ఎమ్బీయస్‌: తమిళ రాజకీయాలు – 77

మహామహం గొడవను అసెంబ్లీలో ప్రస్తావిద్దామని ప్రయత్నించిన ప్రతిపక్షాలకు స్పీకరు సేదాపట్టి ముత్తయ్య ఛాన్సే యివ్వలేదు. కానీ తమ తప్పేమీ లేదని ప్రకటించే అవకాశం మాత్రం జయలలితకు యిచ్చాడు. ముత్తయ్య ఎటువంటివాడంటే స్పీకరుగా ఎన్నిక కాగానే…

మహామహం గొడవను అసెంబ్లీలో ప్రస్తావిద్దామని ప్రయత్నించిన ప్రతిపక్షాలకు స్పీకరు సేదాపట్టి ముత్తయ్య ఛాన్సే యివ్వలేదు. కానీ తమ తప్పేమీ లేదని ప్రకటించే అవకాశం మాత్రం జయలలితకు యిచ్చాడు. ముత్తయ్య ఎటువంటివాడంటే స్పీకరుగా ఎన్నిక కాగానే అందరి ఎదుటా ఆమె ఎదుట మోకాళ్లపై కూర్చుని దణ్ణం పెట్టాడు. ఇక అలాటి వ్యక్తి నిష్పక్షపాతంగా వుంటాడని ఎలా వూహించడం? జయలలితకే కాదు, శశికళకు కూడా విపరీతంగా గౌరవం యిచ్చాడు. అసెంబ్లీలో ఎమ్జీయార్‌ చిత్రపటాన్ని ఆవిష్కరించే సమయంలో అసెంబ్లీ సభ్యురాలు కాని శశికళను డిప్యూటీ స్పీకరు కుర్చీలో కూర్చోనిచ్చాడు. ఇక ప్రతిపక్షంలో వున్న డిఎంకె సభ్యుడు పిఐ వళుది ఎడిఎంకె తప్పులు ఎండగడుతూంటే అతన్ని కంట్రోలు చేయలేక, అతని మైకును కంట్రోలు చేయసాగాడు. అతను లేచి నిలబడగానే అతని మైకు పాడైపోయేది. ఇలస్ట్రేటెటెడ్‌ వీక్లీకి మద్రాసు కరస్పాండెంటుగా వున్న సునీల్‌ అనే జర్నలిస్టు 'తమిళనాడు అసెంబ్లీ ఫాస్ట్‌ గెయినింగ్‌ నొటోరిటీ' పేర వ్యాసం రాసి పంపితే ఎడిఎంకెవారు అతనిపై ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ తరఫున  ప్రివిలేజెస్‌ కమిటీ వేసి దాని ద్వారా స్పీకరు సునీల్‌పై చర్య తీసుకోబోయాడు. సునీల్‌ కమిటీ ముందు హజరు కాకుండా క్షమాపణ పత్రం రాసి పంపినా దాన్ని పట్టించుకోకుండా అతని పేర అరెస్టు వారెంటు జారీ చేశాడు. సునీల్‌ సుప్రీం కోర్టుకి వెళ్లి ఏప్రిల్‌లో స్టే తెచ్చుకున్నాడు. అయినా ముత్తయ్య వెనక్కి తగ్గలేదు. పేరుకి ముత్తయ్యే కానీ ఆ నిర్ణయాలన్నీ జయలలితవని అందరికీ తెలుసు.

జయలలిత తనపై విమర్శలు సహించలేకపోయేది. 1991 ఆగస్టులో ఎడిఎంకె సభ్యులు ''కుముదం'' అనే ప్రాచుర్యం వున్న వీక్లీ ఆఫీసుపై దాడి చేశారు. కావేరీ సమస్యపై జయలలిత విధానాన్ని విమర్శిస్తూ సంపాదకీయం రాయడమే అది చేసిన తప్పు. తమకు జరిగిన నష్టంపై పోలీసు కంప్లయింట్‌ యివ్వడానికి కూడా దడిసిన మేనేజ్‌మెంట్‌   ఏదోలా రాజీపడి వూరుకుంది. అదే సమయంలో ''తరాసు'' అనే వీక్లీపై కూడా దాడి జరిగితే వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు ఎలాటి చర్యా తీసుకోలేదు. తరాసుపై దాడిలో ఎడిఎంకె హస్తం వుందని ''దళపతి'' సంపాదకుడు దురై రాస్తే అతన్ని అరెస్టు చేయించింది. వలంపురి జాన్‌ అనే మాజీ ఎంపీ జయలలిత జీవితాన్ని తన వీక్లీలో సీరియల్‌గా వేస్తూంటే ఆమె మద్రాసు కోర్టుకి వెళ్లి దానిపై నిషేధాన్ని తెచ్చుకుంది. కొద్ది కాలానికి అతని పత్రిక మూతపడింది. తన ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నందుకు ''ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌'', వారి తమిళ వెర్షన్‌ ''దినమణి''కి ప్రభుత్వం నుంచి ప్రకటనలు ఆపేసింది. ఒక ఘటనలో స్పీకరు డిఎంకె ఎమ్మెల్యే పిఐ వళుతిని అసెంబ్లీనుండి నెట్టేయించాడు. దాన్ని విమర్శిస్తూ  డిఎంకెకు సంబంధించిన ''మురసొలి'', ''కోవై మాలై మురసు'' రాసిన కథనాలు జయలలితను మండించాయి. స్పీకరు చేత వాటి సంపాదకులు సెల్వమ్‌, సుందర్‌లకు అరెస్టు వారంట్లు పంపించింది. సెల్వమ్‌ సుప్రీం కోర్టుకి వెళ్లాడు కానీ కోర్టు అతని అప్పీలును స్వీకరించలేదు. దాంతో క్షమాపణ చెప్పుకోవలసి వచ్చింది. 

