సత్తి..ఓ మంచి పనోడు… అన్నది ఓ సినిమా డైలాగు. సునీల్ చెప్పిన డైలాగే..అదే డైలాగ్ కాస్త మారిస్తే.. సునీల్ ఓ మంచి కమెడియన్ అనేయచ్చు. సాధారణంగా మనం అభిమానించే వాళ్లు పైకి వెళ్తే ఆనందిస్తాం.. కానీ సునీల్ హీరో అయిపోగానే అభిమానులు అలిగారు. తమకు ఇష్టమైన కమెడియన్ తమకు దూరం జరుగుతున్నాడని. ఇప్పటికీ సునీల్ ను అభిమానించే వాళ్లంతా ఇష్టంగా అనే మాట.. హాయిగా కామెడీ వేషాలు వేసుకోవచ్చుగా.. అనే. కానీ సునీల్ కు ఏమో, రకరకాల పాత్రలు పోషించాలని, మాంచి పేరు తెచ్చేసుకోవాలనీ.. నటుడిగా తన పేరు మోత మోగిపోవాలని కోరిక. అందుకే ఇష్టంగా..కష్టపడి డ్యాన్స్ లు నేర్చుకున్నాడు, సిక్స్ ప్యాక్ చేసాడు.. ఎన్నోసమస్యలు ఎదుర్కోంటూ కూడా హీరోగా ముందుకు సాగడానికే కిందా మీదా అవుతున్నాడు. భీమవరం బుల్లోడు సినిమా తరువాత కాస్త గ్యాప్ తీసుకుని, కృష్ణాష్టమి అంటూ వస్తున్న సునీల్ లో కమెడియన్ మించిన ఫిలాసఫర్ వున్నాడు.. మాంచి భక్తివిశ్వాసాలున్న మంచి మనిషి దాగున్నాడు.. ఎప్పటికైనా ఓ ఎన్జీవో స్థాపించి, ఎంతో మందికి సేవ చేసి తీరాలనుకునే ఆదర్శవాది వున్నాడు.. అంతకు మించి.. ప్రపంచ భాషల్లోని సుమారు 16వేలకు పైగా సినిమా డీవీడీలు తెప్పించి, దాచుకున్న సినిమా పిచ్చోడు వున్నాడు. అలాంటి సునీల్ తో ‘గ్రేట్ ఆంధ్ర’ ముఖాముఖి
సునీల్ ఓ మంచి కమెడియన్? సునీల్ ఓ మంచి హీరో? ఏది మీ టార్గెట్?
సునీల్ ఓ మంచి నటుడు అనిపించుకోవాలని..
అలా అయితే అన్ని రకాల పాత్రలు చేసేయాలి కదా?
చేసేద్దాం..ఇమ్మనండి.. విలన్ అయినా రెడీ.. బీభత్సంగా చేసి చూపించేస్తాను.
మరి అడిగారా ఎవరినైనా?
ఎందుకు అడగలేదు.. ఫస్ట్ రాజమౌళిగారు, రమగారు మా ఇంటికి వచ్చి, మీతో ఏదైనా చేద్దాం అనుకుంటున్నాం అంటే, బోలెడు లావైపోతాను.. విలన్ పాత్ర ఇచ్చేయండి.. దున్నేస్తా అన్నాను.రమా రాజమౌళి బుస్సుమన్నారు. రాజమౌళి గారు మిమ్మల్ని ఎక్కడకో తీసుకెళ్దామనుకుంటే, మీరేంటీ విలన్ అంటారు… మీరు మాట్లాడకండి అని.
వైవిధ్యమైన పాత్రలు పోషించాలనుకుంటున్నారు. కానీ జనం కంప్లయిట్ మీ ఇన్నోసెంట్, భయస్తుడి లుక్ నుంచి మర్యాదరామన్న నుంచీ ఇప్పటి వరకు మారలేదని?
నిజమనేనండీ.. నేను కూడా అనుకుంటూ వుంటాను. ఒక్కోసారి కొన్ని సీన్లు చూస్తే మీరు చెప్పినట్లే అనిపిస్తుందండీ.. ఇకపై ఆ కంప్లయింట్ రానివ్వను.. మీరు చూస్తారు కదా.
హాయిగా బోలెడు కామెడీ వేషాలు వేసేవారు.. ఇప్పుడు హీరోగా నిలదొక్కు కోవడానికి కిందా మీదా పడాల్సి వస్తోంది.. అవసరమా ఇదంతా మీకు?
