నరసింహనాయుడు ` బి.గోపాల్` అల్లరి రాముడు
అమ్మ నాన్న తమిళమ్మాయి` పూరీ జగన్నాధ్` ఆంధ్రావాలా
ఠాగూర్` వివి వినాయక్` సాంబ
అతనొక్కడే` సురేందర్‌రెడ్డి` అశోక్
క్రిష్ణ` వివి వినాయక్` అదుర్స్
కిక్` సురేందర్‌రెడ్డి` ఊసరవెల్లి
సింహా` బోయపాటి శ్రీను` దమ్ము
దూకుడు` శ్రీను వైట్ల` బాద్షా
గబ్బర్‌సింగ్` హరీష్ శంకర్` రామయ్యా వస్తావయ్యా
కందిరీగ` సంతోష్ శ్రీనివాస్` రభస..(??)
.. ‘బుడ్డోడు’ రెండు దశాబ్దాలు దాటిన తన కెరీర్‌లో చేసిన చిత్రాల్లో దాదాపు సగం సినిమాల జాబితా ఇది. దీన్ని చూస్తే చాలా విపులంగా అర్థమైపోతోంది. బుడ్డోడి ఫ్లాప్ ల వెనుక అసలు మర్మం ఏమిటో అవగతమౌతుంది. బుడ్డోడు ఎక్కడా కథను నమ్ముకుని, కెరీర్ ప్లానింగ్‌ను నమ్ముకుని, నిర్మాత వ్యాపార మెళకువలను నమ్ముకుని తన కెరీర్‌లో సినిమాలు చేసినట్లుగా కనిపించడం లేదు. కేవలం ఓ భారీ హిట్ చేసిన దర్శకుడికి ఆ తర్వాతి సినిమా చేసే ఛాన్స్ తను ఇచ్చేయడమే ఆయన కెరీర్ సూత్రం. ముందు చిత్రం అంతంత పెద్ద హిట్‌లు ఇచ్చిన దర్శకులు బుడ్డోడితో చేయడంలో చతికిల పడిపోతున్నారు.
ఎందుకు జరుగుతోందిలా?
నవతరం యువ హీరోల్లో అభినయ పరిణతి పరంగానైనా, అభిమాన ధన సంపద పరంగానైనా తిరుగులేని వాళ్లలో జూ.ఎన్టీఆర్ కూడా ఒకరు. అయితే ఇరవయ్యేళ్ల కెరీర్లో హిట్‌లను వేళ్ల మీద లెక్కపెట్టేయవచ్చు. ఎందుకు జరుగుతోందిలా? మనసా వాచా ‘కర్మేణా ‘తన’ అని చెప్పుకోగల ఒక నిర్మాత, ఒక దర్శకుడు.. లేనే లేరు! ఆపద్ధర్మంగా దర్శకుల్లో గెలుపుగుర్రాల వెనుక వెంపర్లాడుతూ వారికి ఫ్లాప్‌లు రుచిచూపించడమే జూనియర్ కెరీర్‌లా నడుస్తోంది. దర్శకులు తర్వాతి చిత్రాలతో నిలదొక్కుకుంటున్నారు. కానీ బుడ్డోడు మళ్లీ మళ్లీ బోర్లా పడుతున్నాడే గానీ.. మధ్యలో అసలు లేవడం చాలా తక్కువ. ఎందుకిలా జరుగుతోంది. లోపం ఏమిటి? ఎక్కడ ఉంది?
బుడ్డోడి పసితనం లోని అనుభవరాహిత్యమేనా?
కథలను జడ్జ్ చేసే సామర్థ్యం లేకనా? కనీసం అలాంటి సమర్థుల దన్ను కూడా లేకపోవడం వల్లనా? స్థాయికి మించిన అహంకారం సమయానికి ముందే తనను కమ్మేయడం వల్లనా? ఏ రకంగాచూసినా.. బుడ్డోడికి ముందు ముందు కూడా గడ్డు రోజులే కనిపిస్తున్నాయి. కెరీర్‌గ్రాఫ్ ప్రస్తుతం శవాసనం నుంచి.. ఊర్థ్వాసనం లోకి మారాలంటే.. చాలా జరగాలి. రోగం నయం కావడానికి పథ్యం తప్పదు. కొన్ని కఠిన నిర్ణయాలు అవసరం. మరి అందుకు బుడ్డోడు సిద్ధంగా ఉన్నాడా??
