షీనా బోరా కేసులో 2015 నవంబరు 19న పీటర్ ముఖర్జీని నిందితుడుగా అరెస్టు చేసిన సిబిఐ మూణ్నెళ్ల గడువు మూడు రోజుల్లో ముగుస్తుందనగా నిన్న అతనిపై చార్జిషీటు దాఖలు చేసింది. 2015 సెప్టెంబరులో కేసు విచారణ నుంచి ముంబయి పోలీసు కమిషనర్ రాకేశ్ మారియాను తప్పించినపుడు పత్రికల్లో చాలా కథనాలు రావడం చేత సిబిఐ విచారణ ఏ తీరుగా చేస్తుందాని సందేహాలు చాలా పుట్టుకువచ్చాయి. రాకేశ్ చాలా లోతుగా హత్య పరిధిని దాటి ఎక్కడెక్కడికో వెళ్లిపోతున్నాడని, అలా వెళితే ఇంద్రాణి, పీటర్ ముఖర్జీల ఆర్థిక అక్రమాలకు దన్నుగా నిలిచిన కార్పోరేట్ సంస్థకు దెబ్బ తగులుతుందనే భయంతో మహారాష్ట్ర ప్రభుత్వం రాకేశ్‌ను తప్పించిందని సందేహించారు. ఎందుకొచ్చిన గొడవ అనుకుని అతను బదిలీ కాగానే మహారాష్ట్ర ప్రభుత్వం కేసును సిబిఐకు అప్పగించి చేతులు దులిపేసుకుంది. సిబిఐ ఏ కేసైనా చేపట్టిందంటే ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ తెలియదు. పైగా సిబ్బంది లేదంటుంది. స్టాఫ్ విషయంలో 33% కొరత వుందట. పైగా సిబిఐ పూర్తిగా కేంద్రం అజమాయిషీలో వుంటుంది. వాళ్లు ఎంతవరకు పరుగు పెట్టనిస్తే అంతవరకే పరుగు పెడుతుంది, ఆగమంటే ఆగుతూంటుంది. కేంద్రంలో ఎక్కడ ఏ ప్రభుత్వం వున్నా యిదే వరస అని పలుమార్లు రుజువైంది. ఇప్పుడు యీ కేసులో కూడా అదే జరుగుతుందేమో యిప్పుడే చెప్పలేం.
ఐఎన్‌ఎక్స్ మీడియా ద్వారా జరిగిన ఆర్థిక నేరాల గురించి 2010లోనే నీరా రాడియా టేపుల ద్వారా బయటకు వచ్చింది. దానిపై కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద పని చేసే సీరియస్ ఫ్రాడ్ యిన్వెస్టిగేషన్ ఆఫీసు (ఎస్‌ఎఫ్‌ఐఓ) 2013లో విచారణ జరిపి 35 పేజీల నివేదిక సమర్పించింది. ఒక కార్పోరేట్ హౌస్ సూట్‌కేసు కంపెనీల ద్వారా కోట్లాది రూపాయలు యీ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిందని వివరాలు బయటపెట్టి ఆ కార్పోరేట్‌పై చర్య తీసుకోమని సిఫార్సు చేసింది. అయితే ఆ కార్పోరేట్ యుపిఏ ప్రభుత్వాన్ని ప్రభావితం చేయడం వలననో ఏమో కథ ముందుకు సాగలేదు. ఈ గోల్‌మాల్ వ్యవహారాల్లో దెబ్బ తిన్న మేరఠ్‌కు చెందిన ఒక కంపెనీవాళ్లే షీనా హత్య గురించి బొంబాయి పోలీసులకు ఉప్పందించారని ఒక భోగట్టా. మామూలుగా పత్రికల్లో వచ్చినదేమిటంటే హత్యలో పాలు పంచుకున్న శ్యామ్ రాయ్ అనే డ్రైవరు బారులో తాగి వాగుతూ, హత్య గురించి ప్రస్తావించాడనీ, అదే బారులో వున్న ఒక యిన్‌స్పెక్టరు చెవిన పడి అతను పై అధికారులకు చెప్పాడని… అలా బయటకు వచ్చిందని ఒక కథనం వచ్చింది. అబ్బే, అలా కాదు మారణాయుధాలు కలిగి వున్నందుకు డ్రైవరును అరెస్టు చేసి విచారణ చేస్తూ వుంటే ఆ క్రమంలో యీ హత్యోదంతం బయటకు వచ్చిందని మరో కథనం. మారణాయుధాలు కలిగినందుకు పెట్టే కేసులు సవాలక్ష వుంటాయి, వాటిలో పోలీసు ఉన్నతాధికారులు కలగజేసుకోరని, లోగుట్టు ఎఱిగిన వారే టిప్-ఆఫ్ చేసి వుంటారని పోలీసు వ్యవహారాలు తెలిసినవారు అంటున్నారు.
