సంజయ్ ఢిల్లీలో వుండి వుద్ధరిస్తున్నదేమీ లేదని ఇందిరకు అర్థమైంది. ఏదో ఒక వృత్తిలో పెట్టాలి, కానీ అతను దేనిలో రాణిస్తాడు? సంజయ్‌కి చిన్నప్పటినుంచి కార్లంటే మోజు. సొంతంగా కారు తయారుచేస్తాననేవాడు. తల్లి, తాత అది విని సంతోషించేవారు. మెకానికల్ ఇంజనీరింగు చేయి అని చెప్పి చూశారు. చదువంటే సంజయ్‌కు బెరుకు కాబట్టి నా వల్ల కాదన్నాడు. అప్పుడు నెహ్రూల కుటుంబ స్నేహితుడు ధర్మతేజ (ఎమ్బీయస్ క్రైమ్ రచనల్లో 'అధర్మతేజం' పేర ఆయన గురించి రాశాను) బ్రిటన్‌లోని క్రూ పట్టణంలోని రోల్స్ రాయిస్ వారి ప్లాంట్‌లో మూడేళ్ల అప్రెంటిస్ కోర్సులో చేర్పిస్తానని ఆఫర్ చేశాడు. అక్కడ ట్రైనింగ్ అయితే యిక తిరుగు వుండదని భావించి ఇందిర సరేనంది. అక్కడ బాగా ధనవంతుల పిల్లలు చేరినా షాపు ఫ్లోర్‌లో మామూలు పనివాడిలా పనిచేయాల్సిందే. సాయంత్రం వూళ్లో వున్న ట్రైనింగ్ కాలేజీలో క్లాసులకు హాజరు కావాలి. ప్రాక్టికల్ ట్రైనింగ్, డిగ్నిటీ ఆఫ్ లేబర్, అందరితో కలిసి పనిచేయడం అన్నీ అలవడుతాయి అని ఇందిర ఆశపడింది.1964 సెప్టెంబరులో సంజయ్ క్రూకి చేరాడు. అప్రెంటిసులకు యిచ్చే హాస్టల్‌లో బస చేశాడు. వారానికి 9 పౌండ్ల జీతం. సంజయ్ బ్యాచ్‌లో 20 మంది వుండేవారు.
దూన్ స్కూలులో చదువుకునేటప్పుడు ఎలా వుండేవాడో సంజయ్ అక్కడా అలాగే వున్నాడు. పనిలో పెద్దగా శ్రద్ధ చూపలేదు. వెళ్లి వచ్చేవాడంతే. ఎవరితోను పెద్దగా కలిసినదీ లేదు, ఆటలాడినదీ లేదు, స్నేహం నెరపిందీ లేదు. దగ్గర్లోనే కేంబ్రిజ్‌లో రాజీవ్ చదువుకునేవాడు. అతను అప్పుడప్పుడు వస్తూపోతూ వుండేవాడు. రాజీవ్‌కు అనేకమంది స్నేహితులు, పైగా సోనియాతో ప్రేమలో పడిన రోజులవి. అందువలన తరచుగా రావడానికి కుదిరేది కాదు. సంజయ్‌కి ప్రతిదానిపై నిశ్చితాభిప్రాయాలు వుండేవి. ఒకసారి ఒక నిర్ణయానికి వస్తే దాన్ని ఛస్తే మార్చుకునేవాడు కాదు. తోటి అప్రెంటిసులతో వాదోపవాదాలు జరుగుతూ వుండేవి. సంజయ్‌కు కారు డ్రైవింగు చాలా యిష్టం. కానీ ఇండియాలో డ్రైవ్ చేసిన విధానం బాగా అలవాటై పోవడం వలన బ్రిటన్‌లో డ్రైవింగు లైసెన్సు తెచ్చుకోలేక పోయాడు. లైసెన్సు లేకుండానే డ్రైవ్ చేస్తూ 1966 డిసెంబరులో బ్రిటన్ పోలీసులకు దొరికిపోయి క్షమాపణ పత్రం రాసి, కోర్టుకి వెళ్లకుండానే రూ.100ల జరిమానా కట్టాడు. అది ఇండియాలో పేపర్లలో వచ్చేసింది. పేపర్లో రాని యింకో విషయం వుందట. ఓ సారి మోటర్‌వేలో అతని కారు అదుపు తప్పి రెండు పల్టీలు కొట్టిందట. అది పైకి రాకుండా ఇండియన్ హై కమిషన్ తంటాలు పడిందట. సంజయ్ దూకుడు కడదాకా అలాగే వుంది. అదే అతన్ని కాటికి తీసుకుపోయింది. అతనితో పాటు సాటి పైలట్‌నూ తీసుకుపోయింది. అదీ విషాదం.