అవసరమే అండి.. ఏమండీ.. కమెడియన్ గా వున్నన్నాళ్లు ఇంటి మొహం తెలియకుండా తిరిగానండీ.. నూటయాభై కి పైగా సినిమాలు చేసేసాను. ఇక్కడో ఓ ఇబ్బంది కూడా వుండేది.. ముందు ఈ సినిమా వాళ్లు ఆ సినిమావాళ్లు బాగానా మాట్లాడుకుంటారు. షెడ్యూలు వేసుకుంటారు. తీరా చేసి, ఇక్కడ పెద్దహీరో వుంటారు.. సీన్ పూర్తవదు.. వదలరు.. అక్కడ పెద్ద హీరో వుంటారు.. సీన్ ప్రారంభం కావాలి రమ్మంటారు. ఎవర్నీ కాదనలేం..ఒక రకం తలకాయ నొప్పి కాదు.
అంత మాత్రం చేతే హీరో అయిపోవాలా?
అబ్బే.. అది కాదండీ.. ఇవి కూడా కారణలంతే. బేసిక్ మంచి స్టార్ గా మిగలాలి.. మంచి సినిమాలు చేయాలి..
ఎక్కడ ప్రారంభమైంది మీకీ సినిమా పిచ్చి?
భీమవరంలోనేనండీ..తెగచూస్సేవాళ్లం..ఒక్క థియేటర్ లో మాత్రం ఇంగ్లీష్ సినిమాలు వచ్చేవండీ.. ఒక్క రోజే ఆడేవి. అయినా చూసేసేవాళ్లం. అలా ముందుకెళ్లి సినిమాల్లోకి వచ్చేయాలనుకున్నా.
మరి అమ్మ వద్దని చెప్పలేదా?
లేదండీ.. వురేయ్ ఇప్పుడు నేను వద్దంటే.. జీవితాతం.. మా అమ్మ వద్దనకపోతే, ఈపాటికి సినిమాల్లో పొడిచేసేవాడిని అంటూ వుంటావ్ అందరితో. ఆ మాట నాకెందుకు.. వెళ్లి ట్రయ్ చేయ్.. నీ సంగతి నీకు తెలిసిపోతే, వెనక్కు నువ్వే వచ్చేస్తావు అంది. అలాగే వచ్చానండీ.. వెనక్కు మాత్రం వెళ్లలేదు. మా అమ్మనే రప్పించాను.
వచ్చిన కొత్తలో ఎలా వుండేది?
ఓ మా దురదగా వుండేదండీ..సెట్ మీద ఎవరైనా డ్యాన్స్ కోసం తెగ రిహార్సల్ చేస్తుంటే, లోపల అనేసుకునేవాడిని.. నాకు ఇవ్వండిరా.. చితక్కొట్టేస్తాను అని. ఎవరైనా డైలాగ్ చెప్పలేక కిందా మీదా అవుతుంటే మనకి మళ్లీ లోపల డిటో డిటో..
సరే.. కమెడియన్ అయిపోయారు.. ఇప్పుడు హీరో అయిపోయారు.. మరి సునీల్ తో సినిమా అంటే కాళ్లు చేతులు పెట్టి కెలికేస్తాడు అనే మాటేంటీ?
నిజమేనండి.. అనేయనా? ఏవండీ.. ఓ సీన్ చేస్తుంటాం.. ఇలా కాకుండా ఇలా చేస్తే ఇంకా బాగుంటుందేమో అని చెబుతాం.. అంత మాత్రానికే అలా అనేస్తే ఎలా అండీ? కమెడియన్ గా ఎన్నో సీన్లు, డైరక్టర్ చెబితే, నా బాడీ లాంగ్వేజ్ లోకి మార్చుకుని ఇంప్రూవైజేషన్ చేస్తే.. సునీల్ నువ్వు సూపరెహే… అన్నారు. అదే పని ఇప్పుడు హీరోగా చేస్తే ఇలా అంటున్నారు.. నిర్మత డైరక్టర్లకు హిట్ ఎంత అవసరమో.. నాకు అంతే అవసరం కదా.. కాదంటారా?
పోనీ సినిమాల సంగతి అలా వుంచండి.. వ్యక్తిగత జీవితంపై కూడా వదంతుల వినవచ్చాయి కదా..?
ఏవండీ.. నేను షూటింగ్ చేస్తున్నాను.. అక్కడ ఎవరితో మాట్లడమంటారు.. అక్కడ వున్నవాళ్లతోనే కదా.. ఓ డాక్టర్ మరో డాక్టర్ తో మాట్లాడితే అనుమానించేస్తే ఎలా అండీ?
డాకర్ట్ డాక్టర్ తో మాట్లాడితే అనుమానించరు కానీ, నర్సుతో ఎక్కువగా మాట్లాడితే అనుమానించేస్తారేమో? లోకం తీరు కదా?