ఎవడ్రా అన్నది… రాజకీయాల్లో హత్యలుండవ్.. ఆత్మహత్యలు మాత్రమేనని…!!
సినిమా రంగంలో కూడా అంతే!!
సుదుర్దర్శమిదం రూపం దృష్టవానపి యన్మమ ।
దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శన కాంక్షిణ: ॥
‘‘నీవిప్పుడు నాయొక్క ఏ రూపాన్నయితే చూశావో.. దానిని చూడడం అంత సులభం కాదు. దేవతలు కూడా ఎప్పుడూ దాన్ని చూడాలని కోరుకుంటూ ఉంటారు…’’ అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో! అర్జునుడికి విశ్వరూపాన్ని చూపించిన తర్వాత కృష్ణుడు ఈ డైలాగు వేస్తాడు. ఎందుకో బుడ్డోడిని` సినిమా నటుడిగా ఎలాంటి కోణంలో అయినా వీసమెత్తు లోపం ఎంచలేని పరిపూర్ణ ప్రతిభావంతుడైనప్పటికీ.. కెరీర్‌లో నిత్యం ఎగుడుదిగుడులు రుచిచూస్తూ ఉండే అతడి కెరీర్ ప్లానింగ్‌ని చూసినప్పుడు ఎందుకోగానీ ఈ శ్లోకం గుర్తుకు వస్తుంది. ఈ శ్లోకాన్ని జూ.ఎన్టీఆర్ తన అభిమానులకు చెబుతున్నట్లుగా అనిపిస్తోంది. ఆది, సింహాద్రి, యమదొంగ వంటి విజయాల తర్వాత.. అభిమానులతో జూనియర్.. ‘‘మీరిప్పుడు ఏ విజయాలనైతే చూశారో వాటిని చూడడం అంత ఈజీకాదు. అభిమానులంతా ఎప్పుడూ దాన్ని చూడాలని కోరుకుంటూ ఉంటారు’’ అని మార్చి చెప్పినట్లుగా అనిపిస్తుంది. ఆయన నట విశ్వరూపం, విజయాల విశ్వరూపం అంతా గతించిపోయిన చరిత్రేనా అని బాధపడే వారూ, జాలిపడే వారూ ఉన్నారు. విశ్వరూపం ఆల్రెడీ చూపించేశాను.. చూడాలని కోరుకోవచ్చు గానీ.. మళ్లీ మళ్లీ చూపించను.. అని కృష్ణుడు చెప్పినట్లుగా జూనియర్ అభిమానుల్ని ప్రతిసారీ నిరాశపరుస్తున్నారు. అభిమానులన్నాక అలాగే కోరుకుంటారు. వారు ఆశలు పెంచుకోవడానికి తగిన ప్రతిభ మరియు స్టామినా కూడా పుష్కలంగా నటుడాయె. వారి తప్పేముంది? కానీ రెండు దశాబ్దాలు దాటిన రెండు పదుల సినిమాలు దాటిన కెరీర్‌లో సూపర్‌హిట్‌లు లెక్కపెట్టాలంటే ఒకచేతి వేళ్లే సరిపోతాయి. మరి లోపం ఎక్కడుంది? ఆ విషయం అర్థం చేసుకోవడానికే ‘గ్రేట్ ఆంధ్ర’ విశ్లేషణ!
సహజలోపం ఒకటుంది
సినిమా ఇండస్ట్రీలో నవతరం హీరోలందరినీ ఒకసారి పరిశీలించి చూడండి. మహేష్‌బాబు, రాంచరణ్, ప్రభాస్, అర్జున్, విష్ణు, నాగచైతన్య.. ఇలా ఎవ్వరిని చూసినా వారి వెనుక ‘సహజంగా’ ఎవరో ఒకరు ఉన్నారు. ఈ హీరోలకు సంబంధించి కథలు వినడం ఎంచుకోవడం కెరీర్ ప్లాన్ చేయడం.. లాంటి సమస్త బాధ్యతలను నిర్వర్తించడాన్ని` ‘మన’ అనే సంపూర్ణమైన భావనతో చేసేవాళ్లు అందరికీ ఉన్నారు. ఒక్క జూనియర్ ఎన్టీఆర్‌కు మాత్రమే లేరు. నందమూరి వారసుడిగా.. తనకు ఇష్టంలేకపోయినా ‘జూనియర్’ అనే ప్రిఫిక్సు పేరు ముందు అంటుకుపోగా సినీ ఇండస్ట్రీలోకి ఎంటరైన ఎన్టీఆర్‌కు అందరిలాంటి పెద్దదిక్కు లేకపోవడమే అసలు లోపం.
