ఇది లాక్ డౌన్ టైమ్…కొందరికి ఇబ్బంది కావచ్చు. కానీ కొంత మందికి ఇది ఓ మంచి సదవకాశం. ముఖ్యంగా క్రియేటివ్ పీపుల్ కి. సినిమా దర్శకులు ఫుల్ గా ఇప్పుడు తమ తమ వ్యాపకాల్లో మునిగిపోయారు. కొత్త అయిడియాలకు పదును పెడుతున్నారు. కొత్త స్క్రిప్ట్ లు తయారు చేసుకుంటున్నారు. అలాంటి దర్శకులను పలకరిస్తే…
దర్శకుడు కొరటాల శివ…తెలుగు తెరపై ఎమోషన్లు బలంగా పండించగల టాప్ ఫోర్ దర్శకుల్లో ఒకరు. సొసైటి పట్ల ఆలోచన, సమస్యల పట్ల అవగాహన వుండి, సామాజిక అంశాలను బలమైన కథాంశాలుగా చేయడంలో దిట్ట. అలాంటి క్రియేటర్, ఈ కరోనా టైమ్ లో ఏం చేస్తున్నారో? ఓసారి పలకరిస్తే..
-హాయ్ సర్..ఎలా వున్నారు.
బాగున్నా..మీరెలా వున్నారు.
–బాగున్నా..కరోనా టైమ్ ఎలా నడుస్తోంది. ఆచార్య ప్రాజెక్టుకు కాస్త బ్రేక్ వచ్చినట్లుంది. ఈ టైమ్ ను క్రియేటివ్ గా దేనికైనా వాడుతున్నారా?
క్రియేటివ్ గా కన్నా, ఆలోచనాత్మకంగా వాడుతున్నా. ప్రపంచం మొత్తం విపత్తు ఎదుర్కొంటోంది. మానవాళి సత్తా ఇంతేనా? మనం సాధించింది. మనకు వున్నది, మనం చేయగలిగింది? ఇంతేనా? అనే అంతర్మథనం. ఇప్పుడు సినిమా రంగంలో వున్నాం. ఇప్పుడు కాకుంటే అయిదారేళ్ల తరువాత అయినా ఈ రంగాన్ని వదిలేయాలి. అప్పుడు మనం ఏమిటి? ఏం చేద్దాం..ఇలా ఏవేవో ఆలోచనలు.
-మీరు, మీ శ్రీమతి రామకృష్ణ మిషన్ ఫాలోవర్స్ కదా..కరోనా సహాయాలు, సేవలు ఏవన్నా చేస్తున్నారా?
లేదండీ. బయటకు వెళ్లడానికి లేదు కదా. చేయగలిగింది విరాళంగా ప్రకటించి అందించాను.
-ఆచార్య మరింత ఆలస్యం అనుకుంటా? ఈ కరోనా కారణంగా.
అంతేగా. మరేం చేయగలం. అన్నీ సర్దుకోవాలి. అన్ని సినిమాలు ఒకేసారి మళ్లీ మొదలవుతాయి. అందరి డేట్ లు సర్దుబాటు కావాలి.
-సినిమా ఏ మేరకు పూర్తయింది.
40శాతం పూర్తయింది. ఈ కరోనా ఎఫెక్ట్ లేకుంటే చాలా వరకు పూర్తయి వుండేది.
-రామ్ చరణ్ రావడానికి కూడా టైమ్ పడుతుంది అనుకుంటాను.
అవును. ఆయన ఆర్ఆర్ఆర్ వ్యవహారాలు కూడా చూసుకోవాలి కదా.
-ఇంతకీ చరణ్ కు ఆచార్యలో హీరోయిన్ వుంటుందా?
వుంటుందిగా.
-ఎవర్నయినా అనుకున్నారా? ఫిక్స్ చేసారా?
లేదు. ఇంకా ఆలోచిస్తున్నాం.
-తరువాత ప్రాజెక్టు మీద చాలా వార్తలు వినిపిస్తున్నాయి. ఎవరితో వుండొచ్చు.
ఈసారి మాత్రం ఎవరు దొరికితే వారితోనే. ఇందులో దాపరికం ఏమీ లేదు. అనుకోకుండా ఈ సినిమాకు బాగా గ్యాప్ వచ్చింది. పరిస్థితులు అన్నీ అలా తోసుకువచ్చాయి. మూడేళ్ల గ్యాప్ వచ్చేసింది.అందుకే ఇకపై సినిమా అంటూ చేస్తే, ఆ వేళ్లకు ఏ హీరో డేట్ లు అవైలబుల్ గా వుంటే, ఆ హీరోతొనే చేస్తా.
-ఆచార్య బాగా ఆలస్యం కావడం వల్లనా? ఈ నిర్ణయం?
అది అని కాదు. నేను మహా అయితే మరో అయిదారేళ్లు ఫీల్డ్ లో వుంటానేమో? తరువాత మరెవరో వస్తారు. కొత్తనీరు వస్తూనే వుంటుందిగా. ఈ లోగా నేను చేయాలనుకున్న సినిమాలు చేసేయాలి. సమయం వృధాపోతుంటే కాస్త బాధగా వుంటుంది.
-ఈ పరిస్థితికి ఎవరు కారణం అంటారు.
ఎవ్వరూ కాదు. పరిస్థితులే.
-ఆచార్యకు విదేశీ లోకేషన్లు ఏమైనా అవసరమా?
అస్సలు అక్కరలేదు. పక్కా గ్రామీణ ప్రాంతలోనే అంతా.
-ఈ ఏడాది విడుదల అవకాశం వుంటుందా?
ఇప్పుడే చెప్పలేం కదా? ఈ కరోనా హడావుడి ముగియాలి. వర్క్ స్టార్ట్ కావాలి. అందరిదీ హడావుడే కదా. అన్నీ సర్దుబాటు కావాలి. విడుదల డేట్ లు చూసుకోవాలి. ఆర్ఆర్ఆర్ డేట్ అలాగే వుంటే బాగా వెనక్కు వెళ్లాలేమో? లేదా అది వెళ్తే, మా సినిమా వస్తుందేమో? ఇదంతా ఇప్పుడు ఊహాగానాలే తప్ప. ఏదీ పక్కా కాదు.
విఎస్ఎన్ మూర్తి