జయలలిత వ్యవహారశైలి కూడా రాజరికాన్ని తలపించేది. ఎల్‌టిటిఇపై కఠిన చర్యలు తీసుకుంటోంది కాబట్టి భద్రత పెంచాల్సి వచ్చింది. అప్పట్లో అందరికంటె ఎక్కువ రిస్కు వున్నది పంజాబ్‌ ముఖ్యమంత్రి బియాంత్‌ సింగ్‌కు, రెండో స్థానం జయలలితదే. అందువలన ఎక్కడకు వెళ్లినా 16 కార్లు అటూయిటూ వుండేవి. ఆమె అటువైపు వస్తోందంటే చాలు గంటగంటలకు ముందే రోడ్డు మూసేసేవారు. ప్రజలంతా అవస్థ పడేవారు. ప్రజలే కాదు, జయలలిత యిల్లు వున్న కాలనీలో వుండే రజనీకాంత్‌ కూడా అవస్థపడేవాడు. అతని కారును ఓ పట్టాన వెళ్లనిచ్చేవారు కాదు. అతన్ని చూడడానికి అభిమానులు యింటికి వస్తూంటే వాళ్ల వలన ముఖ్యమంత్రి భద్రతకు ప్రమాదం అంటూ వాళ్లెవరూ రజనీకాంత్‌ యింటికి రావడానికి వీల్లేదని పోలీసులు ఆంక్షలు విధించారు. ఇది రజనీకాంత్‌ను మండించింది. జయలలితను కలవడం మంత్రులకు కూడా అసాధ్యమై పోయేది. ఆమె హోం సెక్రటరీ కె మలైస్వామి, మరో యిద్దరు జాయింటు సెక్రటరీలు మాత్రమే జయలలిత వద్దకు వెళ్లగలిగేవారు. ఆమె ఆదేశాలను యితర మంత్రులకు చేరవేసేవారు. ఎంత అర్జంటు పని వున్నా మంత్రులు, ఎడిఎంకె నాయకులు ఆమెను కలిసే వీలుండేది కాదు. 

అధికారుల పట్ల కూడా ఆమె చిత్తం వచ్చినట్లు వ్యవహరించేది. తొమ్మిది నెలల్లో నలుగురు యిండస్ట్రీస్‌ డిపార్టుమెంటులో సెక్రటరీలను మార్చింది. రాష్ట్రంలో పెండింగులో వున్న రైల్వే స్కీముల గురించి వివరించడానికి సదరన్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ ఎపాయింట్‌మెంట్‌ అడిగితే ఎపాయింట్‌మెంటు యివ్వడానికి నాలుగు నెలలు తీసుకుంది. ఆమె రాచరికపు పోకడలను ప్రోత్సహించడానికి కొందరు ఆకాశానికి ఎత్తేయసాగారు. పరిమళభరితమైన హైబ్రిడ్‌ వరి వంగడానికి జయ92 అని పేరుపెట్టారు. వయొలిన్‌ విద్వాంసుడు కున్నైక్కుడి వైద్యనాథన్‌ ఆమె పేర ఒక రాగాని సృష్టించాడు. మణిరత్నం అన్నగారు, సినీనిర్మాత జి వెంకటేశ్వరన్‌ గాంధీ జయంతి తరహాలో జయజయంతి (జయలలిత పుట్టినరోజును) పండగలా జరపాలని ప్రతిపాదించాడు. రాజరికం తలకెక్కితే విమర్శ సహించలేకపోవడం సహజం. ఎన్‌ నటరాజన్‌ అనే డిఎంకె సభ్యుడు ఆసుపత్రిలో వుండగా తన గురించి, శశికళ గురించి అశ్లీలంగా మాట్లాడాడని ఎవరో చాడీ చెప్పగానే జయలలిత అతను ఆసుపత్రిలోంచి బయటకు వస్తూండగానే అరెస్టు చేయించింది. ఇవన్నీ పట్టించుకోకుండా ప్రజలు తనను ఆరాధించాలనే కోరికతో ఎక్కడ పడితే అక్కడ తన బొమ్మల కటౌట్లు పెద్ద సైజులో రాష్ట్రమంతా పెట్టించింది. ఎమ్జీయార్‌ను వెనక్కి నెట్టేసింది, ఎటు చూసినా భారీ కటౌట్లలో భారీకాయంతో జయలలిత బొమ్మలే!