అక్కడినుంచి ఎంచదగిన లోపాలన్నీ దానితో ముడిపడినవి మాత్రమే. ఆయనకు మంచీ చెడూ చెప్పే వారు లేరు. పసివాడికి నిప్పు పట్టుకుంటే కాలుతుందని పెద్దలు చెప్పాలి. వినకుండా పట్టుకుంటే` ఏమవుతుందో వాడికి స్వానుభవం నేర్పుతుంది. చెప్పే పెద్దలే లేకపోతే ఏమౌతుందో జూనియర్ విషయంలో కనిపిస్తుంది. ప్రతిభకు కొదవలేదు. నటన, అభినయం, డ్యాన్సులు, ఫైట్స్, కామెడీ టైమింగ్ అన్నింటిలోనూ నెంబర్‌వన్‌ల వరుసలోనే తొలినుంచి ఎన్టీఆర్ ఉంటున్నారు.
అయితే కెరీర్ మాత్రం నిత్యం నెంబర్ వన్‌గా సాగడం లేదు. కానీ వైఫల్యమూలాలను అన్వేషిస్తున్నప్పుడు తెలిసే వాస్తవాలు కొన్ని ఉన్నాయి.
తొలినాళ్లలో కొందరు హితులు ఎన్టీఆర్ కోటరీలో ఉండేవారు. వారు ఆయన ఎంచుకునే సినిమా కథలను జడ్జి చేసి కెరీర్ ప్లానింగ్‌లో కీలకంగా ఉండేవారు. ఆ తర్వాత వారిని ఆయనే దూరం చేసుకున్నాడు. ఈలోగా తనకే కథలను జడ్జి చేసుకునే కెపాసిటీ వచ్చిందనుకున్నాడు. ఆ పాటి సినిమాల అనుభవంలో అలవడక పోవడానికి జడ్జిమెంట్ అనేది బ్రహ్మవిద్య కాదు. కానీ, సంగతి ఏంటంటే.. ఆ జడ్జిమెంట్ తెలియడానికంటె ముందే ఆది, సింహాద్రి రూపంలో భారీ హిట్‌లు ఆయన ఖాతాలో జమ అయ్యాయి. అహంకారం ఆవరించింది. జడ్జిమెంట్ కెపాసిటీని అది రాహువులా మింగేసింది. మళ్లీ మునుపటి విజయాలు రుచిచూడాలంటే ముందు ఆయన అహంకార గ్రహణం నుంచి బయటకు రావడం తప్పనిసరి.
తనవాళ్లను తయారుచేసుకోవాలి
తెలుగుతెర మహానటుడు ఎన్టీఆర్ స్వయంగా వెండితెరకు పరిచయం చేసిన పసివాడు ఈ జూనియర్. హీరోగా అవతారమెత్తిన తొలిరోజుల్లో ఆయనకు దన్నుగా సుకుమార్, డాంగే తదితరులు కొందరు ఉండేవారు. ఆయన కోటరీ అన్నమాట. ఎన్టీఆర్ హితులుగా వీరు యావత్ పరిశ్రమ పెద్దలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉండేవారు.
నిర్మాతలు, దర్శకులతో భేటీలు వేస్తుండేవారు. ఎన్టీఆర్ తాలూకు మనుషులు అందరితోనూ కలుస్తున్నారనే భావన పరిశ్రమలో ఉంటుండేది. ఎన్టీఆర్ పట్ల పరిశ్రమ వ్యక్తులో ఒక పాజిటివ్ అభిప్రాయం ఏర్పడడానికి వారు పనిచేస్తుండేవారు. అలాంటి వాళ్లందరినీ ఎన్టీఆర్ కేవలం తన నోటిపొగరుతో దూరం చేసుకున్నాడు. విదేశీ కెరీర్‌ను వదులుకుని తనకోసం వచ్చిన ఎన్నారై సుకుమార్‌ను నలుగురిలో అవమానించి వెళ్లగొట్టాడని అంటుంటారు.
