రెండు రోజులుగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎంపీలు అందరూ ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. బడ్జెట్ లో తమకు అన్యాయం జరిగిందని అంటున్నారు. విభజన హామీలను నెరవేర్చడం లేదని పట్టుపడుతున్నారు. సభను స్తంభింపజేస్తున్నారు. ప్యాకేజీ అని చెప్పి ఒక్కరూపాయి కూడా విదిలించలేదని ఆగ్రహిస్తున్నారు. ఇంతా జరుగుతోంటే.. వీరి ఆందోళనలకు కేంద్రమంత్రులు స్పందించారు. రాజ్యసభలో వివరణ ఇచ్చారు.
తెలుగుదేశం ఎంపీల ఆందోళనలకు కేంద్రమంత్రి జైట్లీ స్పందన తెలియజేస్తారని సభాపతి ముందే ప్రకటించి.. వారిని ఉపశమింపజేశారు. నిజానికి జైట్లీ మాత్రమే కాదు.. రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కూడా మాట్లాడారు. కానీ ఇద్దరూ కూడా.. రాష్ట్రానికి ఏమాత్రం న్యాయం చేయని.. డొంకతిరుగుడు మాటలనే సెలవిచ్చారు. ఇన్నాళ్లుగా ఎలాంటి డొంకతిరుగుడు మాయమాటలతో ప్రజలను మోసం చేస్తూ వచ్చారో.. మరోసారి రాజ్యసభలో స్పందన పేరిట అదే మోసాన్ని పునరుద్ఘాటించారు.
వివరాల్లోకి వెళితే..
ఏపీకి చెందిన తెలుగుదేశం, వైసీపీ, కాంగ్రెస్ ఎంపీలందరూ చేస్తున్న ఆందోళనలకు మంగళవారం చిన్న స్పందన, ఫలితం అయినా లభిస్తుందనే ఆశ కొంత కనిపించింది. అరుణ్ జైట్లీ సభలో తన స్పందన తెలియజేస్తారని అన్నప్పుడు కొంత ఆశలు చిగురించాయి. అయితే తన స్పందన ప్రారంభించిన జైట్లీ.. ఆంధ్రప్రదేశ్ కు హామీ ఇచ్చిన మొత్తాన్ని వేర్వేరు మార్గాల్లో అందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని సెలవిచ్చారు.
అంతుకు మించి లోతుల్లోకి ఆయన వెళ్లలేదు. నిజానికి నాబార్డ్ రుణం ఇప్పిస్తాం, ప్రపంచబ్యాంకు రుణం ఇప్పిస్తాం అంటూ రాష్ట్రప్రభుత్వాన్నే ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప.. కేంద్రం తమ వంతుగా చేయాల్సింది ఏమిటో చేయడంలేదనే విషయంలోనే పోరాటం జరుగుతోంది. మళ్లీ జైట్లీ.. ‘వేర్వేరు మార్గాల ద్వారా నిధులు ఏర్పాటుచేస్తాం’ అంటున్నారే తప్ప.. స్పష్టంగా.. ఆ రాష్ట్రానికి మేం అండగా ఉంటాం అని ఒక్కమాట కూడా చెప్పకపోవడం ఘోరం అని పలువురు భావిస్తున్నారు.
రెవిన్యూ లోటు విషయంలో కూడా.. 14వ ఆర్థిక సంఘం అమల్లోకి రావడానికి ముందు పదినెలల కాలానికి మాత్రమే రెవిన్యూలోటుకు తమ పూచీ ఉన్నదని.. అది కూడా లెక్క తేలడం లేదని.. త్వరలోనే ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శిని ఢిల్లీని పిలిపించి దీనికి సంబంధించి చర్చిస్తాం అని జైట్లీ చెప్పారు. అసలు మోసం అంతా ఇక్కడే ఉంది. కానీ ఆందోళనల ఎలాంటి ఫలితమూ లేని మరో మోసపూరిత స్పందనను మాత్రమే జైట్లీ వెలిబుచ్చారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కూడా తక్కువ తినలేదు. విశాఖకు రైల్వేజోన్ ఇచ్చే విషయంలో ఇతర రాష్ట్రాలతో కూడా చర్చలు జరపాల్సి ఉన్నదంటూ.. పీటముడి పెట్టేశారు. విశాఖ రైల్వేజోన్ కు ఉన్న అసలు సమస్యే అది. విభజన చట్టంలో హామీ ఉన్నప్పుడు.. దానిని అమలు చేయాల్సిందిపోయి.. ఇప్పుడు రాష్ట్రం నుంచి డిమాండు తీవ్రరూపం దాల్చేసరికి ఇతర రాష్ట్రాలతో కూడా చర్చించిన తర్వాత.. ఒక నిర్ణయానికి వస్తాం అంటూ చెప్పడం అనేది రైల్వేజోన్ విషయంలో కూడా మరో వంచన అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
మరి చంద్రబాబునాయుడు తన రాష్ట్రంకోసం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.