అందుకే కాబోలు ముంబయి పోలీసు కమిషనర్‌గా వున్న రాకేశ్ మారియా తనకు అత్యంత నమ్మకస్తులైన ఎసిపి కంజయ్ కదమ్ ఇన్‌స్పెక్టర్ దినేశ్ కదమ్, నితిన్ అలకనూర్‌లతో ఒక టీము ఏర్పాటు చేసి వాళ్లకు యింటరాగేషన్ అప్పగించాడు. అయితే ఇంద్రాణి గడగడా ఇంగ్లీషులో మాట్లాడుతూ వాళ్లను అడలగొట్టేసింది. ఆగస్టు 29 న అరెస్టు చేసిన నాలుగు రోజులయ్యాక యిక అప్పుడు రాకేశ్ రంగంలోకి దిగాడు. అతను మంచి పొడుగరి. మెత్తగా మాట్లాడుతూ, ఎదుటివాడి కళ్లలోకి లోతుగా చూస్తూ తన గాంభీర్యంతో రహస్యాలు లాగడంలో ప్రసిద్ధుడు. పైగా అతని జ్ఞాపకశక్తి అమోఘం. అనుమానితుడు చెప్పిన ప్రతి చిన్న విషయాన్ని గుర్తు పెట్టుకుని, ఆ సమాచారంతోనే అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసి క్రాస్ ఎగ్జామినేషన్‌లో నిజాల్ని కక్కించగల సమర్థుడు. 1993 ముంబయి సీరియల్ బ్లాస్ట్‌ల కేసులో సంజయ్ దత్‌ను, 26/11 ఎటాక్స్‌లో అజ్మల్ కసబ్‌ను నోరు విప్పేట్లా చేసిన ఘనత రాకేశ్‌దే. ఇంద్రాణి రాకేశ్ దగ్గర కూడా షీనా అమెరికా వుందని బుకాయించసాగింది. 'అలాగా, ఆమె పాస్‌పోర్టు మాకు దొరికిందే' అన్నాడు రాకేశ్. దాంతో ఇంద్రాణి ధైర్యం చెదిరింది.
షీనా హత్య వివరాలతో రాకేశ్ ఆగలేదు, ముంబయి పోలీసులోని ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్ అధికారులను ముఖర్జీ దంపతుల ఆర్థిక వ్యవహారాల గురించి కూపీ లాగమన్నాడు. ఇది కార్పోరేట్ హౌస్‌ను కదిలించింది. డొంక కదిలితే తమకు ప్రమాదం అని భావించారు. మారియాపై బురద చల్లుడు కార్యక్రమం ప్రారంభమైంది. రాకేశ్ ఎన్‌సిపి లీడర్లకు సన్నిహితుడని బిజెపి నాయకులకు సందేహం. ముంబయి పోలీసు కమిషనర్‌గా పనిచేసి ప్రస్తుతం బిజెపి ఎంపీగా వున్న సత్యపాల్ సింగ్ 'మారియాకు పీటర్ ముఖర్జీ స్నేహితుడు' అని మీడియాకు చెప్పాడు. అందుకనే పీటర్ ముఖర్జీపై నేరం మోపలేదు అని గూఢార్థం. వెంటనే 'పీటర్‌తో తనకు పరిచయం లేద'ని రాకేశ్ ప్రకటించాడు. తగినంత సాక్ష్యాధారాలు వుంటే తప్ప అరెస్టు చేయడం కౌంటర్ ప్రొడక్టివ్ అయి అసలుకు మోసం వస్తుంది. హత్య జరిగేనాటికి పీటర్ యుకెలో వున్నాడు. హత్యతో ప్రత్యక్షంగా పాలు పంచుకోలేదు. రాకేశ్ స్ట్రాటజీ ఏమిటో మనకు తెలియదు. రాకేశ్ లలిత్ మోదీని లండన్‌లో కలిశాడని మరో వచ్చింది. ముఖ్యమంత్రి దానిపై మారియాను సంజాయిషీ అడిగాడు. 'అవును కలిశాను, లలిత్ న్యాయవాది కలవమని కోరితే అప్పటి హోం మంత్రి పాటిల్ అనుమతి తీసుకునే కలిశాను' అని రాకేశ్ జవాబిచ్చాడు.
