అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వేంకటగిరినాధుని ప్రతినిత్యం 70 వేల మందికి పైగా భక్తకోటి దర్శించుకుంటూ ఉంటేనే.. అంటే రోజులో కనీసం విడతలు విడతలుగా గంట కంటె మించని సమయమే భక్తులను నియంత్రిస్తూ ఉన్నప్పటికీ.. శ్రీవారి ఆలయంలో అనేకానేక అరాచకాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. స్వామి వారి నగలు మాయం అయ్యాయని, ఆలయంలో ఒక భాగం అయిన పోటులో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారని ఇలా అనేక ఆరోపణలు వినిపించాయి. అలాంటిది ఏకంగా 8 రోజులపాటు కనీసం ఒక్క భక్తుడిని కూడా తిరుమల ఆలయంలోనికి కూడా రానివ్వకుండా.. నిషేధం పెట్టడం అంటే.. గుడిలోపల ఇంకెన్ని అరాచకాలకు పాల్పడతారో.. ఎన్ని అన్యాయాలకు ఒడిగడతారో అనే భయాలు పలువురిలో కలుగుతున్నాయి.
మహా సంప్రోక్షణ అనేది ఆలయాలకు కొత్త కాదు. ప్రతి ఆలయానికీ జరుగుతుంది. ఆలయానికి మరమ్మతులు జరిగే సందర్భాల్లోనూ మూలవిరాట్టును పదిలంగా ఉంచి.. బాలాలయం ఏర్పాటుచేసి.. మూలవిరాట్టు ప్రతిమను /పూర్ణకుంభం అక్కడ ఉంచి.. అక్కడ వరకు దర్శనాలను అనుమతిస్తారు.
అయితే తిరుమల శ్రీవారి విషయంలో టీటీడీ బోర్డు చాలా చిత్రంగా వ్యవహరిస్తోంది. వారి తీరు అనుమానాస్పదంగా కూడా తయారవుతోంది. మహోసంప్రోక్షణం రోజుల్లో తిరుమలేశుని గర్భగుడిలో మరమ్మతులు జరుగుతాయి. మూలవిరాట్టు స్వామివారి శక్తిని పూర్ణకుంభంలోకి ఆవాహన చేసి.. పరకామణి వద్ద బాలాలయం ఏర్పాటుచేస్తారు. గర్భగుడిలో అర్చకులే మరమ్మతులు నిర్వహిస్తారు. ఈ ప్రక్రియను వద్దని, ఇలాంటి మహాసంప్రోక్షణ చేయకుండా.. భక్తులను అనుమతించాలని ఎవరూ అనడం లేదు. అయితే బాలాలయం వరకైనా భక్తులను అనుమతించి తీరాలి. ఏ ఆలయంలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నా అలాగే చేస్తారు.
టీటీడీ అధికారులు చిత్రంగా.. ఆలయంలోనికి కాదు కదా.. అసలు తిరుమల గిరులకే భక్తులను రానివ్వం అంటూ నిషేధాజ్ఞలు విధిస్తున్నారు.
తిరుమల విషయంలో ఇటీవలి కాలంలో చాలా వివాదాలు వెలుగుచూసిన నేపథ్యంలో ఇలాంటి ఆదేశాల మీద ఇంకా అనుమానాలు పెరుగుతున్నాయి. భక్తులు వేలాదిగా నిత్యం వస్తూ ఉన్న రోజుల్లోనే పోటులో తవ్వేసి గుప్త నిధులకోసం వెతికారని… సాక్షాత్తూ ఆ సమయంలో ప్రధాన అర్చకులుగా పనిచేసిన రమణ దీక్షితులే ఆరోపించారు. రాజకీయాల సంగతి పక్కన పెడితే అలాంటి ఆరోపణలను మరీ అంత తేలిగ్గా తీసుకోలేం.
అలాంటి నిర్వాకాలు చేసే మనుషులు ఉన్న స్వామివారి సన్నిధిలో… అసలు ఒక్క భక్తుడిని కూడా అనుమతించకుండా.. గుడిని మూతపెడితే.. ఇంకెన్ని అరాచకాలు సృష్టిస్తారో అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. తన పట్ల జరిగే అరాచకాలు, అపచారాలనుంచి స్వామివారు తనని తానే రక్షించకోవాల్సిందే తప్ప.. మరో ప్రత్యమ్నాయం లేదని భక్తులు భావిస్తున్నారు.