వీటివలన ఆమె అంటే పడిచచ్చే అభిమానులు తప్ప మామూలు ప్రజల్లో కాస్త వ్యతిరేకత ప్రబలసాగింది. ఎల్‌టిటిఇని వేటాడినంతకాలం ఆమెను మద్దతు బాగానే వుంది. 1992 మే నాటికి రాజీవ్‌ హంతకుల వేట పూర్తయిన తర్వాత ఆ వేడి తగ్గింది. చీప్‌ లిక్కర్‌ స్కీము రద్దు చేయడం వలన బజెట్‌పై భారీగా భారం పడింది. బజెట్‌ లోటు వెయ్యి కోట్ల రూ.లకు చేరసాగింది. దాన్ని తగ్గించుకోవడానికి అత్యవసర వస్తువులపై పన్నులు పెంచింది. బియ్యం, పాలు, విద్యుత్‌ చార్జీలు, బస్సు టిక్కెట్లు పెరిగాయి. ఇవన్నీ మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వాన్ని దూరం చేశాయి. ఎమ్జీయార్‌ కాలంలో కేంద్రంతో ఎప్పుడూ సఖ్యంగానే వుండేవాడు. కానీ జయలలిత కేంద్రంతో కయ్యం పెట్టుకోసాగింది. కావేరీ సమస్యపై తగినంత చేయడం లేదని దుయ్యబట్టేది. పెరుగుతున్న అధికధరలకు కేంద్రమే బాధ్యత వహించాలని కార్మిక మంత్రి అరణ్యనాయకం చేత అనిపించింది. రాష్ట్ర బజెట్‌లో ప్లానింగ్‌ కమిషన్‌ రూ.119 కోట్ల కోత విధిస్తే జయలలిత ప్లానింగ్‌ కమిషన్‌ను ఘాటుగా విమర్శించింది. అది ప్రధాని పివికి నచ్చలేదు. జయలలితకు ప్రజాదరణ పోతూంటే యింకా ఆమెనే పట్టుకుని వేళ్లాడితే వచ్చే ఎన్నికలలో నెగ్గడం కష్టం అనుకున్నారు. డిఎంకెను పలకరించసాగారు. ఒక వివాహ వేడుకలో మూపనార్‌, కరుణానిధి చాలాసేపు మాట్లాడుకోవడంతో జయలలితకు అనుమానాలు పొడసూపాయి.  డిఎంకెతో పాటు కాంగ్రెసు పట్ల కూడా కాఠిన్యం వహించసాగింది. దానికి తోడు తన పార్టీలోనే వున్న జానకి వర్గానికి చెందిన వీరప్పన్‌, రాజారామ్‌ల పై కూడా ఆగ్రహం చూపించి డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ పోస్టులు పీకేసింది. రాజారామ్‌ నుండి గతంలో ఆహారశాఖ తీసేసిన విధానం కూడా ఆమె అహంకారాన్ని చూపుతుంది. అతను ఢిల్లీలో ఒక సమావేశంలో పాల్గొనడానికి అక్కడకు వెళ్లాక, యిక్కడ ఆమె పదవి పీకేసింది. అతను ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగి వెనక్కి వచ్చేయవలసి వచ్చింది. రూరల్‌ ఇండస్ట్రీస్‌ మంత్రి మహమ్మద్‌ అసిఫ్‌కు మంత్రి పదవి వూడిపోయిన వైనం ఎలా తెలిసిందంటే అతని యింటి బయట కాపలాగా వున్న సెక్యూరిటీ సిబ్బంది వెళ్లిపోసాగారు. అదేమిటని అడిగితే అప్పుడు విషయం తెలిసింది. వీటికి తోడు ఆమె అవినీతి కూడా ప్రజల దృష్టిలో పడింది.  – (సశేషం)  ఫోటో – జయలలిత కటౌట్‌

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2016)

[email protected]

Click Here For Archives