సిబిఐకు అప్పగించకుండా ముంబయి స్థాయిలోనే రాకేశ్ యీ కేసును ముందుకు తీసుకుపోవడం మహారాష్ట్ర ముఖ్యమంత్రికి నచ్చలేదు. కానీ రాకేశ్ సిబిఐకు అప్పగించడానికి యిష్టపడలేదు. ఇది సాధారణ హత్య కాదని, ఆర్థికపరమైన కుట్ర చాలా వుందని అతని అభిప్రాయం. రాకేశ్‌ను తప్పించడం అంత సులభమైన పని కాదు. అందువలన సెప్టెంబరు 30 న అతని సీనియర్లు యిద్దరు రిటైరు అవుతున్నారు కాబట్టి సెప్టెంబరు 7 న రాకేశ్‌కు డైరక్టర్ జనరల్‌గా ప్రమోషన్ యిచ్చి ముంబయి పోలీసు కమిషనర్ పదవి నుంచి తప్పించేశారు. ఇంత సమర్థుడైన అధికారి సేవలను ప్రస్తుతం దేనికి వినియోగించుకుంటున్నారంటే హోమ్ గార్డ్‌స్ హెడ్‌గా! అతని స్థానంలో అహ్మద్ జావేద్ అనే మరొక సమర్థుడైన అధికారిని నియమిస్తూ సెప్టెంబరు 8 కల్లా రాకేశ్‌ను పదవి నుంచి రిలీవ్ చేసేశారు. సెప్టెంబరు 30 కల్లా చార్జిషీటు ఫైల్ చేస్తానని రాకేశ్ చెప్తున్నా, 22 రోజుల ముందు అడావుడిగా ఆ కేసును అతని చేతుల్లోంచి లాగేసుకున్నారు.
ఇది కావాలని చేసిన పని అని, హంతకులను కాపాడే ప్రయత్నమని సర్వత్రా విమర్శలు వచ్చాయి. వాటిని తప్పించుకోవడానికి సెప్టెంబరు 17న కేసు సిబిఐకు అప్పగించేశాడు ఫడ్నవీస్. ఇక సిబిఐ మామూలు ధోరణిలోనే వ్యవహరించసాగింది. పీటర్ పాత్రను కాదనలేని స్థితి రావడం చేతనో ఏమో మూణ్నెళ్ల క్రితం నవంబరు 19న అరెస్టు చేసింది. ఇన్నాళ్లకు చార్జిషీటు ఫైల్ చేసింది. దీని ప్రకారం కొత్తగా వెలుగులోకి వచ్చిన విషయాలేమిటంటే – షీనా, రాహుల్ ప్రేమ వ్యవహారం ఇంద్రాణికే కాదు, పీటర్‌కు కూడా యిష్టం లేదు. 2009 నుండి వద్దని వాళ్లు మూడేళ్ల పాటు చెప్తున్నా పిల్లలు వినలేదు. సిద్దార్థ దాస్ వలన పుట్టిన యిద్దరు పిల్లలు (షీనా, మిఖాయేల్) డబ్బు కోసం తనను వేధిస్తున్నారని ఇంద్రాణి పీటర్‌తో చెప్పుకుంది. 