‘ఇంత అన్యాయం చేసేవాళ్లు ఇంకొకరు ఉండరు’.. ‘ప్రజలందరూ భాజపాకు బుద్ధి చెప్పే రోజు వచ్చింది’, ‘మిత్రపక్షాలన్నీ కూడా మోడీని అనుమానంగా చూస్తున్నాయి’ ‘ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో కష్టమే..’…
ఇవి మాత్రమే కాదు. ఇలాంటి అనేకానేక డైలాగులు శతఘ్నల్లోంచి పేలుతున్నాయి. ఈ డైలాగుల్ని మాటల తూటాల్ని గమనించిన వారు ఎవరైనా సరే.. ఈ పార్టీలు ఇక కలసి ఉండడం కల్ల అనుకోవాల్సిందే. చూడ్డానికి అంత సీరియస్ గానే ఈ రెండు పార్టీలు, రెండు ప్రభుత్వాలు కొట్టేసుకుంటున్నాయి.
ఈ పోరాటం ఇది నిజమేనా! అనే సందేహాలకు వ్యంగ్య రూపమే ఈ కార్టూన్.
ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారనుకోండి.. టైంపాస్ కోసం సరదాగా కొట్టేసుకుంటారు. కాసేపట్లో అమ్మ బువ్వ తినడానికి పిలిచిందంటే.. లేచి చొక్కా లాగూలకు అంటిన దుమ్ము దులిపేసుకుని.. భోజనాల బల్ల దగ్గరకు చెట్టపట్టాలేసుకుని తయారవుతారు. మరి వాళ్లు కొట్టుకునే వైనం చూసి అమ్మానాన్నలు కంగారు పడితే.. పప్పులో కాలేసినట్టే.
ఇప్పుడు రాష్ట్రప్రజలది కూడ అమ్మానాన్నల లాంటి అమాయకమైన పరిస్థితి. చిన్న పిల్లల సరదా క్రీడ లాగా.. చాలా సీరియస్ గా తెలుగుదేశం మరియు భాజపా కొట్టేసుకుంటూ ఉన్నాయి. కానీ హఠాత్తుగా ఇప్పుడు ఎన్నికలు వచ్చాయనుకోండి.. ప్రజలనుంచి ఓట్లు కొల్లగొట్టడానికి వీరిద్దరూ ఎంచక్కా చిరునవ్వులు రువ్వుకుంటూ కలిసిపోతారు. వారి పోరాటటంచూసి కంగారు పడితే ప్రజలు (గల్లా జయదేవ్ భాషలో) ఫూల్స్ అవుతారు.
ఒక్కముక్కలో చెప్పాలంటే.. ఈ స్థాయిలో కొట్టుకోవడం కంటె.. ఒకేసారి విడిపోయి ఇంకా గట్టిపోరాటం సాగించడం బెటర్! దాని వల్ల ఫలితం గ్యారంటీగా దక్కుతుంది అని ప్రజలు అనుకుంటున్నారు.