూడా యాదృచ్చికం తప్ప వేరు కాదు.
జగన్‌కు స్క్రిప్ట్ మొత్తం వివరించారా? కొంచెమైనా చెప్పారా?
లేదండీ. జస్ట్ ఇలా తీస్తున్నాం అనిమాత్రమే అన్నాం. ఆయనలో గొప్ప విషయం ఏమిటంటే, ఆరోగ్యశ్రీ, రుణమాఫీ చూపిస్తున్నాం అని అన్నాను. రుణమాఫీ నాన్న చేయలేదండీ. అలా చేయనివి చెప్పవద్దు. ఫ్రీ కరెంట్ ఇచ్చారు. కావాలంటే అది చెప్పండి అన్నారు. పాదయాత్రలో కలిసాం. టీజర్ చూపించాం. అంతే. అంతకన్నా ఎక్కువగా మాట్లాడలేదు. అయినా సినిమా వల్ల పార్టీకి ఏదో జరుగుతుంది, సినిమా చూసి ఓటు వేస్తారు అనుకుంటే ఓటరును తక్కువ అంచనా వేసినట్లే.
పొలిటికల్ టచ్ వున్న సినిమా కదా? సెటైర్లు, పొలిటికల్ డైలాగులు గట్రా వుంటాయా?
తప్పవు కదా? కేవలం వాటికోసం కాదు. సినిమాలో అవసరం అయినపుడు మాత్రం వుంటాయి.
యాత్ర స్టార్ట్ చేసాక మిమ్మల్ని ఎవరైనా అడిగారా? ఏం తీస్తున్నారు? ఏం చెప్పబోతున్నారు అని..
లేదండీ… వాస్తవానికి యాత్ర అనౌన్స్ చేసినపుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఏదో ఆయన కూడా ఓ బయోపిక్ చేసేస్తున్నాడు అని లెక్కేసి వదిలేసారు. టీజర్ బయటకు వచ్చాక, అందులో సీరియస్‌నెస్ తెలిసింది.
చివరగా చెప్పాల్సింది ఏమైనా వుందా?
ముందే చెప్పాను. అదే మళ్లీ చెబుతున్నాను. వైఎస్‌ఆర్ అనే క్యారెక్టర్ చుట్టూ, ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు తీసుకుని, వాటిని ఓ టైమ్ లైన్‌లోకి మార్చుకుని, కొన్ని క్యారెక్టర్లు కలిపి ఓ క్యారెక్టర్‌గా చేసి, ఓ కథ తయారుచేసుకున్నా. క్రిటిక్స్‌కు ఒకటే చెబుతా. క్యారెక్టర్, సోల్, దాని జర్నీ చూడండి. అంతేకానీ హిస్టరీగా, అదిముందు, ఇది వెనుక, ఇది జరిగింది, అది జరగలేదు అన్నది మాత్రం చూడొద్దు. అంతే.
థాంక్యూ… థాంక్యూ
-విఎస్‌ఎన్ మూర్తి