ఏమండీ.. ఆ అమ్మాయితో ఒక్క సినిమా చేసానండీ.. మరో సినిమా అనుకోకుండా చేయాల్సి వచ్చింది.. అంతకు మించి మరేం లేదండీ..
పాటలు, ఫైట్లు లేకుంటే సునీల్ సినిమా చేయడని అంటారు?
అబ్బ.. ఊరుకోండి.. మరీనూ.. పాటలు లేకుండా ఎవరు సినిమా తీస్తారండీ? ఇక ఫైట్లు అంటారా? మరి అదెందుకు పుట్టిందో నాకు తెలీదండీ.. బహుశా నేను జాకీచాన్, ఇంకా అలాంటి హీరో యాక్షన్ విత్ ఎంటర్ టైన్ మెంట్ లాంటి సినిమాలు చేయాలని అంటూ వుంటాను. యాక్షన్ అంటే ఇక్కడ ఫైట్లు కాదు.. ఆ సినిమాల టైపు అన్నమాట. దానికి మనవాళ్లు ఇలా పుట్టించి వుంటారు. అయినా ఏవండీ.. కథ నచ్చితే, ఫైట్లు కిట్టించడం ఎంత సేపండీ.. మర్యాదరామన్న తరువాత కనీసం పాతిక ముఫై కథలు, అదే సినిమా టైపు విన్నాను. ఎలా ఓకె చేయమంటారు. ఓకె చేయకపోతే, ఎందుకు ఓకె కాలేదో వాళ్లకు ఓ కారణం కావాలి కదా?
సునీల్ కు బ్రాండ్ ల పిచ్చి కూడా ఎక్కువంట కదా?
అవునండీ.. నిజమేనండీ.. కట్ డ్రాయర్ నుంచీ.. నవ్వుతూ.. మనని అంటిపెట్టుకుని ఎప్పుడూ వుండది అదే కదా? షూటింగ్ కు వెళ్తే వాళ్లిచ్చన బట్టలు కట్టుకుంటాం.. కానీ డ్రాయర్ మనదే కదా.. అందుకే మంచివి ఎంచి కొనుక్కుంటా.. బట్టల మీద కాస్త ఎక్కువే ఖర్చు చేసేస్తా.. ఒకప్పపుడు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పిచ్చి వుండేది. మీకు తెలుసా..ఇంటర్ నెట్ డాంగిల్స్ వచ్చిన కొత్తలో, ఔట్ డోర్ షూటింగ్ ల్లో వాటిమీదే రోజూ ఓ సినిమా చూస్సేవాడిని. ఇప్పుడు డ్రెస్ ల మీదకు వెళ్లింది అంతే.
ఫైనాన్సిషయల్ డిసిప్లిన్ ఎలా వుంటుంది?
అది కూడా తక్కువేనండీ.. చెప్పకూడదు కానీ, కష్టం అంటే కరిగిపోతానండీ.. అదే వీక్ నెస్.. నేను అనుకుంటాను.. పదిమందికి ఇవ్వాల్సింది భగవంతుడు నాకు ఇచ్చాడు అంటే, పది మందికి సాయం చేయాలనే కదా.. అని. అదీ కాక కొంత వరకు నమ్మి చెడిపోయాను.. అవన్నీ ఇప్పుడెందుకు లెండి. ఎలా రాసి వుంటే అలాగేనండీ.
మీకు కాస్త వేదాంత ధోరణి ఎక్కువేననుకుంటా?
అన్నీ ఎక్కువే నండీ.. నమ్మకాలు.. దేవుళ్లు.. అన్నీనండీ.. కానీ ఒక్కటి మాత్రం చెప్తానండీ.. ఎప్పటికైనా ఓ మంచి సేవాసంస్థ స్థాపించాలి. దాన్ని మెంటల్నీ హాండీకాప్డ్ వాళ్ల కోసం నడపాలి. వాళ్లే నడపాలి. వాళ్లను వుంచి వేరే వాళ్లు నడపకూడదు. వాళ్లు దేవుళ్లండీ.. దేవుళ్ల మీద వేరే వాళ్ల పెత్తనం ఎందుకండీ.. ఆ మధ్య ఓ దగ్గర విన్నానండీ. ఫిజికల్లీ హాండీ కాప్డ్ వాళ్లు పాట పాడితే.. ఏం పాడారండీ.. వీలు కుదిరితే నా సినిమాలో వాళ్ల చేత రెండు పాటలైనా పాడించాలండీ. దాంతో వాళ్ల జీవితం సెటిలైపోతుంది కదండీ?
ఖాళీ దొరికితే ఏం చేస్తారు?
