ఇది నిజంగా శుభపరిణామం. మనలో మనకు రాజకీయ వైరుధ్యాలు ఎన్నయినా ఉండవచ్చు. కానీ రాష్ట్రపయోజనాల విషయానికి వచ్చేసరికి అంతా ఒక్కతాటిపై నడవాల్సిందే. ఇంతటి సదాశయం, స్ఫూర్తి పరిఢవిల్లాయని అనలేం గానీ.. అందరూ చేతులు కలపకపోయినా సరే.. అందరూ ఒక్కతాటిపై నిలబడ్డారు.
కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే విషయంలో కేంద్రానికి ముచ్చెమటలు పట్టించే విషయంలో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్.. ఇలా జెండాలతో సంబంధం లేకుండా.. అందరూ సమాన స్థాయిలో పోరాటపథం తొక్కుతున్నారు. తమ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని పార్లమెంటులో దిక్కులు పిక్కటిల్లేలా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్నాళ్లకైనా రాష్ట్ర పరిస్థితులు సంక్షోభంలో ఉన్నప్పుడు.. అన్ని పార్టీల వారు.. ఐక్యంగా కాకపోయినప్పటికీ.. ఒకే వేదిక వద్ద ఒకే నినాదాన్ని వినిపించడం ఆశావహ పరిణామం.
కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగింది. కేంద్రప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కూడా భాగస్వామిగా ఉన్నది గనుక.. మంత్రి పదవులు కూడా అనుభవిస్తున్నది గనుక.. ఈ బడ్జెట్ కు వ్యతిరేకంగా నిరసన గళాన్ని వినిపించడంలో దూకుడుగా ఉండడం వారికి సాధ్యంకాదు అని అంతా అనుకున్నారు. తొలిరోజుల్లో చంద్రబాబునాయుడు స్పందించిన తీరు కూడా అలాగే కనిపించింది.
కానీ సోమవారం ఉదయానికల్లా పరిస్థితులు పూర్తిగా మారాయి. తెలుగుదేశం నాయకులు, ఎంపీలు కూడా బడ్జెట్ పై సీరియస్ గా నిరసన తెలియజేయడం ప్రారంభించారు. రాజ్ నాథ్ తో భేటీ అయ్యారు, జైట్లీతో నిన్న భేటీకి ప్రయత్నించారు… మోడీ అపాయింట్ మెంట్ ను కేవలం సుజనా చౌదరికి మాత్రమే ఇచ్చారు.. అక్కడితో తెలుగుదేశం వారికి బాగా క్లారిటీ వచ్చిందేమో గానీ.. ఆ తర్వాత జైట్లీ, వెంకయ్యనాయుడు చర్చలకు పిలిచినా కూడా వీరు వెళ్లలేదు.
వైఎస్సార్ కాంగ్రెస్ తొలుత తెలుగుదేశాన్ని తప్పుపట్టింది. పార్లమెంటు వెలుపలకాదు.. లోపల కూడా నిరసనలు తెలియజేయాలని రెచ్చగొట్టింది. దాని పర్యవసానమో ఏమోగానీ.. మొత్తానికి ఇవాళ పరిస్థితి ఎలా ఉన్నదంటే.. లోక్ సభలో స్పీకరు ఎదుట ఉండే వెల్ లో 13మంది తెలుగుదేశం ఎంపీలు, 4గురు వైసీపీ ఎంపీలు (ఐక్యంగా కాదండోయ్) తమ నిరసన గళాలను వినిపిస్తున్నారు.
అందరి నినాదం ఒక్కటే.. ‘హెల్ప్ ఆంధ్రప్రదేశ్’! అటు రాజ్యసభలో కూడా పరిస్థితి అచ్చంగా ఇలాగే ఉంది. అక్కడ కాంగ్రెస్ కూడా నిరసనల బాటలోనే ఉంది. మొత్తానికి ఒక్క విషయంలో అన్ని పార్టీలూ.. కేంద్రం అనుసరిస్తున్న అనుచితమైన, దుర్మార్గపు పోకడలకు వ్యతిరేకంగా గళం వినిపిస్తుండడం మంచి పరిణామమే అని.. ఇలాం అన్ని పార్టీలూ ఒకే నిరసనను వెలిబుచ్చడం వల్ల.. కేంద్రంపై ఖచ్చితంగా ఒత్తిడి పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.