ఆ తర్వాతి కాలంలో కొడాలి నాని వంటి వాళ్లు చేరిక అయ్యారు. నా అన్నయ్య కంటె ఎక్కువ అంటూ నాటకీయంగా ఈ బంధం మొదలైంది. ఎన్టీఆర్‌కు ఆయన ఎంత ఉపయోగపడ్డారనే లెక్కకంటె, ఎన్టీఆర్‌ను ఆయన ఎంతగా తన ఎదుగుదలకు సోపానంగా వాడుకున్నారనేది చాలా ఎక్కువ. మధ్యలో ఎన్టీఆర్ ఓ మేనేజర్‌ను చేరదీశాడు.
అప్పటికే పూరీ జగన్నాధ్ కొన్ని కోట్లరూపాయల మేర ముంచేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని, తెలిసీ ఎందుకు చేరదీశాడో అర్థంకాదు. అతగాడిని తన సొమ్ముకు బినామీగా ఉంచి నిర్మాత హోదాకు పెంచేందుకు కూడా ఎన్టీఆర్ ఉత్సాహపడ్డాడు. అయితే స్థాయి, సరుకు లేని వ్యక్తులంతా చుట్టూ చేరడంతో సినిమాలను కెలికి కెలికి నాశనం చేయడం మొదలెట్టారు. హిట్‌లు అదృష్టవశాత్తూ తగలడం, ఫ్లాప్‌లు అలవాటుగా ఎదురుకావడం మొదలైంది.
హిట్ దర్శకుల వెంట అర్థంలేని పరుగు
‘ఇందులో అద్భుతమైన ఫైట్‌లు, యిరగదీసే డ్యాన్సులు, పొట్టచెక్కలయ్యే కామెడీ ఇవన్నీ ఉన్నాయ్’ అని ప్రమోషన్ కోసం హీరోలు చెబుతుంటారు గానీ.. అన్నింటికంటె ముందు పక్కాగా ఉండాల్సింది కథ! ఆసంగతి వారికి కూడా తెలుసు. కానీ దాని గురించి మాట్లాడరు. పట్టించుకోరు. తమ కరిష్మా మీద ఆడేస్తుందని నిత్యం ఆత్మవంచన చేసుకుంటూ ఉంటారు. కాంబినేషన్లు ప్రధానం అనే కబోదితనంతో ముందుకు సాగుతుంటారు.
ఎన్టీఆర్ కూడా ఆ ఊబిలో పడిపోయారు. ఈ వ్యాసం ప్రారంభంలో మనం ప్రస్తావించుకున్న పేర్ల జాబితా అదే. ఎన్టీఆర్ కు తనకోసం తనొక దర్శకుడిని ఎంచుకుని, కథను ఎంచుకుని, ముందుకు సాగడం అనే అలవాటు లేకుండాపోయింది. ఇతరుల హిట్‌ల ఆధారంగా దర్శకుల్ని ఎంచుకోవడంతోనే అసలు సమస్య వస్తోంది. తొలి జాబితాలోని దర్శకుల్ని చూస్తే.. వారు అదివరకు భారీ హిట్‌లు ఇచ్చి ఉంటే, ఎన్టీఆర్ వెంటనే వారిని పట్టుకుని కాల్షీట్లు ఇచ్చేస్తాడు. అంతటితో ఆగదు. వారు చేసిన కథను తననుంచి ‘ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో అలా’ అనే మిషమీద కెలకడం ప్రారంభిస్తాడు. సినిమాలు నానా కంగాళీ అవుతుంటాయి. పాపం హిట్ కొట్టిన సదరు దర్శకులకు ఎన్టీఆర్ ఫ్లాప్‌లను రుచిచూపించడం అలవాటైపోయింది.
