నారా రోహిత్..చకచకా సినిమా చేస్తున్న హీరో..అలాంటి హీరోతో హీరోయిన్ టైటిల్ పెట్టి చేసిన సినిమా సావిత్రి. పవన్ సాధినేని..ఈ సినిమా దర్శకుడు. గతంలో ఓ సినిమా చేసినా, అంతగా పరిచయం లేని పేరు. కానీ, ఈ సినిమా స్క్రిప్ట్ విని, నమ్మకంతో, ఆసక్తితో రోహిత్ అవకాశం ఇస్తే అందిపుచ్చుకున్నాడు. ఆ నమ్మకాన్ని, అదే సమయంలో సినిమా పెట్టిన విఖ్యాత నటి సావిత్రి పేరును నిలబెడతా అంటున్నాడు దర్శకుడు పవన్ సాధినేని. సావిత్రి చిత్రం విడుదల సందర్భంగా అతనితో చిట్ చాట్.
సావిత్రి టైటిల్
ఈ సినిమా కథకు..నూటికి నూరు పాళ్లు న్యాయం చేసే టైటిల్ ఇది. నేను అనుకున్న టైటిల్ ఇదే. కావాలంటే మారుద్దాం అంటే నారా రోహిత్ వద్దన్నారు. నీకు నచ్చింది..నీ కథకు సూటయింది..అలా వుంచేయ్ అన్నారు. టైటిల్ మా దగ్గర లేదు..సురేష్ బాబుగారి దగ్గర వుంది. వెళ్లి కథ చెప్పి, టైటిల్ ఇంపార్టెన్స్ చెబితే, మరో మాట అనకుండా తీసుకోండి అంటూ ఇచ్చేసారు. సినిమా చేస్తున్నంత కాలం నన్నువెంటాడింది ఈ పేరే. సావిత్రి లాంటి విఖ్యాత నటి పేరు పెట్టాం..ఆమె పేరు లెవెల్ కు వెళ్లడం మాట అటు వుంచి అస్సలు ఏ మాత్రం చెడగొట్టకూడదు అని డిసైడ్ అయ్యాను..ఆ భయం అలా వుంచుకునే సినిమా చేసాను.
సబ్జెక్ట్ అలాంటిది
నిజానికి ఈ సినిమా సబ్జెక్ట్ అలాంటిది. హీరోయిన్ జీవితంలోకి ప్రతి ఒక్కరు వస్తారు..హీరోతొ సహా. సినిమా ప్రారంభమైన పావు గంట వరకు హీరో ఎంట్రీ వుండదు. చాలా మంది ఈ కథ విని..హీరో పావుగంట దాకా రాకపోతే ఎలా..మేం చేయం అన్నారు. కానీ వైవిధ్యమైన సబ్జెక్ట్ లు అంటే నారా రోహిత్ సై అంటారు.ఆయన ప్రొసీడ్ అన్నారు. సావిత్రి టైటిల్ పెట్టి, హీరోయిన్ చేత రెండు డ్యాన్స్ లు, రెండు సీన్లు చేయించడం కాదు..సినిమా మొత్తం హీరోతో సమానంగా హీరోయిన్ క్యారెక్టర్ రన్ అవుతుంది.
రోహిత్ బాగుంటారు
నారా రోహిత్ ఈ సినిమాలో బాగుంటారు. అంటే సిక్స్ ప్యాక్ చేసారు..ఇలా వుంటారు అలా వుంటారు అని చెప్పను. ఆయన పర్సనాలిటికీ ఎలాంటి డ్రెస్ సెన్స్ అయితే బాగుంటుంది. ఎలాంటి గెటప్ అయితే సూటవుతుంది..ఎలా వుంటే బాగుంటుంది అన్నవి పెర్ ఫెక్ట్ గా ప్లాన్ చేసాం. ఈ సినిమాలో నారా రోహిత్ బాగున్నాడు అని ప్రేక్షకులు కచ్చితంగా అనుకుంటారు.
ఫ్యామిలీ ఎంటర్ టైనర్
సినిమా చూసిన తరువాత ప్రేక్షకులకు మన పద్దతులు, మన కుటుంబాలు, మన పల్లెటూర్లు కచ్చితంగా గుర్తుకు వస్తాయి. మన ఇళ్లలో మనం ఎలా మాట్లాడుకుంటామో, మన ఇళ్లలో పెళ్లి చూపులు ఎలా వుంటాయో..అన్నీ చాలా సహజంగా తెరెక్కించాం. దాంతో ఫన్ ఎక్కడా మిస్ కాలేదు. ప్రతి ఒక్కరు వారి కుటుంబాలను ఐడెంటిఫై చేసుకుంటారు.
పెళ్లి..పెళ్లి..
హీరొయిన్ ది నావెల్ పాయింట్..చిన్నప్పటి నుంచి పెళ్లి అంటే ఓ ఇష్టం. ఓ అభిరుచి..భోజనం చేయమంటే చేయదు..పెళ్లి భోజనం అంటే రేడీ..పెళ్లి చూడ్డం అంటే ఇష్టం..పెళ్లి మాటలు అంటే సరదా..ఇలా అన్నమాట. రోహిత్ క్యారెక్టర్ కూడా బాగుంటుంది. సినిమా ఆరంభంలో క్యారెక్టర్, దాని టెంపో ఎలా వుంటుందో, చివరి వరకు అదే టెంపో వుంటుంది. అందుకే ఈ సినిమా మీద చాలా కాన్పిడెన్ట్ గా వున్నాను. ప్రేక్షకుల అభిరుచి మీద నమ్మకం వుంది. ఆ నమ్మకం గెలిస్తే, మళ్లీ మరో మంచి ప్రయత్నం చేయడానికి నాకు నమ్మకం చిక్కుతుంది.