సినిమాలు చూస్తానండీ.. మీకుతెలుసా.. నా దగ్గర ప్రపంచలోని అన్ని భాషల సినిమాలు, సీరియళ్లు..అన్నీ కలిపి పదిహేను పదహారు వేల డీవీడీలు వున్నాయి. ఇప్పటికి వాటిల్లో ఓ పది శాతం చూసానంతే. మిగిలినవన్నీ చూసేయాలి. వీలైతే సినిమాలు లేకపోతే అలాంటి టీవీ సీరియళ్ల కూడా చేసాయాలి.
సినిమాకు సినిమాకు బోలెడు గ్యాప్.. ఇది ప్లానింగ్ లో లోపం అనొచ్చా?
అనేయండి.. ఫరవాలేదు.. కానీ ఇప్పుడు ఇక చాన్సివ్వను.. వరుసగా మూడు సినిమాలు వచ్చేస్తాయి ఈ ఏడాదే.. మరి కొన్ని ఫైనల్ అవుతున్నాయి. అందువల్ల ఇక ఈ గ్యాప్ వుండదు.. నాది గ్యారంటీ.
మీ మిత్రుడు.. మీ స్నేహం.. సంగతులు.?
ఎవరు త్రివిక్రమా? ఆ రోజులే వేరండీ.. హాయిగా వుండేది.. బైక్ మీద తిరిగినా, చిన్న గదిలో వున్నా.. పక్కనే బాబా గుడి.. మాకు కావాల్సిన నీళ్లన్నీ ఆ బాబా గుడిలోంచే తెచ్చుకునేవాళ్లం.
త్రివిక్రమ్ మీతో ఓ సినిమా చేస్తే.. హీరోగా ఫుల్ గా సెటిలైపోతానని ఎప్పుడు అనిపించలేదా?
లేదండీ.. నాతో చేయాలనిపిస్తే ఆయనే చేస్తాడు కదా? అయితే అప్పుడప్పుడు అంటుంటాను.. ఏరా.. ఇక్కడ ఖాళీ.. వచ్చేయనా? అని. దానికి ముందు నీదగ్గర వున్నవి కానివ్వరా.. ఏదీ లేకపోతే అప్పుడు నేను వున్నాగా అంటాడు.
అంతే కానీ ఓ హిట్ ఇవ్వాలని అనుకోరా?
ఏమండీ.. మనందరి తరుపున దేవుడ్ని పూజారిగారు అడుగుతారు. మరి పూజారిగారి గురించి దేవుడ్ని ఎవరు అడుగుతారు? ఇదీ అంతేనండీ. అయితే బోలెడు హెల్ప్ చేసాడండీ.. అందాల రాముడు సినిమా వరకు. ఎక్కడా పేరు లేకుండా, పైసా ఆశించకుండా నా కోసం. అప్పుడు నాకే అనిపించింది. వీళ్ల టాలెంట్ ను వేరే వాళ్ల అక్కౌంట్ లో వేయడానికి నేను ఎవర్ని అని? అందుకే ఆపేసాను. నిజంగా నేనే చేయాలనుకునే పాత్ర త్రివిక్రమ్ కు తడితే క్షణం ఆగడు అని తెలుసు. ఎన్ని పాత్రలు తయారుచేసాడండీ నా కోసం.
ఇప్పటికీ రెగ్యులర్ గా కలుస్తుంటారా?
ఆయ్ బాబోయ్.. లేకుండా ఎలా? వీలయినప్పడల్లా కలిసుకుంటాం.. హాయిగా ఆ రోజుల గురించి మాట్లడేసుకుంటూ గడిపిస్తాం.
అవును కేటీఆర్ కు ఏమిటీ.. ఓపెన్ గా సపోర్ట్ చేసేసారు.?
మాకు పాత పరిచయం వుందండీ.. ఆ మధ్య ఎవరికో కాస్త కష్టంలో వున్నవారికి సాయం చేయమని చెప్పా అండీ.. అంతే టక్కున చేసారు. ఏ సంస్థకు సాయం కావాలన్నా చేసే మనిషండీ ఆయన. అందుకే సపోర్ట్ చేసాను..అంతకు మించి నాకు రాజకీయాలు తెలీదండీ.
ఇంతకీ కృష్ణాష్టమి.. ఎలా వచ్చింది?
బాగుంటుందండీ.. ఫ్యామిలీ ఎమోషన్లు.. అన్నీ బాగా కుదిరాయి.. వాసూవర్మ చాలా టాలెంటెడ్ అండీ.. చాలా బాగా తీసాడు.. ఆపైన దేవుడి దయండీ..
అయితే..బెస్టాఫ్ లక్ కాదు.. మే గాడ్ బ్లెస్ యూ
హ.. హ్హ.. థాంక్సండీ
విఎస్ఎన్ మూర్తి