రెండేళ్ల ట్రైనింగు పూర్తయేసరికి సంజయ్‌కు బోరు కొట్టేసింది. మామూలుగా అయితే ఆ ట్రైనింగ్ అయిన తర్వాత యింకో ఏడాది వుండి స్పెషలైజేషన్ చేసి వుండాలి. కానీ ఏడాది ముందే సంజయ్‌కు అన్నీ నేర్చేసుకున్న ఫీలింగు వచ్చేసింది. ''ఇంకా యిక్కడ వుండడం టైము వేస్టు చేయడమే!'' అని యింటికి వచ్చేస్తానన్నాడు. తల్లి ఏం చేయగలదు? సరే వచ్చేయమంది. అలా ట్రైనింగు పూర్తి కాకుండానే సంజయ్ తిరిగి వచ్చాడు. అతను ఎంత నేర్చుకున్నాడు అనేదానికి కొలబద్దగా పరీక్ష ఏమీ పెట్టలేదు. ఢిల్లీ వచ్చేశాక సంజయ్ ఏం చేయాలా అని ఆలోచిస్తూ వుండగానే రాజీవ్ అతనికి అర్జున్ దాస్ అనే పంక్చర్ షాపతన్ని పరిచయం చేశాడు. రాజీవ్ ఓ సారి దక్షిణ ఢిల్లీలో వెళుతూండగా అతని కారు టైరు పంచరైంది. ఎదురుగా పంక్చర్ షాపు వుంది. ఓనరు చూడడానికి నల్లగా, పొట్టిగా, లావుగా, పహల్వాన్‌లా వున్నా కార్ల గురించి సమస్తం తెలిసున్నట్లు కబుర్లు చెప్పాడు. అదీ పుస్తకాల్లో నేర్చుకున్నది కాదు, ప్రాక్టికల్‌గా పనిచేస్తూ నేర్చుకున్నది. సంజయ్‌కు, అతనికి దోస్తీ బాగా కుదిరింది. అర్జున్‌కు ఢిల్లీలో వున్న పాత కార్ల స్పేర్ పార్ట్స్ అమ్మే షాపులన్నీ, చోర్ బజార్‌తో సహా – కొట్టిన పిండి. ఇద్దరూ కలిసి 1967 జూన్ ప్రాంతంలో గులాబీ బాగ్ అనే ఒక లోక్లాసు ఏరియాలో ఒక షెడ్ అద్దెకు తీసుకుని అక్కడ సొంతంగా కారు ఎసెంబుల్ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
సంజయ్‌కు యీ పని మీద అమిత శ్రద్ధ పుట్టింది. పుట్టి బుద్ధెరిగాక అతను యింత అంకితభావంతో ఏ పనీ చేపట్టలేదు. పొద్దున్న 8 గంటలకల్లా బయలుదేరి షెడ్డుకి వెళ్లి రాత్రి పొద్దు పోయాక తిరిగి వచ్చేవాడు. అప్పటికే అతను ప్రధాని కొడుకు. అయినా చెత్తకుప్పలతో, పారేసిన చెత్తసామాన్లతో నిండి వున్న లొకాలిటీలో ఏ సౌకర్యాలు లేని షెడ్డులో సెకండ్ హ్యేండ్ యంత్రాలతో కుస్తీ పడుతూ కారు తయారుచేయడానికి అవస్థ పడుతూ వుండేవాడు. తల్లిగా ఇందిర ముందులో కంగారు పడినా, తర్వాత తర్వాత ఏదో ఒక పని చేస్తున్నాడు కదాని తృప్తి పడింది. రోజంతా అర్జున్ దాస్‌తో గడుపుతున్నాడు కదా, అతనెలాటి వాడో చూద్దామని యింటికి పిలిపించింది. సాంఘికస్థాయి తక్కువైనా అర్జున్ మర్యాదగా ప్రవర్తించేవాడు, మాటకారి. సంజయ్ మూడ్స్ గమనించి అతనికి సర్దిచెపుతూ, హితైషిలా