2005-2008 మధ్య లెక్కలు తీస్తే షీనాకు యిచ్చిన డబ్బు కంటె సంజీవ్ ఖన్నా ద్వారా పుట్టిన విధికి యిచ్చిన డబ్బు ఎన్నో రెట్లు. షీనా పేర ఢిల్లీలో ఉన్న ఒక ఫ్లాట్‌ను పీటర్, ఇంద్రాణి అమ్మేశారు. ఇంద్రాణి రిలయన్సులో తన ఉద్యోగం ఊడగొట్టడానికి చూసిందని షీనా 2009లోనే తన స్నేహితురాలికి యీమెయిల్స్ రాసింది, వాటిల్లో తల్లిని నానా బూతులూ తిట్టింది. షీనాను తుదముట్టించాలని 2012 మార్చిలో అనుకున్నాక పీటర్ భార్యతో సహా కలకత్తాకు అనేక ట్రిప్పులు వేశాడు. ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నాను కలిశాడు. ఫైనల్ ప్లాను ఇంగ్లండులో వుండగా వేశాక ఇంద్రాణి ముందుగా ఇండియా వచ్చేసింది. పీటర్ 2012 ఏప్రిల్ 26కి వచ్చాడు. హత్య జరగడానికి ముందు, వెనకు పీటర్, ఇంద్రాణి మధ్య జరిగిన కాల్ డేటా రికార్డుల ప్రకారం చూస్తే హత్య గురించి ఇంద్రాణి పీటర్‌కు ఎప్పటికప్పుడు చెప్తోందని అర్థమవుతుంది. సిబిఐ 47 మంది సాక్ష్యులను సేకరించింది. 32 వ నెంబరు సాక్షి షీనా, మిఖాయేల్ యిద్దర్నీ చంపాలని పీటర్, ఇంద్రాణి అనుకున్నారని చెప్పాడట. ఆ సాక్ష్యాన్ని సీల్డ్ కవరులో పెట్టి యిచ్చింది సిబిఐ. సెషన్స్ కోర్టులో హియరింగ్ ఫిబ్రవరి 29 న వుండవచ్చు.
ఇప్పుడు పీటర్, ఇంద్రాణి, సంజీవ్ ఖన్నా, శ్యామ రాయ్‌ల మీద సిబిఐ పెట్టిన కేసు క్రిమినల్ కాన్‌స్పిరసీ (నేరపూరితమైన కుట్ర) అబ్డక్షన్ (ఎత్తుకుపోవడం), మర్డర్ (హత్య), డిస్ట్రక్షన్ ఆఫ్ ఎవిడన్స్ (సాక్ష్యాలను నాశనం చేయడం) కు సంబంధించినవి. ఆర్థిక నేరాల గురించి ప్రస్తావన లేదట. రాహుల్, షీనాల ప్రణయం యిష్టం లేకనే యివన్నీ జరిగాయని సిబిఐ వాదన. పీటర్, ఇంద్రాణి అక్రమమార్గాల్లో సంపాదించిన డబ్బులో కొంత షీనా పేర పెట్టారని, ఆమె దాన్ని వెనక్కి యివ్వడానికి ఒప్పుకోలేదు కాబట్టే హత్య జరిగింది అనే లైను పూర్తిగా వదిలిపెట్టేశారు. అందువలన పీటర్, ఇంద్రాణి ఆర్థిక నేరాలపై విచారణ ఆగిపోతుందని, దీని కోసమే ఆ కార్పోరేట్ హౌస్ చక్రం తిప్పి, సిబిఐ చేతికి కేసు వచ్చేట్లా చేసిందని అనుకోవాలి. అబ్బే, సప్లిమెంటరీ చార్జిషీటు ఫైల్ చేస్తాం, దానిలో ఆర్థికకోణం ప్రస్తావన వుంటుంది అని సిబిఐ అంటోందట. ఆ ముచ్చట కూడా జరిగాక కానీ అసలు విషయం తెలియదు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2016)