అడవి శేష్..తెలుగు ప్రేక్షకులకు అంతో ఇంతో పరిచయమే. నటుడిగా, ఇతరత్రా వ్యవహారాలతో.. మొత్తానికి సినిమా రంగాన్ని పట్టుకుని, పట్టువదల కుండా కృషి చేసుకుంటూ ముందుకు వెళ్తున్న విక్రమార్కుడు. ఇప్పుడు క్షణం అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాకు డైరక్టర్ తను కాకపోయినా, కాస్త ఎక్కువ పనే చేసాడు. కథ, కథనం, హీరో..ఇంకా చాలా చాలా.. పివిపి లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ఈ సినిమాను అందిస్తోంది అంటేనే తెలుస్తుంది.. అందులో సమ్ థింగ్ వుందని.
ఈ నేపథ్యంలో అడవి శేష్ ‘గ్రేట్ఆంధ్ర’తో మాట్లాడారు. సినిమా రంగంలో ఎప్పటికైనా మంచి నటుడిగా ఎదగాలన్నదే తన తొలి ప్రాధాన్యత అని, అందుకే తన కృషి అని ఆయన ఈ సందర్భంగా అన్నారు. సినిమా అన్నది తన ఫ్యాషన్ అని… ఎప్పటికీ ఆ రంగంలోనే వుండాలని, అక్కడే ఏదో ఒకటి చేస్తూ వుండాలని, అనుకుంటూ వుంటానని, ఈ క్రమంలో కొన్ని తప్పటడుగులు కూడా వేసానని శేష్ వివరించారు.
అయినా ప్రేక్షకుల్లో, మీడియాలో, సినిమా రంగంలో తన పట్ల ఒక సానుకూల ధోరణి ఏర్పడిందని, ఏదో ఒకటి సాధించాలని తను అనుకోవడం కాదని, ఇప్పుడు తన మంచి కోరేవారు కూడా అనుకుంటున్నారని అదే తన అదృష్టం అని అభిప్రాయపడ్డారు. అందుకే ఇండస్ట్రీలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఖాళీ లేకుండా ఏదో ఒక సినిమా చేస్తూనే వస్తున్నా అన్నారు. బాహుబలిలో పాత్ర చిన్నదే అని తనకు ముందే చెప్పారని, ఇష్టమైతేనే చేయమని బాహుబలి రూపకర్తలు చెప్పినపుడు, అలాంటి ప్రాజెక్టులో అంతకన్నా చిన్న పాత్ర అయినా చేయాల్సిందే అని బదులిచ్చా అన్నారు.
క్షణం సినిమా థ్రిల్లర్ ప్లస్ రొమాంటిక్ సబ్జెక్ట్ అని, కేవలం గంటా యాభై నిమషాల నిడివి. సినిమాకు అవసరమై,దాన్ని ముందుకు నడిపించే మూడు పాటలు వుంటాయని వివరించారు. ఇట్ల క్లాస్ రొమాన్స్ తో పాటు థ్రిల్లింగ్ అంశాలు పుష్కలంగా వుంటాయన్నారు. గతంలో వచ్చిన ఏ సినిమాలకు ఈ సినిమాతో పోలిక వుండదని, ఇది పూర్తిగా డిఫరెంట్ సబ్జెక్ట్ అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
సబ్జెక్ట్ నచ్చి, బ్రహ్మొత్సవం, ఊపిరి లాంటి పెద్ద సినిమాలు చేస్తున్న పివిపి సంస్థ నిర్మించడానికి ముందకు వచ్చిందని, అది నిజంగా తమ అదృష్టమని అన్నారు. అలాంటి పెద్ద సంస్థ నిర్మించడం వల్ల సినిమా జనంలోకి వేగంగా వెళ్తుందని అభిప్రాయపడ్డారు. సినిమా బాగాలేదు..బాగా తీయలేదు..బాగా చేయలేదు అని మాత్రం అనిపించుకునే ప్రసక్తే లేదని అడవి శేష్ ధీమా వ్యక్తం చేసారు.త్వరలో తన అన్న దర్శకత్వంలో హీరోగా ఓ సినిమా చేస్తున్నా అన్నారు.