వుండేవాడు తప్ప అతన్ని దోపిడీ చేద్దామని చూసేవాడు కాదు. ఈ లక్షణాలు ఇందిరకు నచ్చి అతన్ని యింటికి భోజనానికి ఆహ్వానిస్తూ వుండేది. అంతేకాదు చాలా ఆదరించి 1972లో ఢిల్లీ మునిసిపల్ ఎన్నికలలో అతనికి కౌన్సిలర్‌గా టిక్కెట్టు యిచ్చి అతని తరఫున ఎన్నికల ప్రచారం చేసింది. ఓ సభలో ''నాకు యిద్దరు కాదు, ముగ్గురు కొడుకులు.. మూడోవాడు అర్జున్'' అని కూడా అంది. అతని సహాయంతో సంజయ్ తన కలలు కనే చిన్న కారు తయారుచేయగలడని నమ్మింది.
చిన్నకారు కాన్సెప్టు అనేది మనూభాయ్ షా అనే కాబినెట్ మంత్రి ప్రతిపాదన. పబ్లిక్ సెక్టార్‌లో పెట్టాలా, ప్రయివేటు సెక్టార్‌లో పెట్టాలా అని తర్జనభర్జనలు పడి ఆగిపోయింది. 1959లో ఎల్ కె ఝా నేతృత్వంలో కమిటీ వేస్తే వాళ్లు చవకగా రూ.6 వేల రూ||ల్లో కారు తయారు చేయిస్తే ఏటా 10 వేల కార్లు అమ్ముడుపోతాయని అంచనా వేశారు. అప్పుడు బెంగుళూరులోని ప్రభుత్వ సంస్థతో సహా 13 కంపెనీలు ప్రతిపాదనలతో ముందుకు వచ్చాయి. అప్పుడు 1960లో రైల్వే బోర్డుకి చైర్మన్‌గా చేసిన సి.పాండే అనే ఆయన నేతృత్వంలో మరో కమిటీ వేసి ఎవర్ని ఎంచుకోవాలో చెప్పమంది. ఆయన ఫ్రాన్సుకి చెందిన రెనోని సిఫార్సు చేశాడు. అయితే ప్లానింగ్ కమిషన్‌కు డిప్యూటీ చైర్మన్‌గా వున్న టిటి కృష్ణమాచారి ''ప్రయాణసాధనాల సమస్య పరిష్కరించడానికి యీ దశలో మనకు కావలసినది చిన్న కార్లు కాదు, స్కూటర్లు, బస్సులు, ట్రక్కులు, సైకిళ్లు..'' అని వాదించాడు. కాబినెట్ కూడా అతనితో ఏకీభవించింది. కృష్ణ మెనోన్ మిలటరీ కోసం చిన్నకార్లను డిఫెన్సు ఆర్డినెన్సు ఫ్యాక్టరీల్లో తయారు చేయించవచ్చన్నాడు. ఇలాటి వాదోపవాదాలతో చిన్నకారు కాన్సెప్టు స్తంభించిపోయింది. సంజయ్‌కు దీనిపై ఆసక్తి కలిగిందనగానే ఇందిర దీనికి అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని తయారుచేయడానికి సమకట్టింది. ప్రయివేటు సెక్టార్‌లో చిన్న కారు తయారుచేస్తే మంచిది అని ప్లానింగ్ కమిషన్ చేత ప్రకటింపచేసింది. సంజయ్ రోల్స్ రాయిస్‌లో ట్రైనింగ్ అయ్యాడని అందరికీ తెలుసు కాబట్టి అతని కోసమే యిలా మాట్లాడుతున్నారని సందేహం వచ్చింది. దాన్ని ఖండిస్తూ ''పబ్లిక్ సెక్టార్‌లో ఎందుకు చేయకూడదని కొందరడుగుతున్నారు. అది ప్రయారిటీ ఐటమ్ కాదు కాబట్టి చేయటం లేదు.'' అని ఇందిర ప్రకటించింది.