అసలు దర్శకుల్ని ఫిక్స్ చేసుకున్న తర్వాత.. ‘ఒక మంచి సినిమా చేద్దాం’ అనే మాట ఎన్నడూ అనకుండా ‘దాని కంటె పెద్ద హిట్ చేద్దాం’ అంటూ వాళ్లు డిస్కషన్స్ ప్రారంభిస్తుంటారంటే.. కెరీర్ ప్రస్థానం ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు.
తనవాళ్లంటూ ఇప్పటికీ లేరు..
తొలిరోజుల్లో సహజంగా ఉండే పెద్దదిక్కు లేకపోవడం వేరు. కనీసం ఇండస్ట్రీలో ఇన్నాళ్లుగా హీరోగా ఉన్నాక ఇప్పటికైనా ‘తన’ అని చెప్పుకోడానికి ఒక వర్గం తయారై ఉండడం ఏ హీరోకు అయినా తప్పనిసరి. మహేష్‌బాబు, రాంచరణ్, అర్జున్ ఇలా ఎవరిని తీసుకున్నా.. వారికోసం ఎప్పుడైనా సరే రెడీగా ఉండే నిర్మాతలు, దర్శకులు అంటూ కొందరున్నారు. అలాంటి ‘తన’వర్గం ఎన్టీఆర్‌కు లేదు. పరిస్థితి ఎంత ఘోరంగా మారిపోయిందంటే.. చివరికి తెలుగుదేశం పార్టీతో సున్నం పెట్టుకున్న తర్వాత.. ఆయన అభిమానుల కేటగిరీ కూడా పలచబడిపోయింది. సామాజిక వర్గ సమీకరణల ప్రభావం రాజకీయాల్లాగా సినిమాలపై కూడా గణనీయంగా ఉంటుందనడంలో సందేహం లేదు. అలా కమ్మవారంతా.. ‘మహేష్‌బాబు, నాగార్జున హిట్ కొడితే మాకు హిట్ వచ్చినట్టు కాదు బాసూ.. నందమూరి వాళ్లు కొడితేనే అది మా హిట్ లెక్క’ అంటూ తమ కులాన్ని నందమూరి వంశంతో అయిడెంటిఫై చేసుకుని.. జూనియర్‌ను కూడా ఆదరించడం తమ బాధ్యతగా పెట్టుకున్నారు. అయితే తెదేపాతో సున్నం అయ్యాక.. ఆ సామాజికవర్గం కూడా దూరం అయింది. ఆ వర్గంలో ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గింది.
గ్రహపీడ తొలగాల్సిందే…
జూనియర్ ఎన్టీఆర్ పుష్కలమైన ప్రతిభ కలిగిఉన్న నటుడు. తన ప్రతిభకు తగినంత హిట్‌లను సొంతంచేసుకోవాలంటే.. గ్రహణంలా పట్టిన అహంకారాన్ని తగ్గించుకోవాలి. ఒకరికి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడినే ఎంచుకుని వారి వెంట పరుగులెట్టడానికి తానేమీ చిల్లర నటుడు కాదు. మామూలు దర్శకులకైనా కెరీర్ బెస్ట్ హిట్‌లు ఇవ్వగల నటుణ్ని తానని ఆయన నిరూపించుకోవాలి. సినిమాలు ఫ్లాప్ అయిన ప్రతిసారీ.. ఆ తర్వాతి కథను ఎడాపెడా కెలికేయడం కాదు.. లేదా, అప్పటికి మార్కెట్‌లో సూపర్‌హిట్ కొట్టిన దర్శకుడితో డీల్ మాట్లాడుకోవడం కాదు.. తన పరంగా ఉండే లోపాలను చక్కదిద్దుకోవాలి.
టాలీవుడ్‌కు పెద్దదిక్కుగా నిలిచిన వారిలో ఒకరైన మల్లెమాల సుందరరామిరెడ్డి అంతటి పెద్దాయన స్వయంగా తన వద్దకు వస్తే.. బయట కూర్చోని వెయిట్ చేయమని చెప్పడం అంటే.. దాన్నేమనాలి? అభిమానులు దాన్ని ఏపేరుతోనైనా పిలవొచ్చు గాక.. కానీ అది మారితే తప్ప జూనియర్ ఎన్టీఆర్ సంపూర్ణమైన హిట్ ల బాట పట్టే అవకాశం మాత్రం లేదు.
కపిలముని