1968 నవంబరు 13 న ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ శాఖ స్టేట్ మంత్రి రఘునాథ రెడ్డి పార్లమెంటులో ప్రకటన చేస్తూ ''చిన్నకార్ల ప్రాజెక్టు గురించి మేం టెండర్లు పిలిచాం. 14 ప్రతిపాదనలు వచ్చాయి. రెనో, సిట్రాన్, మారిస్, మాజ్దా, టయోటో, ఫోక్స్‌వాగన్, రెనో రూ.11,190 కోట్ చేయగా జపనీస్ మోడల్ రూ.6700 కోట్ చేయగా సంజయ్ గాంధీ మారుతి కంపెనీ రూ.6 వేలకే చేస్తానన్నారు. అది గంటకు 53 మైళ్ల గరిష్ట వేగంతో వెళుతుంది. గ్యాలన్‌కు 56 మైళ్ల మైలేజీ యిస్తుంది. ప్రభుత్వం మారుతి కారుకి అనుమతి యిచ్చే ప్రతిపాదన పరిశీలిస్తోంది.'' అన్నాడు. ప్రతిపక్షాలు దీనిపై విరుచుకుపడ్డాయి. పదవీ దుర్వినియోగం, ఆశ్రిత పక్షపాతం వంటి ఆరోపణలు చుట్టుముట్టడంతో ఇందిర 1970 సెప్టెంబరులో ''సంజయ్ ఒక ఉత్సాహవంతుడైన యువకుడు, పరిశ్రమ పెట్టి పదిమందికి, సమజానికి ఉపయోగపడదామనుకుంటున్నాడు. నా కొడుకు కాబట్టి అతన్ని నిరుత్సాహ పరచడం ధర్మం కాదు. అతన్ని నేను కాదంటే యితర యువకులెవరైనా పరిశ్రమలు పెట్టే రిస్కు తీసుకుంటారా?'' అని వాదించింది. నవంబరులో కాబినెట్ మీటింగులో మారుతి ప్రతిపాదనను ఆమోదింపచేసింది. ఇరవై రోజుల తర్వాత ఇండస్ట్రీస్ మంత్రి దినేశ్ సింగ్ సంజయ్ గాంధీకి లెటర్ ఆఫ్ యింటెంట్ యిచ్చాడు. దానిలో స్వదేశీ సామగ్రితో ఏటా 50 వేల కార్లు తయారుచేసి తక్కువ ధరకు విక్రయించాలని వుంది. అప్పట్లో ఇండియాలో వున్న మూడు పెద్ద కార్లు కలిసి అమ్మేది ఏటా 50 వేలు! ఈ కారు ఒక్కటీ 50 వేలు అమ్మేస్తుందని అంచనా వేశారు! (సశేషం) – (ఫోటో – అర్జున్ దాస్)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2016)